Pepper Chicken: బెంగాలీ స్టైల్‌లో ఇలా పెప్పర్ చికెన్ ఫ్రై చేయండి, వదలకుండా తినేస్తారు
26 March 2024, 17:30 IST
- Pepper Chicken: పెప్పర్ చికెన్ పేరు వింటేనే నోరూరిపోతుంది. ఎప్పుడూ ఒకేలా కాకుండా ఓసారి బెంగాలీ స్టైల్ లో చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది స్నాక్ గా కూడా ఉపయోగపడుతుంది
పెప్పర్ చికెన్ రెసిపీ
Pepper Chicken: చికెన్ పేరు వింటేనే నాన్ వెజ్ ప్రియులకు నోరూరిపోతుంది. ఎప్పుడూ ఒకేలా చేసుకుని తినే కన్నా ఓసారి బెంగాలీ స్టైల్‌లో పెప్పర్ చికెన్ చేసుకుని చూడండి. ఇది చాలా రుచిగా ఉంటుంది. దీన్ని వేపుడులా చేసుకోవచ్చు. కర్రీ లాగా వండుకోవచ్చు. మీకు ఎలా నచ్చితే అలా దీన్ని రెడీ చేసుకోవచ్చు. ఈ పెప్పర్ చికెన్ ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలి అనిపించేలా ఉంటుంది. దీని రెసిపీ ఎలాగో తెలుసుకుందాం.
బెంగాలీ స్టైల్ లో పెప్పర్ చికెన్ వేపుడు రెసిపీ
చికెన్ ముక్కలు - అరకిలో
ఉల్లిపాయ - ఒకటి
అల్లం వెల్లుల్లి పేస్టు - ఒక స్పూను
ఎండుమిర్చి - రెండు
ధనియాల పొడి - అర స్పూను
పెరుగు - పావు కప్పు
జీడిపప్పు - ఐదు
మిరియాల పొడి - ఒకటిన్నర స్పూను
నూనె - రెండు స్పూన్లు
ఉప్పు - రుచికి సరిపడా
నీరు - తగినంత
గరం మసాలా - ఒక స్పూను
పసుపు - పావు స్పూను
బెంగాలీ స్టైల్ పెప్పర్ చికెన్ ఫ్రై రెసిపీ
1. చికెన్ ముక్కలను ఒక గిన్నెలో వేసి శుభ్రంగా కడగాలి.
2. ఆ చికెన్‌లో పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలిపి రెండు మూడు గంటల పాటు ఫ్రిజ్లో వదిలేయాలి.
3. జీడిపప్పులను నీటిలో కాసేపు నానబెట్టి తర్వాత తీసి మెత్తగా పేస్ట్ లా రుబ్బుకొని పక్కన పెట్టుకోవాలి.
4. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి.
5. నూనె వేడెక్కాక ఎండుమిర్చి, ఉల్లిపాయలను వేసి బాగా వేయించుకోవాలి.
6. ఉల్లిపాయల తరుగు బంగారు రంగులోకి మారేవరకు వేయించుకోవాలి.
7. ఆ మిశ్రమంలో ముందుగా మ్యారినేట్ చేసి ఫ్రిజ్లో పెట్టుకున్న చికెన్ వేసి బాగా కలుపుకోవాలి.
8. కాసేపు మూత పెట్టి ఉంచితే చికెన్ లోని నీరు దిగుతుంది.
9. ఆ నీరు ఇంకిపోయే దాకా ఉంచి తరువాత ధనియాల పొడి, గరం మసాలా, పసుపు, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి.
10. ఆ తర్వాత జీడిపప్పు పేస్టును కూడా వేసి బాగా కలపాలి.
11. నల్ల మిరియాల పొడిని వేసి బాగా కలుపుకొని కాస్త నీటిని వేయాలి.
12. రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలి.
13. ఇప్పుడు స్టవ్ మీద మూత పెట్టి చిన్న మంట మీద ఉడకనివ్వాలి.
14. నీరంతా ఇంకిపోయి వేపుడులా అయ్యే వరకు ఉంచాలి. అంతే బెంగాలీ స్టైల్ లో పెప్పర్ చికెన్ రెడీ అయినట్టే. ఇది చాలా రుచిగా ఉంటుంది. ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించేలా ఉంటుంది.
పెప్పర్ చికెన్ లో ముఖ్యమైనది చికెన్, మిరియాల పొడి. ఈ రెండూ కూడా మన ఆరోగ్యానికి మేలే చేస్తాయి. చికెన్‌లో ప్రోటీన్ అధికంగా ఉంటుంది. ప్రతిరోజూ ప్రోటీన్ ఉన్న ఆహారం తినడం చాలా అవసరం. ఇక మిరియాలలో ఉండే సుగుణాలు ఇన్నీ అన్నీ కాదు... మిరియాలు తినడం వల్ల డయాబెటిస్ పేషెంట్లకు ఎంతో మేలు జరుగుతుంది. ముఖ్యంగా రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. క్యాన్సర్ వంటి వ్యాధులు వచ్చే ప్రమాదాన్ని ఇవి తగ్గిస్తాయి. నరాల బలహీనత వంటి సమస్యలు ఉన్నవారు, మిరియాలను తరచూ ఆహారంలో భాగం చేసుకోవడం చాలా మంచిది. ఇది పొట్ట ఆరోగ్యానికి ఎంతో సహకరిస్తుంది.
టాపిక్