Holiday Tour With Friends । జీవితంలో ఒక్కసారైనా మీరు మీ స్నేహితులతో కలిసి ఈ ప్రదేశాలకు టూర్ వెళ్లాలి!
17 January 2023, 20:12 IST
- Holiday Tour With Friends: మీరు మీ స్నేహితులు కలిసి ఎప్పుడైనా విహారయాత్ర చేశారా? ఈ ప్రదేశాలకు వెళ్లి చూడండి, మీరు జీవితంలో మరిచిపోరు.
Holiday Tour With Friends
అధ్యాత్మిక ప్రదేశాలకు కుటుంబ సభ్యులతో కలిసి వెళ్తే బాగుంటుంది, సుందరమైన ప్రకృతి దృశ్యాలు కలిగిన ప్రదేశాలకు జంటగా భాగస్వామితో కలిసి వెళ్తే బాగుంటుంది, ప్రశాంతంగా గడపాలనుకుంటే సోలో ట్రావెలింగ్ బెటర్. అయితే ఎక్కడకు వెళ్లినా గొప్ప వినోదం ఉండాలంటే అప్పుడు కచ్చితంగా స్నేహితులతో కలిసే వెళ్లాలి. మనం స్వేచ్ఛగా మనలా ఉండాలి, యాత్రలో ప్రతీ క్షణాన్ని ఆస్వాదించాలంటే నలుగురు స్నేహితులు కలిసి గ్రూప్ ట్రిప్ చేయాలి. మీ జీవితంలో కచ్చితంగా ఇలాంటి యాత్ర ఒకటి ఉండాలి. ఇది మీకు జీవితకాలపు మధురానుభూతులను మిగులుస్తుంది.
మీరు మీ స్నేహితులతో కలిసి విహారయాత్రకు ప్లాన్ చేస్తుంటే, ఎక్కడకు వెళ్లాలా అని ఆలోచనలు చేస్తుంటే, భారతదేశంలోనే ఉన్న కొన్ని అద్భుతమైన గమ్యస్థానాల గురించి మీకు తెలియజేస్తున్నాం.
Holiday Tour With Friends- స్నేహితులతో టూర్ వెళ్లాల్సిన ప్రదేశాలు
ఈ ప్రదేశాలకు మీ స్నేహితులతో కలిసి వెళ్తే, మీకు ఈ యాత్ర అన్ని విధాల సంతృప్తిని అందిస్తుంది. మరి ఆ ప్రదేశాలేమిటో ఇక్కడ చూసేయండి..
కోజికోడ్- కేరళ
కేరళలోని కోజికోడ్ స్నేహితులతో కలిసి ఒక్కసారైనా వెళ్లాల్సిన ప్రదేశం. ముఖ్యంగా మీ స్నేహితుల్లో ఎవరైనా ఫుడీ ఉంటే, వారికి ఈ ప్రదేశం స్వర్గమే. నగరం చుట్టూ ఆకట్టుకునే బీచ్‌లు, సుందరమైన ప్రకృతి దృశ్యాలు, జంతు సంరక్షణ కేంద్రాలు, ప్రసిద్ధ మ్యూజియంలు, జలపాతాలు, నదులు, కొండల ఎన్నో ఉన్నాయి. కోజికోడ్ సందర్శనకు అక్టోబర్ నుంచి మార్చి నెలలు సరైన సమయం.
చిరపుంజి- మేఘాలయ
మీరు ప్రకృతి ఒడిలో పరవశించిపోయే వెకేషన్ కోసం చూస్తున్నట్లయితే, మేఘాలయ రాష్ట్రంలోని చిరపుంజి మీకు ఉత్తమం. దీనిని "జ్యువెల్ క్రెస్ట్ ఆఫ్ మేఘాలయ" అని కూడా పిలుస్తారు. ఈ అందమైన నగరం తూర్పు ఖాసీ హిల్స్‌లో ఉంది. ప్రపంచంలోని అత్యంత అందమైన జలపాతాలు, చెట్టు వేర్లతో అల్లుకున్న లివింగ్ బ్రిడ్జ్ లు, మరెన్నో సహజసిద్ధమైన అద్భుతాలకు చిరపుంజి నిలయంగా ఉంది. చిరపుంజి సందర్శనకు వర్షాకాలం అనువైన సమయం.
స్నేహితులతో కలిసి మేఘాలయ ట్రిప్ ప్లాన్ చేస్తే చిరపుంజితో పాటు షిల్లాంగ్ నగరం కూడా తప్పకుండా చూడాలి. దీనిని "స్కాట్లాండ్ ఆఫ్ ది ఈస్ట్"గా పిలుస్తారు. అందమైన జలపాతాలు, ఆకాశనీలం సరస్సులు, ఊపిరి పీల్చుకునే పచ్చదనం, ఊగుతున్న పైన్ చెట్లు, రూట్స్ బ్రిడ్జ్, పురాతన నిర్మాణాలతో ఇది పర్యాటకులను ఆకర్షిస్తుంది.
లేహ్ లడఖ్
మీరు అడ్వెంచర్లు ఇష్టపడే వారైతే లేహ్, లద్దాఖ్ నగరాలు ఉత్తమమైన ప్రదేశాలు. ఇక్కడ మీరు, మీ స్నేహితులతో కలిసి వెళ్లే రోడ్ ట్రిప్ మీకు జీవితకాలపు జ్ఞాపకాలను పంచుతుంది. ఈ నగరం అద్భుతమైన ప్రకృతి దృశ్యాలతో పాటు టిబెటన్ సంస్కృతి, వంటకాలు, పండుగలకు ప్రసిద్ధి చెందింది. రివర్ రాఫ్టింగ్, ట్రెక్కింగ్, పర్వతారోహణ, మౌంటెన్ బైకింగ్ మొదలైన కార్యకలాపాలలో మునిగి తేలవచ్చు. లద్దాఖ్, లేహ్ ప్రాంతాలలోని ఉత్కంఠభరితమైన భూభాగాలను సందర్శించడానికి అత్యంత అనువైన సమయం సెప్టెంబర్ మధ్య నుండి అక్టోబర్ వరకు.
గోవా
ఇక, చాలా మంది లిస్టులో వద్దనకుండా ఉండే మరొక గమ్యస్థానం గోవా. సాధారణంగా గోవా స్నేహితులతో కలిసి వెళ్తేనే గొప్ప వినోదం ఉంటుంది. ఇక్కడ బీచ్‌లు, ఆ తీర ప్రాంతాలలోనే మీరు కోరుకునే పానీయాలు, సీఫుడ్ మొదలైనవి అలల నడుమ కూర్చొని ఆస్వాదించవచ్చు. పార్టీలు, వేడుకలకు గోవాలో కొదువే ఉండదు. ఇంకా ఇక్కడ చారిత్రక కట్టడాలు, ట్రెక్కింగ్ మొదలైనవి కూడా ఆస్వాదించవచ్చు.