bridal makeup: బ్రైడల్ మేకప్ ప్యాకేజీ ఇలా మాట్లాడుకుంటే.. లాభదాయకం
18 May 2023, 16:09 IST
bridal makeup: బ్రైడల్ మేకప్ ప్యాకేజీ బుక్ చేసుకునేటపుడు కొన్ని విషయాలు తప్పకుండా గుర్తుంచుకోవాలి. పెళ్లి రోజు కంగారుండదు, డబ్బు మిగులుతుంది.
బ్రైడల్ మేకప్
పెళ్లికి మేకప్ ఆర్టిస్టును మాట్లాడుకోవడం మామూలే. అయితే బ్రైడల్ మేకప్ ప్యాకేజీ మాట్లాడుకునేటప్పుడు కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి. డబ్బు విషయంలో, వివిధ సర్వీసులు విషయంలో ముందుగానే స్పష్టంగా మాట్లాడుకోవాలి. మేకప్ ఆర్టిస్టుతో మాట్లాడేముందు తప్పకుండా గుర్తుంచుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. దీనివల్ల మీకు పెళ్లి రోజు ఎలాంటి సమస్యలు రావు.
1. బడ్జెట్:
ఒక ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్టును మాట్లాడాలనుకుంటే దాదాపుగా 15 నుంచి 20 వేల వరకూ ఖర్చవుతుంది. వాళ్లకున్న అనుభవం, పేరు బట్టి ఆ ధరలు లక్షవరకు కూడా ఉండొచ్చు. మనం చిన్న సిటీల్లో, గ్రామాల్లో పెళ్లి అనుకుంటే మీకు దగ్గర్లో ఉన్న మేకప్ ఆర్టిస్టులు కూడా కొన్ని మార్పులు చేర్పులను బట్టి 7000 నుంచి 10000 దాకా తీసుకోవచ్చు. మీరు ఎంత బడ్జెట్ టో మేకప్ ఆర్టిస్టును మాట్లాడాలి అనుకుంటున్నారో ముందుగా స్పష్టత తెచ్చుకోండి. దాన్ని బట్టి కొన్ని మేకప్, పెళ్లికి సంబంధించిన సైట్లుంటాయి. మీ ప్రాంతానికి దగ్గర్లో మీకు తగ్గ బడ్జెట్ లో ఉన్న వాళ్లని వెతుక్కోవచ్చు.
2. ఎంతమంది:
మీ స్నేహితులకు, బందువులకు కూడా ఈ ప్యాకేజీలోనే మేకప్, మెహందీ లాంటి సర్వీసులు మాట్లాడుకోవాలి. మీ ఒక్కరికే అయితే ఒక ప్యాకేజీ, కొంతమందికి కలిపైతే కాస్త అనుకూలమైన ధర ఉండొచ్చు. ఏది లాభదాయకమో చూసి నిర్ణయించుకోండి. నిజానికి మీరొక్కరికే మాట్లాడుకోవడం ఉత్తమం. ఒకే మేకప్ ఆర్టిస్ట్ అందరికీ ఉంటే మీ పెళ్లి రోజు హడావుడి అవ్వచ్చు. అది కూడా గుర్తుంచుకోండి.
3. ఎన్ని వేడుకలకు?
పెళ్లి రోజే కాకుండా ముహూర్తం వేడుక, మెహందీ, హల్దీ, సంగీత్, రిసెప్షన్ ఇలా ప్రతి దాన్ని కలిపి ప్యాకేజీ మాట్లాడుకోండి. ఒక్కరినే అన్ని వేడుకలకూ మాట్లాడుకుంటే ధర కూడా కలిసొస్తుంది. ప్రతి వేడుకకు ప్రత్యేకంగానూ కనిపిస్తారు.
4. ఏమేముండాలి?
జుట్టు, మేకప్, చీర లేదా లెహెంగా కట్టడం.. ముఖ్యంగా ఇవే ఉంటాయి. ఇపుడు చాలా మంది ఇదే ప్యాకేజీలో మ్యానిక్యూర్, పెడిక్యూర్, స్క్రబ్, వ్యాక్సింగ్, ఫేషియల్స్ కూడా ఇస్తున్నారు. ఆ అవకాశం ఉంటే కనుక్కోండి. మీరు మళ్లీ ప్రత్యేకంగా వేరే దగ్గర చేయించుకోవాల్సిన పని ఉండదు. వీటితో పాటే మీకు బాడీ పాలిషింగ్ లాంటివి కావాలనుకుంటే ప్యాకేజీతో పాటే మాట్లాడుకుంటే మంచిది.
5. జుట్టు:
పెళ్లి రోజు సాంప్రదాయ లుక్ లోనే ఉన్నా కూడా ట్రెండీగా కనిపించే హెయిర్ స్టైల్స్ ఉంటాయి. ఆన్‌లైన్ లో చూసి మీకు నప్పే ఫొటోలు పక్కకు తీసి పెట్టుకోండి. మీరు వేసుకోబోయే నగలు, లెహెంగా, చీరకు అనుగునంగా వీటిని ఎంచుకోండి. ఉదాహరణకు మీరు రిసెప్షన్ కి చాలా హెవీగా ఉన్న చోకర్ వేసుకోవాలి అనుకుంటే అది హైలైట్ అయ్యేలా మెస్సీ బన్, లాంటివి ఎంచుకోవచ్చు. అలాగే మీరు స్టూడియోకు వెళ్లి మేకప్ చేయించుకుంటే తలస్నానం గురించి కూడా అడగండి. కొందరు వాళ్లే జుట్టును కూడా వాష్ చేసి మేకప్ మొదలెడతారు. దాని గురించి స్పష్టత తీసుకోండి.
6. ట్రయల్:
పెళ్లికన్నా ముందు ట్రయల్ మేకప్, హెయిర్ తప్పనిసరి. ఎందుకంటే మీరెంచుకున్న స్టైల్ మీకు నప్పుతుందో లేదో తెలుసుకోవాలి. లేదంటే పెళ్లి రోజు ఇబ్బంది అవుతుంది. అందుకే తప్పకుండా ఒక రోజు కేటాయించుకొని ట్రయల్ వేయండి. ఇది దాదాపు అందరు మేకప్ ఆర్టిస్టులు కల్పించే సౌకర్యం. మొహమాట పడకుండా అడగండి.
7. చర్మ సమస్యలు:
మీకేమైనా చర్మ సమస్యలుంటే మేకప్ ఆర్టిస్టుకి ముందుగానే తెలియజేయండి. దానికి తగ్గట్లు వాళ్లు మేకప్ సామాగ్రి వాడతారు.
8. ప్రయాణం:
పెళ్లి మండపానికి దూరంగా మేకప్ స్టూడియో లేదా ఇల్లుంటే కష్టం. ఎక్కువ దూరం ఉంటే సమయం వృధా అవుతుంది. దాన్ని దృష్టిలో ఉంచుకోండి. మీ దగ్గరికే వచ్చి మేకప్ వేసే సౌకర్యం ఉంటే మరీ మంచిది. ముఖ్యంగా పెళ్లి రోజు ఇలా వీలవుతుందేమో కనుక్కోండి.