తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Capsicum Egg Fry: క్యాప్సికం ఎగ్ ఫ్రై ఇలా చేశారంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు

Capsicum egg fry: క్యాప్సికం ఎగ్ ఫ్రై ఇలా చేశారంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు

Haritha Chappa HT Telugu

23 June 2024, 18:00 IST

google News
    • Capsicum egg fry: క్యాప్సికమ్‌ను పిల్లలు ఇష్టపడరు. దీనికి కారణం అది పచ్చివాసన వేయడమే. ఒకసారి కాప్సికం ఎగ్ ఫ్రై రెసిపీ పెట్టి చూడండి. వారు ఇష్టంగా తినడం ఖాయం.
క్యాప్సికం ఎగ్ ఫ్రై రెసిపీ
క్యాప్సికం ఎగ్ ఫ్రై రెసిపీ

క్యాప్సికం ఎగ్ ఫ్రై రెసిపీ

Capsicum egg fry: క్యాప్సికం ఇష్టపడే వారి సంఖ్య తక్కువే. అలాంటివారు ఒకసారి క్యాప్సికం ఎగ్ ఫ్రై రెసిపీ ట్రై చేయండి. ఇది తిన్నారంటే మీరు క్యాప్సికానికి కూడా అభిమాని అయిపోతారు. క్యాప్సికం పచ్చివాసన వస్తుంది. కూర వండినా ఇష్టంగా తినేవారి సంఖ్య చాలా తక్కువ. అలాంటివారు క్యాప్సికంను గుడ్డుతో పాటు వండుకొని తింటే మంచిది. దీనిలో ఎన్నో పోషకాలు ఉంటాయి. ఇవన్నీ మన శరీరానికి అత్యవసరం. క్యాప్సికంను పూర్తిగా పక్కన పెట్టకుండా ఇలా క్యాప్సికం ఎగ్ ఫ్రై రూపంలో తింటే దానిలోని పోషకాలు శరీరానికి అందుతాయి.

క్యాప్సికం ఎగ్ ఫ్రై రెసిపీకి కావలసిన పదార్థాలు

క్యాప్సికం - అరకిలో

కోడిగుడ్లు - నాలుగు

పచ్చిమిర్చి - రెండు

ఆవాలు - అర స్పూను

జీలకర్ర - అర స్పూను

పసుపు - పావు స్పూను

అల్లం వెల్లుల్లి పేస్టు - అర స్పూను

కారం - అర స్పూను

ఉప్పు - రుచికి సరిపడా

ఉల్లిపాయ - ఒకటి

కొత్తిమీర తరుగు - రెండు స్పూన్లు

క్యాప్సికం ఎగ్ ఫ్రై రెసిపీ

1. క్యాప్సికంలను శుభ్రంగా కడిగి సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి.

2. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి.

3. ఆ నూనెలో ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడించాలి.

4. తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలను వేసి వేయించుకోవాలి.

5. ఇవి రంగు మారేవరకు వేయించుకోవాలి. ఉల్లిపాయ వేయడం మీకు ఇష్టం లేకపోతే మానేయవచ్చు.

6. అలాగే పచ్చిమిర్చి తరుగును వేసి వేయించుకోవాలి.

7. ఇప్పుడు పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు వేసి వేయించుకోవాలి.

8. ఇవన్నీ బాగా వేగాక సన్నగా తరిగిన క్యాప్సికం ముక్కలను కూడా వేసి చిన్న మంట మీద వేయించాలి.

9. క్యాప్సికం ముక్కలు మెత్తగా అయ్యేవరకు ఉడికించుకోవాలి.

10. రుచికి సరిపడా ఉప్పు, కారం వేసుకొని బాగా కలుపుకోవాలి.

11. ఇప్పుడు కోడిగుడ్లను కొట్టి అందులో వేయాలి.

12. కళాయిలో కూర మీద కోడిగుడ్లను కొట్టి వేసి కలపకుండా అలానే మూత పెట్టి చిన్న మంట మీద పది నిమిషాలు వదిలేయాలి.

13. తర్వాత మూత తీస్తే పైన ఆమ్లెట్ లాగా రెడీ అవుతుంది.

14. ఇప్పుడు గరిటతో దాన్ని బాగా కలుపుకోవాలి.

15. ఆమ్లెట్ చిన్న చిన్న ముక్కలుగా అయ్యేలా కలుపుకోవాలి.

16. చిన్నమంట మీద ఒక ఐదు నిమిషాలు అలా ఫ్రై చేసుకోవాలి.

17. తరువాత పైన కొత్తిమీర తరుగును చల్లుకొని స్టవ్ ఆఫ్ చేయాలి. దీన్ని చూస్తేనే నోరూరిపోతుంది.

18. అన్నంలో కలుపుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. ఒక్కసారి ప్రయత్నించి చూడండి. అందరికీ నచ్చడం ఖాయం.

క్యాప్సికం తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. ఇది మీ జీవక్రియను పెంచడానికి సహాయపడుతుంది. అలాగే ట్రైగ్లిజరైడ్లను తగ్గిస్తుంది. కాబట్టి గుండెకు రక్షణ కలుగుతుంది. బరువు తగ్గాలనుకునేవారు క్యాప్సికంను ఆహారంలో భాగం చేసుకోవాల్సిన అవసరం ఉంది. క్యాప్సికంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు అధికంగా ఉంటాయి. ఇది క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. క్యాప్సికం, కోడిగుడ్లు రెండూ కూడా పోషక విలువలు కలిగిన ఆహారాలే. ఈ రెండింటినీ కలిపి తినడం వల్ల పోషకాలు శరీరానికి అందుతాయి.

తదుపరి వ్యాసం