Engine Oil for Hair | తలకు ఇంజన్ ఆయిల్ రాసుకుంటే జుట్టు పెరుగుతుందా?
02 April 2023, 15:41 IST
- Engine Oil for Hair: జుట్టుకు ఇంజన్ ఆయిల్ వర్తించడం మంచిదేనా? జుట్టు పెరుగుతుందా? ఏం జరుగుతుంది? నిపుణులు ఏమంటున్నారో తెలుసుకోండి.
Engine Oil for Hair
Engine Oil for Hair: తలకు రాసుకోవడానికి, జుట్టుకు వర్తించటానికి మనకు ఎన్నో రకాల నూనెలు అందుబాటులో ఉన్నాయి. వంటకు ఉపయోగించే వంటనూనెను కూడా తలకు ఉపయోగించే వారు కొంతమంది ఉంటారు. అయితే మీరెపుడైనా వాహనాలలో ఉపయోగించే ఇంజన్ ఆయిల్ ను జుట్టుకు వర్తించడం గురించి ఆలోచించారా? ఒకవేళ తలకు ఇంజన్ ఆయిల్ వర్తిస్తే ఏమౌతుంది? ఇవేం పిచ్చి ప్రశ్నలు అనుకుంటున్నారా? కానీ జుట్టు పెరుగుదల కోసం ఇలాంటి ప్రయోగాలు చేసే వారు కూడా ఉన్నారట. జుట్టు సంరక్షణ గురించి ఆందోళన చెందుతూ హెయిర్ ఆయిల్ లో ఇంజన్ ఆయిల్ ను మిక్స్ చేసి వాడకం గురించి ఇంటర్నెట్లో చాలా మంది సెర్చ్ చేసినవారు ఉన్నారట. ఇందుకు కారణం లేకపోలేదు, కొన్ని రకాల షాంపూలు, డిటెర్జెంట్ల తయారీలో వాడే కొన్ని పదార్థాలు ఇంజన్ ఆయిల్ లోనూ వారికి కనిపించడం. నూనె ఏదైనా నూనే కదా అనేది ఇక్కడ వారి ఉద్దేశ్యం. అంతేకాకుండా, ఇంజన్ ఆయిల్ మరింత చిక్కగా ఉంటుంది. ఎక్కువ కాలం పాటు నిలిచి ఉంటుంది, దీనివల్ల ఇది నల్లని, ఒత్తైన కురులకు సహాయపడుతుందని వారు నమ్మడమే.
జుట్టుకు సంబంధించి చికిత్సలు చేసే ట్రైకాలజిస్టులను ఇలాంటి ప్రశ్నలు లేవనెత్తినవారు ఉన్నారని కొన్ని నివేదికలు తెలిపాయి. మరి జుట్టుకు ఇంజన్ ఆయిల్ వర్తించడం మంచిదేనా? జుట్టు పెరుగుతుందా? ఏం జరుగుతుంది? నిపుణులు ఏమంటున్నారో తెలుసుకోండి.
మోటారు ఆయిల్ లేదా ఇంజన్ ఆయిల్ ను తలకు రాసుకోవడం వలన జుట్టు పెరుగుతుంది అని చెప్పటానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. జుట్టుకు ఇంజన్ ఆయిల్ మంచిది అనే వాదనను నమ్మాల్సిన అవసరం లేదు. పైగా, ఇది మీజుట్టును నాశనం చేస్తుంది అని నిపుణులు స్పష్టం చేశారు. ఇంజన్ ఆయిల్స్ అనేవి డిటర్జెంట్లు, యాంటీ-ఫోమింగ్ ఏజెంట్లు, యాంటీ-వేర్ ఏజెంట్లు తదితర రసాయన సంకలితాలతో నిండి ఉంటుంది. ఇవన్నీ పర్యావరణానికి హాని కలిగించడమే కాకుండా, మీ జుట్టును మరింత ముతకగా, పెళుసుగా మారేలా చేస్తాయి.
అంతేకాకుండా, ఈ రకమైన హానికరమైన ఏజెంట్లను మీ జుట్టు లేదా చర్మం నుంచి శుభ్రపరుచుకోవడానికి కొన్ని రౌండ్ల షాంపూతో కడగడం, సబ్బుతో కడిగినా వాటి మురికి వదలదని చెబుతున్నారు. జుట్టు పెరుగుదల, ఇతర జుట్టు సమస్యల గురించి అంతగా ఆందోళన చెందేవారు ప్రొఫెషనల్ ను సంప్రదించాలి. వారు మీ జుట్టు రకాన్ని పరీక్ష చేసి ఏ నూనె వాడితే మంచిదో సూచిస్తారు అని నిపుణులు పేర్కొన్నారు.
ట్రైకాలజిస్టుల ప్రకారం, జుట్టు పెరుగుదలకు కొబ్బరినూనె లేదా ఆవాల నూనె ఉత్తమమైనవి. బాదాం నూనె అన్ని రకాల ఉత్పత్తులకు సరిపోతుంది. ఏదైనా నూనె చిక్కగా, జిడ్డుగా ఉంటే దానిలో వేరొక వెజిటెబుల్ ఆయిల్ కలపడం ద్వారా పలుచన అవుతుంది.
ఒక చిట్కా.. నూనెలో నూనె కలిసిపోతుంది. వార్నిష్ పెయింట్లు, గ్రీజు, ఇంజన్ ఆయిల్ మొదలైనవి గట్టిగా అయినపుడు వాటిలో కూరగాయల నూనెలు, ఆలివ్ ఆయిల్, అవకాడో ఆయిల్, ఆర్గాన్ ఆయిల్, కార్న్ ఆయిల్ మొదలైనవి కలిపితే అవి ఆక్సీకరణం చెందుతాయి. తద్వరా మళ్లీ అవి ద్రవరూపంలోకి వస్తాయి. కాబట్టి ఇలాంటి ప్రయోగాలు చేసుకోవచ్చు.