తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Navaratri Special Breakfast | నోట్లో వేయగానే కరిగిపోయే దహీ పోహా.. దీని రుచి కూడా వాహ్!

Navaratri Special Breakfast | నోట్లో వేయగానే కరిగిపోయే దహీ పోహా.. దీని రుచి కూడా వాహ్!

HT Telugu Desk HT Telugu

03 October 2022, 15:31 IST

google News
    • ఈ నవరాత్రులలో ఎప్పుడైనా మీరు దహీ పోహా చేసుకున్నారా? చద్దుల బతుకమ్మకు కూడా ఇది కచ్చితమైన ఉపాహారంగా ఉంటుంది. Dahi Poha Recipe ఇక్కడ అందిస్తున్నాం. ఒకసారి ట్రై చేసి దీని రుచి చూడండి.
Dahi Poha Recipe
Dahi Poha Recipe (twitter)

Dahi Poha Recipe

నవరాత్రులు చివరి దశకు చేరుకున్నాయి, అంతటా పండగ వాతావరణం నెలకొంది. చాలా మంది సిటీలను వదిలి తమ సొంతూళ్లకు వచ్చి ఆనందంగా గడుపుతున్నారు. ఇలాంటి సమయంలో రుచికరంగా నచ్చినవి చేసుకుంటూ తినాలనిపిస్తుంది. బ్రేక్‌ఫాస్ట్ కోసం ఇడ్లీ, దోశ వంటివి ఎప్పుడూ తినేవే కాస్త వెరైటీగా ఏదైనా చేసుకోవాలనుకుంటే పోహాతో మంచి అల్పాహారం చేసుకోవచ్చు.

దహీ పోహా ఈ పండగ సీజన్‌లో ఉత్తమ అల్పాహారంగా ఉంటుంది. దీనిని ఉదయం వేళ అయినా, ఉపవాస సమయాల్లోనైనా ఎప్పుడు తీసుకున్నా ఎంతో సంతృప్తిగా ఉంటుంది. సాధారణంగా దహీ పోహాను ఉత్తర భారతదేశంలో కృష్ణాష్టమి పండగ సమయంలో చేసుకుంటారు. మిగతా చోట్ల కూడా ప్రత్యేక సమయాల్లో ఈ అల్పాహారం చేసుకుంటారు. ఇది రుచిలో కొద్దిగా దద్దోజనంలా ఉంటుంది, అయితే మరింత మృదువుగా నోట్లో వేయగానే కరిగిపోతుంది. దహీ పోహా రెసిపీ కూడా చాలా సులభం, దీనిని కేవలం 10-15 నిమిషాల్లోనే సిద్ధం చేసుకోవచ్చు. మరి ఎలా చేయాలి, ఏమేం కావాలో ఇక్కడ చూసేయండి.

Dahi Poha Recipe కోసం కావలసినవి

  • 1/2 కప్పు లావు అటుకులు
  • 100 గ్రాముల పెరుగు
  • 2 టేబుల్ స్పూన్లు పాలు
  • 3 స్పూన్ నూనె
  • 1/4 టీస్పూన్ ఆవాలు
  • 1/2 స్పూన్ మినప పప్పు
  • 1/2 టీస్పూన్ శనగ పప్పు
  • 1 పచ్చిమిర్చి
  • 1 ఎండు మిరపకాయ
  • కరివేపాకు కొన్ని
  • 1/2 స్పూన్ తురిమిన అల్లం
  • ఇంగువ చిటికెడు
  • జీడిపప్పు కొన్ని
  • అవసరమైనంత ఉప్పు

దహీ పోహా తయారీ విధానం

  1. ముందుగా ఒక గిన్నెలో అటుకులను 10-15 నిమిషాల పాటు నీటిలో నానబెట్టండి. అటుకులు మెత్తబడిన అనంతరం ఆ నీటిని పూర్తిగా తీసేయండి.
  2. ఇప్పుడు నానబెట్టిన అటుకులలో పెరుగు, పాలు వేసి బాగా కలపండి. అవసరం అనుకుంటే మరిన్ని పాలు కలుపుకోవచ్చు.
  3. ఇప్పుడు ఒక బాణలిలో నూనె వేడిచేసి అందులో ఆవాలు, మినప పప్పు, ఎండు మిరపకాయ, తురిమిన అల్లం, ఇంగువ, తరిగిన పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించండి.
  4. అన్ని వేగిన తర్వాత కొన్ని జీడిపప్పు పలుకులను కూడా వేసి దోరగా వేయించండి.
  5. ఈ పోపు గోధుమ రంగులోకి మారిన తర్వాత, స్టవ్ ఆఫ్ చేసి ఇందులో అటుకుల మిశ్రమాన్ని కలిపేయండి.
  6. రుచికి తగినట్లుగా ఉప్పు సర్దుబాటు చేసుకొని బాగా కలపండి.

అంతే రుచికరమైన దహీ పోహా రెడీ. దీనిని టొమాటో చట్నీ లేదా అల్లం చట్నీతో కలిపి తింటే ఆ రుచికి మీరు ఫిదా అయిపోతారు.

టాపిక్

తదుపరి వ్యాసం