తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Prediabetes । వీరికి మధుమేహం వచ్చే ముప్పు ఎక్కువ.. ఈ జాబితాలో మీరు ఉంటే జాగ్రత్త!

Prediabetes । వీరికి మధుమేహం వచ్చే ముప్పు ఎక్కువ.. ఈ జాబితాలో మీరు ఉంటే జాగ్రత్త!

HT Telugu Desk HT Telugu

04 January 2023, 13:23 IST

google News
    • Prediabetes: ప్రీడయాబెటిస్‌ నుంచి టైప్ 2 డయాబెటిస్‌గా నిర్ధారణ అయ్యేందుకు ఈ కింద పేర్కొన్న కారకాలు దోహదం చేస్తాయి, మీకు ఈ రకమైన అలవాట్లు ఉంటే వీలైనంత త్వరగా మార్చుకోండి.
Prediabetes
Prediabetes (Pixabay)

Prediabetes

మధుమేహం అనేది ఈరోజుల్లో వయసుతో సంబంధం లేకుండా చాలా మంది ఎదుర్కొంటున్న ఒక తీవ్రమైన అనారోగ్య సమస్య. డయాబెటీస్ రావడానికి కచ్చితమైన కారణం తెలియదు. కానీ, ఇది వచ్చినపుడు రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుంది. ప్యాంక్రియాస్ తగినంత ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేయకపోవడమే దీనికి కారణం. డయాబెటిస్‌లో టైప్ 1, టైప్ 2 ఉంటాయి, ఇవి రెండూ జన్యుపరమైన లేదా పర్యావరణ కారకాల వల్ల సంభవించవచ్చు.

అయితే కొందరికి రక్తంలో చక్కెర స్థాయిలు సాధారణం కంటే ఎక్కువే ఉంటాయి, కానీ అది డయాబెటిస్ కాదు. ఈ పరిస్థితిని ప్రీడయాబెటిస్ (Prediabetes) అంటారు. ప్రీడయాబెటిస్ ఉన్న చాలా మందికి లక్షణాలు కనిపించవు, ఇది క్రమక్రమంగా టైప్ 2 డయాబెటిస్‌గా నిర్ధారణ అవుతుంది. అంటే సరైన జీవనశైలి అనుసరించకపోవడం, ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లు లేని వారికి ఈ టైప్ 2 డయాబెటిస్‌ వచ్చే ప్రమాదం అధికం.

Diabetes Causes To Prediabetics - వీరికి మధుమేహం ముప్పు ఎక్కువ

ప్రీడయాబెటిస్‌ నుంచి టైప్ 2 డయాబెటిస్‌గా నిర్ధారణ అయ్యేందుకు ఈ కింద పేర్కొన్న కారకాలు దోహదం చేస్తాయి, మీకు ఈ రకమైన అలవాట్లు ఉంటే వీలైనంత త్వరగా మార్చుకోండి, ఎందుకంటే ఒక్కసారి డయాబెటీస్ నిర్ధారణ అయ్యిందంటే దానిని నయం చేసే చికిత్స లేదు, కేవలం లక్షణాలను మాత్రమే అదుపు చేయగలం.

బరువును చెక్ చేసుకోండి

మీరు ప్రీ-డయాబెటిస్‌తో బాధపడుతున్నట్లయితే, మీ అధిక బరువు డయాబెటిస్‌కు దారితీస్తుంది. అయితే మీరు మీ శరీర బరువులో 5-10 శాతం తగ్గించుకోవడం వల్ల మధుమేహం ముప్పును ఆలస్యం చేయడం లేదా తిప్పికొట్టే అవకాశాలను గణనీయంగా మెరుగుపరుస్తుంది. పెద్ద నడుము కొవ్వు పేరుకొని ఉంటే అది మధుమేహం రావడానికి ముందస్తు సంకేతం, కాబట్టి ఆ కొవ్వు కరిగించుకునే ప్రయత్నం చేయండి.

కార్బోహైడ్రేట్లు ఎక్కువ తీసుకోవడం

కార్బోహైడ్రేట్లు రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను ప్రభావితం చేస్తాయి. కాబట్టి కార్బోహైడ్రేట్లు కలిగిన ఆహారం మీరు ఎక్కువ తింటుంటే వెంటనే మానేయండి. ఏయే ఆహారాలలో కార్బోహైడ్రేట్లు ఉంటాయో తెలుసుకోవడం ముఖ్యం. ఆరోగ్యకరమైన ఆహారాలను ఎంచుకోండి. తెల్లని అన్నంకు బదులుగా బ్రౌన్ రైస్, బుక్‌వీట్, హోల్ ఓట్స్ వంటి తృణధాన్యాలు ఎంచుకోండి. పండ్లు, కూరగాయలు, చిక్‌పీస్, బీన్స్, కాయధాన్యాలు వంటి పప్పులు తినవచ్చు.

మాంసం ఎక్కువ తినడం

చికెన్ తినడం ద్వారా ఎలాంటి నష్టం లేదు కానీ, గొర్రె మాంసం, గొడ్డు మాంసం మొదలైన మటన్ ఎక్కువ ఉండే ఎరుపు మాంసం తినడం మంచిది కాదు. వీటితో మధుమేహంతో పాటు గుండె సమస్యలు, క్యాన్సర్‌లు వచ్చే ముప్పు ఉంది. కాబట్టి ఇలాంటి మాంసానికి ప్రత్యామ్నాయం ఎంచుకోండి. గుడ్లు, చేపలు, ఉప్పు లేని గింజలు మొదలైన ప్రోటీన్ ఆహారాలు తీసుకోవచ్చు.

చక్కెర ఎక్కువ తీసుకోవడం

చాలా మంది టీ, కాఫీలలో ఎక్కువ చక్కెర వేసుకొని తాగుతారు, స్వీట్స్ విపరీతంగా తింటారు, ఎనర్జీ డ్రింక్స్, కూల్ డ్రింక్స్, పండ్ల రసాలలోనూ చక్కెర ఎక్కువ ఉంటుంది. వెంటనే చక్కెర తినడం తగ్గించండి. చక్కెర లేకుండానే టీ, కాఫీలు, పాలు, ఇతర పండ్ల రసాలు తీసుకోవడం అలవాటు చేసుకోండి. స్వీట్స్ తినడం మానేస్తే చాలా మంచిది.

శారీరక శ్రమ లేకపోవడం

శారీరక శ్రమ లేకుంటే మధుమేహంకు స్వాగతం పలుకుతున్నట్లే. ఎల్లప్పుడూ చురుకుగా ఉండేందుకు ప్రయత్నించండి, క్రమం తప్పకుండా వ్యాయామాలు చేయండి, యోగాసనాలు వేయండి. ప్రతిరోజూ చురుకైన నడక కలిగి ఉండండి. ఎందుకంటే ఇలా మీ కండరాలకు గ్లూకోజ్ వినియోగం పెరుగుతుంది, శరీరం ఇన్సులిన్‌ను మరింత సమర్థవంతంగా ఉపయోగించడంలో సహాయపడుతుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.

ఈ పైన పేర్కొన్న అంశాలలో మీకు ఎన్ని దగ్గరగా ఉన్నాయో పోల్చుకోండి, ఇవన్నీ మీకు దగ్గరగా ఉంటే మీకు మధుమేహం దగ్గరవుతున్నట్లే, తిప్పికొట్టడం మీ చేతుల్లోనే ఉంది.

తదుపరి వ్యాసం