Fertility diet: సంతానం కోసం ప్రయత్నించే వాళ్లు.. ఈ రెసిపీలు ట్రై చేయండి..
05 July 2023, 16:02 IST
Fertility diet: సంతానోత్పత్తి చాలా విషయాల మీద ఆధారపడి ఉంటుంది. సమతుల్య ఆహారం తినడం, సరైన పోషకాలు తీసుకోవడం మాత్రం చాలా ముఖ్యం. సంతానం కోసం ప్రయత్నిస్తున్న దంపతులు తీసుకోవాల్సిన కొన్ని ఆహారాల గురించి తెలుసుకోండి.
సంతానోత్పత్తికి సహాయం చేసే ఆహారాలు
సంతానం కోసం ప్రయత్నిస్తున్న దంపతులు ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. సంతానోత్పత్తి విషయంలో వయస్సు, బరువు, కొన్ని ఆరోగ్య సమస్యలు కీలక పాత్ర పోషిస్తాయి. సరైన ఆహారం తినడం కార్బోహైడ్రేట్లు, పీచు, చిరుధాన్యాలు, ప్రొటీన్, జింక్, ఫోలేట్ ఉండేలా చూసుకోవాలి. అలాంటి ఆహారాలు కొన్ని మీ రోజూవారీ భాగం చేసుకుంటే మంచిది.
1. క్వినోవా బీట్ రూట్ ప్యాటీ:
కావాల్సిన పదార్థాలు:
1 కప్పు ఉడికించిన క్వినోవా
2 కప్పుల ఉడికించిన పాలకూర
1 కప్పు బీట్‌రూట్ తురుము
3 చెంచాల ఓట్స్ పొడి
1 గుడ్డు
సగం చెంచా బాదాం పొడి
1 చెంచా ఫ్లాక్స్ సీడ్స్
సగం చెంచా అల్లం తురుము
1 పచ్చిమిర్చి తరుగు
సగం చెంచా నిమ్మరసం
సగం చెంచా చాట్ మసాలా
తగినంత ఉప్పు
2 చెంచాల ఆలివ్ నూనె
తయారీ విధానం:
- అన్ని పదార్థాలను పెద్ద గిన్నెలో వేసుకుని కలుపుకోవాలి. ఓట్స్ పొడి కూడా కలుపుకుని చిన్న ప్యాటీల లాగా ఒత్తుకోవాలి. వాటిని పావుగంట పక్కన పెట్టుకోవాలి.
- పెనం వేడి చేసుకుని నూనె వేసుకోవాలి. ఇప్పుడు ప్యాటీలను వేసుకుని రెండు వైపులా కాల్చుకుని చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలు.
2. శనగల బ్రొకోలీ సూప్:
కావాల్సిన పదార్థాలు:
1 కప్పు ఉడికించిన శనగలు
1 కప్పు బ్రొకోలీ ముక్కలు
1 దాల్చిన చెక్క ముక్క
2 బిర్యానీ ఆకులు
1 ఉల్లిపాయ
4 వెల్లుల్లి రెబ్బలు
1 కప్పు వెజిటేబుల్ స్టాక్
సగం చెంచా మిరియాల పొడి
తగినంత ఉప్పు
2 చెంచాల ఆలివ్ నూనె
కొత్తిమీర తరుగు
తయారీ విధానం:
- బ్రొకోలీని సగం వరకు ఉడికించుకుని పక్కన పెట్టుకోవాలి. ఒక చెంచా నూనె పోసుకుని ఈ బ్రొకోలీ ముక్కల్ని కాసేపు వేగనివ్వాలి.
- వాటిని పక్కన పెట్టుకుని 1 చెంచా నూనె వేసుకుని దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, ఉల్లిపాయ ముక్కు, వెల్లుల్లి వేసుకొని వేయించుకోవాలి.
- అందులోనే వెజిటేబుల్ స్టాక్, ఉడికించిన శనగలు, బ్రొకొలీ వేసుకోవాలి. ఇప్పుడు కొన్ని నీళ్లు కూడా పోసుకుని పావుగంట సేపు ఉడకనివ్వాలి.
- ఇప్పుడు బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క బయటకు తీసేసి అంతా మిక్సీ పట్టుకోవాలి. దీంట్లో ఉప్పు, మిరియాల పొడి వేసుకుని కాసేపు ఉడికించుకోవాలి.
- చివరగా కొత్తిమీర తరుగు, ఆలివ్ నూనె వేసుకుని సర్వ్ చేసుకోవాలి.
3. అవకాడో స్మూతీ:
కావాల్సిన పదార్థాలు:
1 చెంచా మునగాకు పొడి
సగం అవకాడో ముక్క
1 పండిన అరటిపండు
సగం కప్పు బాదాం పాలు
2 చెంచాల తేనె
3 చెంచాల నానబెట్టిన చియాగింజలు
1 చెంచా గుమ్మడిగింజలు
1 చెంచా సన్ ఫ్లవర్ గింజలు
1 చెంచా ఫ్లాక్స్ సీడ్స్
తయారీ విధానం:
- పైన చెప్పిన పదార్థాలన్నీ కలిపి మిక్సీ పట్టుకోవాలి. చియా గింజలు, మిగతా విత్తనాలేవీ వేసుకోకూడదు.
- మిక్సీ పట్టుకున్న స్మూతీని గ్లాసులో పోసుకుని చివరగా చియా గింజలు, మిగతా విత్తనాలన్నీ వేసుకొని సర్వ్ చేసుకోవాలి.