Weightgain: ఆరోగ్యంగా ఉన్నా కూడా బరువు పెరుగుతున్నారా? దానికి ఇదే కారణం
Weightgain: కొంతమంది ఆరోగ్యంగా తింటున్నా, వాకింగ్ వంటివి చేస్తున్నా బరువు పెరుగుతూ ఉంటారు. అలా ఎందుకు తాము బరువు పెరుగుతున్నామో... వారికి అర్థం కాదు. అలాంటివారు ఒకసారి ఒత్తిడి బారిన పడుతున్నారేమో ఆలోచించుకోండి.
Weightgain: ఆరోగ్యంగా తింటున్నా, రోజులో ఎక్కువసేపు శారీరకంగా కష్టపడే పనులు చేస్తున్నా కూడా కొంతమంది బరువు పెరిగిపోతూ ఉంటారు. అలాంటి వారు ఊబకాయం బారిన పడడానికి కారణం ఒత్తిడి కూడా కావచ్చు. ఒత్తిడి చాలా ప్రమాదకరమైనది. ఇది బరువును అమాంతం పెంచేస్తుంది. ఒత్తిడి సంబంధిత జీవనశైలి శరీరాన్ని నాజూగ్గా ఉండనివ్వదు. ఒత్తిడి వల్ల బరువు పెరగడం, నిద్రలేమి, స్ట్రోక్, డిప్రెషన్, డయాబెటిస్, క్యాన్సర్ వంటి సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది.
ఒత్తిడితో నష్టం
ఒత్తిడి హార్మోన్లు రోజూ విడుదలయితే శరీరంలో అనారోగ్యాలు మొదలవుతాయి. ఎండోక్రైన్ గ్రంధుల్లో విడుదలైన కార్టిసాల్ వంటి ఒత్తిడి హార్మోన్లు గుండె కొట్టుకునే వేగాన్ని పెంచుతాయి. రక్త ప్రవాహంలో వేగాన్ని పెంచుతాయి. శరీరంలోని కండరాలు, అవయవాల వైపు రక్తం వేగంగా ప్రవహించేలా చేస్తాయి. దీనివల్లే భయం, ఆందోళన పెరిగిపోతాయి. ఇదే మూడ్ స్వింగ్‌లకు కారణం అవుతుంది. జీర్ణవ్యవస్థ, నెలసరి సమస్యలు రావడానికీ ఒత్తిడి కారణం అవుతుంది.
దీర్ఘకాలికంగా ఉండే ఒత్తిడి మీకు తెలియకుండానే మిమ్మల్ని ఊబకాయుల జాబితాలోకి చేర్చేస్తుంది. మీరు ఆహారాన్ని తగ్గించినా, శారీరకంగా కష్టపడుతున్నా కూడా ఒత్తిడి వల్ల శరీరం పెరిగిపోతుంది. దీర్ఘకాలిక ఒత్తిడి... అల్జీమర్స్ వ్యాధిని కూడా తెచ్చి పెడుతుంది. శరీరంలో విడుదలయ్యే కార్టిసాల్ హార్మోన్ మిమ్మల్ని లావుగా మార్చేస్తుంది. ఎందుకంటే ఈ కార్టిసాల్ గ్లూకోజ్ పేరుకుపోయేలా చేస్తుంది. ఈ గ్లూకోజ్ స్థాయిలు నెలలు తరబడి పేరుకుపోతూ ఉంటాయి. అది బరువు పెరగడానికి కారణమవుతుంది. నిద్రలేమి వల్ల కూడా బరువు పెరిగే అవకాశం ఉంది. కార్టిసాల్ అధికంగా విడుదలయితే నిద్ర సరిగా పట్టదు. అలాంటప్పుడు శరీరం అధిక బరువు బారిన పడుతుంది. కాబట్టి శరీరంలో ఒత్తిడి హార్మోను విడుదల కాకుండా చూసుకుంటే బరువు యధావిధిగా తగ్గుతారు.
ఒత్తిడి హార్మోనైనా కార్టిసాల్ విడుదల కాకుండా ఉండాలంటే ధ్యానం, యోగా, వ్యాయామం, మసాజ్ వంటివి ప్రయత్నించాలి. మానసిక శ్రేయస్సుపై దృష్టి పెట్టాలి. మీరు ఎక్కువ సమయం పాటు సంతోషంగా, ప్రశాంతంగా, ఆనందంగా ఉండేందుకు ప్రయత్నించండి. చిన్నచిన్న విషయాలకే కంగారు పడకండి. ఒత్తిడిని జయించడం సులువే, కాకపోతే మీరు మానసికంగా దృఢంగా ఉండాలి. ఒత్తిడితో పోరాడేందుకు సిద్ధపడాలి.
ఇలా ఒత్తిడి తగ్గించుకోండి
ప్రతిరోజూ 20 నిమిషాలు పాటు వేగంగా నడవండి. పచ్చని ప్రకృతిలో ఎక్కువ సమయం గడపండి. మైండ్ ఫుల్ నెస్ సాధన చేయండి. అలాగే ప్రోటీన్, ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని తినండి. ఖచ్చితంగా రాత్రి పూట ఎనిమిది గంటలు నిద్రపోండి. ఉద్యోగం చేసేవారు పనిలో రెండు మూడు గంటలకు ఒకసారి ఒక అరగంట పాటైనా విశ్రాంతి తీసుకోండి. ధూమపానం, మద్యపానం వంటి అలవాట్లను వెంటనే వదిలేయండి.
మీ మనసుకు బాధ కలిగించే విషయాలను మనసులోని ఉంచేసుకోకుండా ఒక డైరీలో రాసుకోండి. అప్పుడు మీకు చాలా ఉపశమనంగా ఉంటుంది. విశ్రాంతినిచ్చే హాబీలు, నవ్వించే కామెడీలను స్కిట్లను చూసేందుకు ప్రయత్నించండి. ప్రతిరోజూ యోగా, ధ్యానం వంటివి ప్రయత్నించండి. ఇవన్నీ మీకు ఒత్తిడి హార్మోన్ విడుదలవ్వకుండా అడ్డుకోవడానికి సహాయపడతాయి.
టాపిక్