Yoga for laziness: ఈ రెండు యోగాసనాలు ఉదయాన్నే చేశారంటే.. రోజంతా బద్దకం ఉండదు
17 September 2024, 10:30 IST
Yoga for laziness: ఈ రెండు యోగా ఆసనాలు మీ శరీరంలో శక్తిని పెంచి, రోజంతా మిమ్మల్ని చురుకుగా ఉంచడానికి, బద్దకం తగ్గించడానికి సహాయపడతాయి. కాబట్టి ఆలస్యం చేయకుండా ఈ రెండు యోగాసనాలు ఏమిటో తెల్సుకుని చేసేయండి.
yoga asanas for staying active
ఎంత బాగా నిద్రపోయినా సరే ఉదయం లేవగానే అలసట, బద్దకంగా అనిపిస్తుంటే రోజంతా అలాగే ఉంటుంది. రోజంతా ఏమీ చేయబుద్ది కాదు. మీ వంద శాతం ఏ పనిలోనూ ఇవ్వలేరు. అందుకే ఈ సింపుల్ యోగాసనాలను మీ దినచర్యలో చేర్చుకోండి. వీటితో కొత్త ఉత్తేజం వస్తుంది. వీటికి ఒక పది నిమిషాలు కేటాయించారంటే రోజంతా చురుగ్గా ఉంటారు. అవేంటో చూడండి.
భుజంగాసనం:
దీన్నే కోబ్రా పోజ్ అని కూడా అంటారు. ఈ ఆసనం చేయడం వల్ల పొట్ట, నడుము చుట్టూ ఉన్న కొవ్వు తగ్గడంతో పాటు ఒత్తిడి కూడా తగ్గుతుంది. ఈ ఆసనం నడుము కింది భాగాన్ని బలోపేతం చేస్తుంది. శరీరంలో శక్తి స్థాయిని పెంచుతుంది.
- భుజంగాసనం చేయడానికి ఒక ప్రశాంతమైన చోటులో యోగా మ్యాట్ వేసుకోండి. దీని మీద బోర్లా పడుకుని పాదాలు ఒకదానితో ఒకటి కలిపి ఉంచాలి.
- మోచేతుల దగ్గర రెండు చేతులను వంచి, రెండు అరచేతులను ఛాతీ పక్కన నేలపై ఉంచండి.
- ఇలా చేసేటప్పుడు దీర్ఘ శ్వాస తీసుకుని మెడను మెల్లగా పైకి లేపాలి. నెమ్మదిగా ఛాతీని పైకి లేపి, ఆపై పొట్టను నెమ్మదిగా పైకి లేపాలి.
- ఈ స్థితిలో ఉండి ఆకాశం వైపు చూడటానికి ప్రయత్నించండి. ఇలా చేసేటప్పుడు మెడను నిటారుగా ఉంచాలి. ఈ భంగిమలో కాసేపు ఉండండి చాలు.
పవనముక్తాసనం:
పవనముక్తసనాన్నిఆంగ్లంలో విండ్ రిలీవింగ్ పోజ్ అంటారు. క్రమం తప్పకుండా పవనముక్తాసనం చేయడం వల్ల జీర్ణవ్యవస్థ బలపడి గర్భాశయానికి సంబంధించిన సమస్యల విషయంలో స్త్రీలు ప్రయోజనం పొందుతారు. బరువు తగ్గడంతో పాటు బద్ధకం, అలసటను అధిగమించడానికి కూడా ఈ ఆసనం సహాయపడుతుంది. పవనముక్తాసనం చేయడానికి,
- నిశ్శబ్ద ప్రదేశంలో యోగా మ్యాట్ పరుచుకోండి. వెళ్లకిలా పడుకోండి.
- శ్వాస తీసుకునేటప్పుడు మీ కాళ్ళను 90 డిగ్రీల వరకు ఎత్తండి. తరువాత, శ్వాసను వదిలేటప్పుడు మీ కాళ్ళను వంచి మీ మోకాళ్ళను మీ ఛాతీ దగ్గరికి తీసుకురావడానికి ప్రయత్నించండి.
- ఇలా చేసేటప్పుడు, మీ మోకాళ్ళను మీ చేత్తో పట్టుకోండి, మీ తలను పైకి లేపండి,
- మీ నుదిటిని మీ మోకాళ్ల వరకు తాకడానికి వీలైనంత ప్రయత్నించండి. ఈ భంగిమలో కాసేపు ఉండి శ్వాస తీసుకోండి.
- తర్వాత మీ తలను, తరువాత కాళ్ళను క్రిందికి తీసుకురండి. ఈ యోగాసనాన్ని 2 నుండి 3 సార్లు సాధన చేయండి.