తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Health Tips: గుండె జబ్బులు, డయాబెటిస్ రాకుండా ఉండాలా? అయితే ఈ చిన్న చిట్కా పాటించండి చాలు

Health tips: గుండె జబ్బులు, డయాబెటిస్ రాకుండా ఉండాలా? అయితే ఈ చిన్న చిట్కా పాటించండి చాలు

Haritha Chappa HT Telugu

24 April 2024, 17:00 IST

google News
    • Health tips: ఇటీవల కాలంలో గుండె జబ్బులు, మధుమేహం బారిన పడుతున్న వారి సంఖ్య అధికంగా ఉంది. ఆ రెండూ ప్రాణాంతకమైనవి. ఆ రెండు రోగాల బారిన పడకుండా ఉండాలంటే చాలా సింపుల్ చిట్కా ఒకటి ఉంది.
వాకింగ్ చేయడం వల్ల లాభాలు
వాకింగ్ చేయడం వల్ల లాభాలు (Pixabay)

వాకింగ్ చేయడం వల్ల లాభాలు

Health tips: తమకంటూ ప్రత్యేక సమయాన్ని కేటాయించుకుంటున్న వారి సంఖ్య చాలా తక్కువగా ఉంది. ఇంటి పనులకు, వంట పనులకు, బయట పనులకు, ఉద్యోగానికే ఎక్కువ సమయాన్ని కేటాయిస్తున్నారు. కేవలం నిద్రకు మాత్రమే తమకంటూ కొంత సమయాన్ని ఉంచుకుంటున్నారు. నిజానికి రోజులో ఒక గంటసేపు మీకంటూ సమయం ఉండాలి. ఆ సమయంలో మీరు పచ్చని ప్రకృతిలో, ఆహ్లాదమైన వాతావరణంలో వాకింగ్ చేయండి. ఇలా ప్రతిరోజు ఒక గంట సేపు చేయండి చాలు. మీలో ఎన్నో మార్పులు వస్తాయి. ముఖ్యంగా గుండె జబ్బులు, మధుమేహం వచ్చే ప్రమాదం చాలా వరకు తగ్గుతుంది. ఈ విషయాన్ని మేము చెప్పడం లేదు... అంతర్జాతీయ శాస్త్రవేత్తలు అధ్యయనం చేసి మరీ ఈ విషయాన్ని కనిపెట్టారు.

గుండెజబ్బులు రాకుండా...

నీకు దగ్గరగా ఉన్నప్పుడు పార్కులో పచ్చని చెట్ల మధ్య కాసేపు షికారు చేయండి. లేదా పర్వతాలు దగ్గరగా ఉంటే అలా విహరించి రండి. అదే సరస్సులు ఉంటే ఆ సరస్సుల పక్కన కాసేపు కూర్చోండి. ఇలా ప్రకృతిలో సమయం గడపడం వల్ల మానసిక ఒత్తిడి చాలా వరకు తగ్గుతుంది. మానసిక స్థితి మెరుగుపడుతుంది. రక్తపోటు అదుపులో ఉంటుంది.

ప్రకృతిలో ఎక్కువసేపు సమయాన్ని గడిపితే గుండె జబ్బులు, మధుమేహం వచ్చే ప్రమాదం చాలా వరకు తగ్గుతుందని తాజా అధ్యయనం చెబుతోంది.

దీర్ఘకాలికంగా శరీరంలో ఇన్ఫ్లమేషన్ ఉంటే అది గుండె జబ్బులకు, మధుమేహానికి కారణం అవుతుంది. అలాగే మధుమేహం ఉన్న వారిలో దీర్ఘకాలికంగా రక్తంలో అధిక చక్కెర స్థాయిలు ఉన్నా కూడా సమస్య పెరుగుతుంది. ఇది శరీరంలో ఇన్లమేషన్ కు కారణం అవుతుంది. దీనివల్ల రక్తనాళాలు దెబ్బ తినే అవకాశం ఉంది. అలాగే రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడే అవకాశం ఉంది. దీనివల్ల ధమనులు కుచించుకుపోయి గుండెకు రక్త ప్రవాహాన్ని తక్కువగా అందిస్తాయి. ఇది భవిష్యత్తులో గుండెపోటుకు కారణం కావచ్చు.

శరీరంలో ఇన్ఫ్లమేషన్ అనేది చాలా ప్రమాదకరమైనది. ఇది శరీరంలో గ్లూకోజ్ జీవక్రియను, ఇన్సులిన్ సెన్సిటివిటీని ప్రభావితం చేస్తుంది. దీనివల్ల ఇన్సులిన్ నిరోధకత పెరుగుతుంది. అంటే రక్తంలో చక్కెర స్థాయిలు మరింతగా పెరిగిపోతాయి. అందుకే శరీరంలో ఇన్ఫ్లమేషన్ తగ్గించుకోవడం చాలా అవసరం. ప్రకృతిలో తరచూ ఉండే వారిలో శరీరంలో ఇన్ఫ్లమేషన్ స్థాయిలు చాలా వరకు తగ్గుతున్నట్టు అధ్యయనం చెబుతోంది.

దీర్ఘకాలిక ఇన్ఫ్లమేషన్ తో ముడిపడి ఉన్న ఆరోగ్య సమస్యలు గుండె జబ్బు, మధుమేహం. కాబట్టి ఈ రెండింటిని అడ్డుకోవడానికి ముందుగా మీరు శరీరంలో ఇన్ఫ్లమేషన్ స్థాయిలను తగ్గించుకోవాలి. ఇందుకోసం ప్రకృతితో ఎక్కువ సేపు గడిపేందుకు ప్రయత్నించాలి.

ఈ తాజా అధ్యయనంలో భాగంగా 1200 మందిపై పరిశోధన నిర్వహించారు. వారి శారీరక పరీక్షలతో పాటు మూత్ర నమూనాలను, రక్త పరీక్షలను సమగ్రంగా నిర్వహించారు. వీరిలో ఎవరైతే ప్రకృతిలో ఎక్కువ సమయం గడుపుతారో వారు చాలా ఆరోగ్యంగా ఉన్నట్టు, వారి శరీరంలో ఇన్ఫ్లమేషన్ స్థాయిలు తక్కువగా ఉన్నట్టు గుర్తించారు. ఎవరైతే ఎక్కువ సమయం ఇంట్లోనూ, ఆఫీసులోనూ ఉంటూ నిత్యం పనులతో బిజీ అవుతూ ... గజిబిజి జీవితాన్ని గడుపుతారో, వారిలో మాత్రం ఇన్ఫ్లమేషన్ స్థాయిలు అధికంగా ఉన్నట్టు తేలింది.

రోజులో కనీసం గంటసేపు పచ్చని చెట్ల మధ్య, నిర్మలమైన సరస్సుల చుట్టూ కాసేపు వాకింగ్ చేయడానికి ప్రయత్నించండి. మీకు మీ ఆరోగ్యం అన్ని విధాలుగా బాగుంటుంది.

తదుపరి వ్యాసం