Chilli Cheeze Toast: బోరింగ్ టిఫిన్లతో విసిగిపోయిన పిల్లలకు చిల్లీ చీజ్ టోస్ట్ చేసి పెట్టండి.. రెండు రకాలుగా చేయచ్చు
22 December 2024, 7:00 IST
- Chilli Cheeze Toast: చిల్లీ చీజ్ టోస్ట్ అనేది పిల్లల టిఫిన్ కోసం టేస్టీగా, ఈజీగా తయారు చేయగలగే ఆహార పదార్థం. దీన్ని రెండు రకాలుగా తయారు చేయచ్చు. ఎలా చేసినా అందరికీ నచ్చడం మాత్రం ఖాయం. ఇది చేయడం నేర్చుకున్నారంటే బ్రేక్ ఫాస్ట్ మెనూలో కొత్త ఐటెం చేరినట్లు.
చిల్లీ చీజ్ టోస్ట్ చేసి పెట్టండి
“ఇడ్లీ, దోస, వడ, ఉప్మా ఇవన్నీ రోజూ చేసేవే కదమ్మా.. తినీ తినీ బోర్ కొడుతుంది. ఏదైనా కొత్తగా చెయ్యమ్మా ప్లీజ్!” . మీ పిల్లలు కూడా ఇలాగే అంటున్నాారా? నిజమే కదా పాపం ఈ మామూలు బ్రేక్ ఫాస్ట్ ఐటమ్స్ తరచూ చేసుకుంటూ ఉంటాం కనుక పెద్దవాళ్లకే బోరింగ్ గా అనిపిస్తుంది. ఇక టేస్టీగా, స్పైసీగా కోరుకునే పిల్లలకు మాత్రం విసుగు రాదా. తప్పకుండా వస్తుంది. పిల్లలు ఎప్పుడూ రకరకాల స్నాక్స్ తినడానికి ఇష్టపడతారు. ముఖ్యంగా ప్రతిరోజూ తీసుకెళ్లే బ్రేక్ ఫాస్ట్ లో ఏదైనా కొత్త ఐటెం కావాలని కోరుకుంటారు. కనుక వీలైనంత వరకూ వారికి రకరకాల రెసిపీలను చేసి పెడుతుంటారు తల్లులు. అలాగని ప్రతి రోజూ కష్టపడి చేయాలంటే కుదరదు కదా.
మీ కోసం ఈజీ అండ్ టెస్టీగా ఉండే రెండు రెసిపీలను తీసుకొచ్చాం. అవి మీ పిల్లలకు బాగా నచ్చుతాయి కూడా. అవే రుచికరమైన చిల్లీ చీజ్ టోస్ట్ రెసిపీలు. వీటిని రెండు రకాలుగా తయారు చేయచ్చు. ఎలా చేసినా మీ పిల్లలకు, శ్రీ వారికి నచ్చడం ఖాయం. ఆలస్యం చేయకుండా అవి ఎలా తయారు చేశారో తెలుసుకుందామా..
చిల్లీ చీజ్ టోస్ట్ తయారీకి కావాల్సిన పదార్థాలు:
-వెన్న,
-జున్ను ముక్కలు,
-నచ్చిన ఆకుకూరలు,
-కొత్తిమీర,
-వెల్లుల్లి,
-చీజ్ క్యూబ్స్,
-ఒరేగానో,
-చిల్లీ ఫ్లేక్స్
-శాండ్విచ్ బ్రెడ్ అవసరం.
తయారీ విధానం..
- చిల్లీ చీజ్ టోస్ట్ తయారు చేయడానికి ముందుగా వెల్లుల్లిని మెత్తగా కట్ చేసి పెట్టుకోవాలి.
- తరువాత వెన్న, చీజ్ క్యూబ్, వెల్లుల్లి, ఒరేగానో, మిరపకాయలను ఒక గిన్నెలో వేసి పెట్టుకోండి.
- ఇప్పుడు జున్ను(చీజ్)ను ముక్కలుగా చేసి శాండ్విచ్ బ్రెడ్ పైన మొత్తం పరచాలి.
- దానిపై ఒరేగానో, కారం రేకులను చల్లండి.
- తరువాత మరొక శాండ్విచ్ బ్రెడ్ ముక్కులుగా చేసి దానికి జున్ను(చీజ్) పూర్తిగా రాయాలి.
- రెండింటినీ ఒకదానితో ఒకటి కప్పి తరువాత వెన్నతో వేయించాలి.
- వేయించుతుంటే గుమగుమలాడే వాసన మీ నోరూరించేలా చేస్తుంది.
- చక్కగా దోరగా వేగగానే స్టవ్ ఆఫ్ చేసేయాలి.
అంతే చిల్లీ చీజ్ టోస్ట్ తయారయినట్టే.. సర్వ్ చేసి పిల్లలకు ఇచ్చేయచ్చు. లేదా వారి బాక్సులో పెట్టి స్కూలుకు పంపించవచ్చు.
మరో రకంగా కూడా తయారు చేసుకోవచ్చు..
-బ్రెడ్ ముక్కలు,
-పచ్చిమిర్చి ముక్కలు,
-పాలు,
- ఒరేగానో,
-చిల్లీ ఫ్లేక్స్,
- నచ్చిన ఆకుకూరలు
-ప్రాసెస్ చేసిన జున్ను అవసరం.
తయారీ విధానం..
- ఈ టోస్ట్ తయారు చేయడానికి, ముందుగా జున్నును ఒక గిన్నెలో తురిమి పెట్టుకోవాలి.
- తరువాత పాలు, మిరపకాయలు, పచ్చిమిర్చి, మిరప రేకులు, ఒరేగానోను కలిపి చిక్కటి పేస్టులా తయారు చేయండి.
- ఇప్పుడు ఈ పేస్ట్ ను బ్రెడ్ స్లైస్ మీద అప్లై చేసి పాన్ వేడి చేయాలి.
- తరువాత దానిపై వెన్న పోసి బ్రెడ్ ముక్కలను ఉంచాలి. ఇప్పుడు మూతపెట్టి ఉడికించాలి.
- క్రిస్పీ అయ్యే వరకు ఉడికించి తర్వాత రెండు ముక్కలుగా కట్ చేసి సర్వ్ చేయాలి.
అంతే టేస్టీ, క్రిస్పీ చిల్లీ చీజ్ టోస్ట్ రెడీ అయినట్టే. వీటికి కాస్త కెచప్ జోడించి పిల్లలకు పెట్టారంటే వావ్ మమ్మీ.. యమ్మీ యమ్మీ అనుకుంటూ తినేస్తారు.