summer makeup: వేసవిలో మేకప్ ఇలా వేస్కోండి.. మెరిసిపోతారు-summer makeup tips and tricks for flaw less skin ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Summer Makeup: వేసవిలో మేకప్ ఇలా వేస్కోండి.. మెరిసిపోతారు

summer makeup: వేసవిలో మేకప్ ఇలా వేస్కోండి.. మెరిసిపోతారు

Koutik Pranaya Sree HT Telugu
May 05, 2023 03:17 PM IST

summer makeup: వేసవిలో మేకప్ వేసుకోవడంలో కొన్ని చిట్కాలు పాటిస్తే మేకప్ జిడ్డుగా అనిపించదు. చూడటానికి అందంగా మెరిసిపోవాలంటే ఈ మేకప్ చిట్కాలు తెలుసుకోండి.

సమ్మర్ మేకప్
సమ్మర్ మేకప్ (pexels)

వేసవిలో కూడా బోలెడు వేడుకలు జరుగుతుంటాయి. ముఖ్యంగా మధ్యాహ్నం పూట వేడుకలకి మేకప్ వేసుకొని మెరిసిపోదాం అంటే దిగులు. ముఖం ఇంకా జిడ్డుగా అవుతుందేమో అని కంగారు. అలా అని మేకప్ మానెయ్యాల్సిన అవసరం లేదు. మీ మేకప్ ఉత్పత్తులు ఎంచుకునేటప్పుడు, మేకప్ వేసుకునేటప్పుడు ఈ సూచనలు పాటిస్తే సరిపోతుంది.

క్లెన్సింగ్:

వేసవి కాలమనే కాదు.. ఎప్పుడైనా మేకప్ వేసుకునే ముందు శుభ్రంగా మంచి ఫేస్‌వాష్‌తో ముఖం కడుక్కోవడం. అలాగే నిద్రపోయేముందు కూడా మేకప్ తప్పనిసరిగా తీసేయాలి. దానికోసం ఫేస్‌వాష్‌, మేకప్ వైప్స్, మేకప్ రిమూవర్ వాడొచ్చు. మేకప్ అలాగే ఉంచితే చర్మం పాడైపోతుంది.

ప్రైమర్:

మేకప్ మొదలయ్యేది దీంతోనే. చర్మ రంధ్రాలు చిన్నవిగా, చర్మం మృదువుగా కనిపించేలా చేయడంతో పాటు మనం వేసుకోబోయే మిగతా మేకప్ చెక్కుచెదరకుండా ఉంచేది ప్రైమర్. మేకప్ ఎక్కువసేపు నిలిచేలా చేస్తుంది. వేసవిలో మ్యాట్ ఫినిషింగ్ ప్రైమర్ ఎంచుకోవడం మంచిది. దీనివల్ల చెమట వల్ల చర్మం మెరిసినట్టుగా, జిడ్డుగా అనిపించదు.

కన్సీలర్:

చర్మంమీద ఉన్న మచ్చల్ని, నల్లటి వలయాల్ని కనిపించకుండా చేసేది కన్సీలర్. మామూలు సమయాల్లో వేసుకునే మేకప్‌లో కన్సీలర్ ను మచ్చల దగ్గర మాత్రమే వాడతాం. దాని మీద ఫౌండేషన్ రాసుకుంటాం. కానీ ఎండాకాలంలో ఫౌండేషన్ రాసుకోకపోవడమే మంచిది. దానివల్ల ముఖం జిడ్డుగా కనిపిస్తుంది. అందుకే వేసవి కాలం వేసుకునే మేకప్‌లో ఫుల్ కవరేజీ కన్సీలర్ వాడాలి. దానివల్ల ఫౌండేషన్ అవసరం ఉండదు.

ఫౌండేషన్:

ఫుల్ కవరేజీ కన్సీలర్ వాడాక.. ఫౌండేషన్ అవసరం ఉండదు. కానీ మీకు ఫౌండేషన్ తప్పనిసరి అనిపిస్తే లైట్ వాటర్ ప్రూఫ్ ఫౌండేషన్ వాడొచ్చు. అలాగే మ్యాట్ ఫినిషింగ్ మాత్రమే తీసుకోండి. మెరిసే ఫౌండేషన్ జోలికి పోకండి.

సెట్టింగ్ పౌడర్:

చివరిగా మర్చిపోకుండా సెట్టింగ్ పౌడర్‌తో మీ మేకప్‌కి ఫినిషింగ్ ఇవ్వండి. దీనివల్ల మనం ఇదివరకే వాడిన ప్రైమర్, కన్సీలర్, ఫౌండేషన్ చెదరకుండా ఉంటాయి. అలాగే పౌడర్ చర్మం జిడ్డుగా కాకుండా కాపాడుతుంది. ముఖం చెమట వల్ల మెరవకుండా ఉంటుంది.

కంటి మేకప్:

చెమట వల్ల కళ్లకు వేసుకున్న మేకప్ చెదరకుండా ఉండాలంటే ఐషాడో ప్రైమర్ వాడొచ్చు. ప్రైమర్ రాసుకున్నాకే ఐషాడో రాసుకోవాలి. అలాగే వాటర్ ప్రూఫ్ ఐ లైనర్ మాత్రమే వాడటం తప్పనిసరి. లేదంటే మిగతా చెమట వల్ల తొందరగా పక్కకు అంటుకుంటుంది. మిగతా మేకప్ కూడా పాడవుతుంది.

బ్లాటింగ్ పేపర్లు:

వేసవిలో మేకప్ వేసుకున్నప్పుడు ఇవి చాలా ఉపయోగపడతాయి. టిష్యూతో ముఖం తుడుచుకుంటే మేకప్ పాడవుతుంది. అలా కాకుండా బ్లాటింగ్ పేపర్ తో అద్దితే అది నూనె పీల్చేసుకుంటుంది.

వీటన్నింటితో పాటే లిప్స్టిక్, బ్లష్, మస్కారా.. ఇలా ప్రతిదీ వాటర్ ప్రూఫ్ ఉండేలా చూసుకోవాలి. వాటర్ ప్రూఫ్, స్వెట్ (చెమట) ప్రూఫ్, స్వెట్ రెసిస్టెంట్.. ఇలాంటి ఉత్పత్తులు మాత్రమే ఎంచుకుంటే వేసవిలో కూడా చాలా సేపు మేకప్ కాపాడుకోవచ్చు. వీటన్నింటితో పాటూ వీలైనంత తక్కువగానే మేకప్ వేసుకునే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఎక్కువ ఉత్పత్తులు వాడితే జిడ్డుగా అనిపిస్తుందని గుర్తుంచుకోండి. మేకప్ అంతా పూర్తయ్యాక చివరగా సెట్టింగ్ స్ప్రే కొట్టుకోవడం చాలా ముఖ్యం.

Whats_app_banner