Romantic Destinations | జూలై మాసంలో విహారానికి జంటలకు ఈ ప్రదేశాలు స్వర్గమే!
29 June 2022, 16:41 IST
- వర్షాకాలంలో విహారయాత్రకు వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారు. మాన్ సూన్ జూలై మాసంలో జంటలు విహరించటానికి ఇండియాలోని కొన్ని గొప్ప పర్యాటక కేంద్రాలు ఇక్కడ తెలుసుకోండి.
Couple Travel Goals in Monsoon
ఎండాకాలంలో ఎండలతో ఆకులు రాలిపోయి, కొమ్మలు వాడిపోయి మోడువారినట్లు ఉన్న వనాలన్నీ ఇప్పుడు వర్షపు చినుకులతో మళ్లీ చిగురిస్తున్నాయి. సుగంధభరితమైన మట్టివాసనలతో, సుస్వరాలు పలికించే జలపాతాలతో పుడమంతా ఇప్పుడు పచ్చని రంగేసుకుంది.
ఈ వర్షాకాలంలో జూలై నెలలో వాతావరణం మరింత ఆహ్లాదకరంగా మారుతుంది. ఈ సమయంలో ఎంతో మంది జంటలు అద్భుతమైన ప్రదేశాలలో విహరిస్తూ ప్రేమానుభూతులకు లోనవుతారు. చల్లగా కురిసే జల్లులలో ఒకరి స్పర్శలో ఒకరు తడిసి ముద్దవుతారు. వెచ్చటి శృంగార రసాన్ని ఆస్వాదించటానికి కూడా ఇది అద్భుతమైన సమయం.
మరి మీరూ మీ భాగస్వామితో కలిసి ఈ జూలై నెలలో ఏదైనా విహారయాత్రకు ప్లాన్ చేసుకుంటున్నారా? ఈ వర్షకాలంలో మన భారతదేశంలో విహరించదగ్గ ఎన్నో అద్భుతమైన ప్రదేశాలు ఉన్నాయి. ఎత్తైన పచ్చని కొండలు, వాటి మధ్య పారే జలపాతాల నుంచి సముద్రపు తీరంలో ముత్యపు చిప్పలను ఏరుకునే ప్రదేశాల వరకు జంటలు డ్యుఎట్ పాడుకోవడానికి అనువైన ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి. అందులో కొన్ని మీకు ఇక్కడ తెలియజేస్తున్నాం.
గోవా
జూలై నెలలో మీ భాగస్వామితో కలిసి సందర్శించడానికి గోవా ఒక ఉత్తమమైన గమ్యస్థానంగా చెప్పవచ్చు. వర్షాకాలంలో గోవా బీచ్‌లలో నడవడం గొప్ప అనుభూతిగా చాలా మంది భావిస్తారు. అయితే ఎక్కడైనా తీరప్రాంతాల్లో వర్షాలు పడేటపుడు తగు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఇక గోవాలో వర్షాకాలం ట్రెక్కింగ్ చేయటానికి, సీ- ఫుడ్ తినటానికి ఇతర ఆఫ్‌బీట్ కార్యకలాపాలకు బాగుంటుంది.
మౌంట్ అబూ
మౌంట్ అబూ రాజస్థాన్‌లోని ప్రసిద్ధ హిల్ స్టేషన్. జూలై నెలలో ఇక్కడికి వెళ్లడం చాలా సరదాగా ఉంటుంది. ఆరావళి కొండలలోని ఎత్తైన శిఖరంపై ఉన్న ఈ హిల్ స్టేషన్ వద్ద ప్రకృతి సౌందర్యం, ఇక్కడి వాతావరణం అందరినీ కట్టిపడేస్తుంది.
సిమ్లా
జూలై నెలలో కూడా సిమ్లాను సందర్శించవచ్చు. ఇక్కడ వాతావరణం ఎల్లప్పుడూ ఆహ్లాదకరంగా ఉంటుంది . అడపాదడపా కురిసే వర్షాలు శీతల అనుభూతిని కలిగిస్తాయి. మీ భాగస్వామితో కలిసి ఇక్కడి మాల్ రోడ్‌ని సందర్శించడం భిన్నమైన అనుభూతిని ఇస్తుంది. ఇది కాకుండా, కుఫ్రి, నరకంద వంటి ఇతర ప్రదేశాలూ ఉన్నాయి. ఇక్కడ మీరు మీ భాగస్వామి భుజం మీద చెయ్యి వేసి నడకకు రొమాంటిక్ గా ఉంటుంది.
మహాబలేశ్వర్
మహారాష్ట్రలో నెలవైన ఒక అందమైన హిల్ స్టేషన్ మహాబలేశ్వర్‌లో ఈ జూలై మాసంలో మీ భాగస్వామితో కలిసి షికారు చేయడం మీకు గొప్ప అనుభూతిని ఇస్తుంది. వర్షాకాలంలో ఇక్కడి ప్రకృతి అందాలు మీ కనుచూపు మేర వరకు కనిపిస్తాయి. భాగస్వామితో రొమాంటిక్ వెకేషన్ కోసం ఈ స్థలం ఉత్తమమైనదిగా చెప్పవచ్చు. ఇదే కాకుండా వెన్నా సరస్సు, వాటర్ ఫాల్స్, విల్సన్ పాయింట్, ప్రతాప్‌ఘర్ కోట, ఖండాలా మొదలైన వాటిని కూడా సందర్శించవచ్చు.
నైనిటాల్
ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఎన్నో అద్భుతమైన పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. అయితే ఇక్కడి నైనిటాల్ హిల్ స్టేషన్ సందర్శించేందుకు ఇదే ఉత్తమ సమయం. వర్షాకాలంలో ఏకాంతాన్ని ఇష్టపడేవారికి నైనిటాల్ ఉత్తమ పర్యాటక ప్రదేశాలలో ఒకటిగా చెప్పవచ్చు.
కొడైకెనాల్
ఎక్కడో దూరంగా వెళ్లడం వద్దనుకుంటే మన దక్షిణ భారతదేశంలోనే అరకు, ఊటి, మున్నార్.. అఫ్ కోర్స్ పైన చెప్పుకున్న గోవా, ఇలా ఎన్నో ఉన్నాయి. అయితే జూలైలో కొడైకెనాల్ సందర్శించడం ఉత్తమంగా చెప్తారు. వర్షాకాలంలో ఇక్కడికి వెళ్లడం భిన్నమైన ఆనందాన్ని కలిగిస్తుంది. ఇక్కడి ప్రకృతి సౌందర్యానికి మీరు ముగ్ధులవుతారు.