Bhogi Mantalu : భోగి మంటల దగ్గరకు వెళ్తే కలిగే నష్టాలు ఏంటో తెలుసా?
13 January 2024, 18:00 IST
- Bhogi Mantalu : సంక్రాంతి పండగకు ముందురోజు భోగి పండుగ. ఈ రోజున భోగి మంటలు వేస్తారు. అయితే భోగి మంటల దగ్గరకు వెళ్లినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. లేదంటే ప్రమాదాలు జరగొచ్చు.
భోగి మంటలు
భోగి పండుగ రోజున భోగి మంటలు వేస్తారు. ఇంట్లోని పాత వస్తువులను కాల్చుతారు. సంక్రాంతి పండుగ భోగి పండుగతోనే మెుదలై.. కనుమతో ముగుస్తుంది. జనవరి 14న భోగి రోజున భోగి మంటల్లో ఇంట్లో పాత వస్తువులను వేస్తాం. పాత బాధలు తొలగిపోయి.. కొత్తగా ఆనందం రావాలని అందరూ కోరుకుంటారు. అదేవిధంగా మనసులోని చెడు ఆలోచనలు, జ్ఞాపకాలను మరచిపోయి కొత్త ఆరోగ్యకరమైన ఆలోచనలతో జీవితాన్ని గడపాలని భోగి పండుగ సూచిస్తోంది.
భోగి మంటల చుట్టూ ప్రజలు గుమిగూడి పాటలు పాడుతూ ఆనందిస్తారు. అయితే మంటల దగ్గర జాగ్రత్తగా ఉండాలి. అగ్నికి చాలా దగ్గరగా నిలబడటం ప్రమాదకరం, హానికరం. భోగి పండుగ సమయంలో అగ్ని ప్రమాదాల గురించి తెలుసుకోవాలి.
భోగి పండుగ సందర్భంగా చాలా మంది భోగి మంటల చుట్టూ చేరుకుంటారు. మీరు అగ్నికి చాలా దగ్గరగా ఉంటే మీ చర్మం ఎరుపు, మచ్చలు, తెల్లగా మారుతుంది. అగ్ని ద్వారా బొబ్బలు కలిగించవచ్చు. మీరు చర్మ అసౌకర్యాన్ని అనుభవించవచ్చు. భోగి మంటలు కాల్చినప్పుడు మీ చర్మం కాలిపోకుండా ఉండటానికి మీరు దూరంలో నిలబడి ఉండేలా చూసుకోండి.
కట్టెల నుండి వచ్చే పొగ మీకు ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. ఇది గుండె జబ్బులు, ఆస్తమా, దగ్గుతో ముడిపడి ఉంది. ఈ ప్రమాదకరమైన ప్రభావాలతో పాటు ఇది మీ ఊపిరితిత్తులకు కూడా హాని కలిగిస్తుంది. పొగ వల్ల మీ ఊపిరితిత్తులకు సమస్యలు వస్తాయి. ఇది ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ ప్రమాదాన్ని పెంచుతుంది. భోగి మంటలు సమయంలోనే కాకుండా శీతాకాలం అంతా మంటలకు దగ్గరగా నిలబడటం, కూర్చోవడం మానుకోండి.
మంటల దగ్గరకు వెళ్లడం మానుకోండి. ఎందుకంటే ఇది మీ శరీర ఉష్ణోగ్రతను పెంచుతుంది. శ్వాస ఆడకపోవడాన్ని కలిగిస్తుంది. వివిధ చర్మ సమస్యలు కూడా వస్తాయి. అలాగే అలసట, బలహీనత వంటి లక్షణాలను అనుభవించవచ్చు. హీట్ స్ట్రోక్ కూడా రావొచ్చు. భోగి మంటల దగ్గర జాగ్రత్తగా ఉండాలి.
అగ్ని పొగలో సూక్ష్మ రేణువుల పదార్థం ఉంటుంది, ఎక్కువగా PM2.5. ఈ కణాలు మీ కళ్ళను చికాకు పెట్టగలవు. మంటగా అనిపిస్తాయి. కళ్ళు ఎర్రబడటం, నీరు కారడం వంటి వాటికి కారణం కావచ్చు. అగ్ని కణాలు మీ కళ్లలోకి వచ్చే అవకాశం ఉంది. చాలా జాగ్రత్తగా ఉండండి.
భోగి పండుగ సందర్భంగా కాటన్ దుస్తులను ధరించడం మీ ఉత్తమ ఎంపిక. ఎందుకంటే అది అగ్ని ద్వారా కరిగిపోకుండా మనల్ని కాపాడుతుంది. ఇతర బట్టలు ధరించి అగ్ని దగ్గరకు వెళ్లడం మంచిది కాదు. ఎందుకంటే అది వేడిగా ఉన్నప్పుడు కరిగిపోతుంది. మంటలు తగిలినప్పుడు మన శరీరానికి అంటుకుని ఎక్కువ నష్టం కలిగిస్తుంది.
అగ్ని ప్రమాదాలు అకస్మాత్తుగా సంభవించవచ్చు. మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. అగ్నికి దగ్గరగా వెళ్లవద్దు. సంతోషంగా, సురక్షితంగా భోగి పండుగ జరుపుకోండి. హెచ్‌టీ తెలుగు తరఫున భోగి శుభాకాంక్షలు..