Sleeping Mistakes: నిద్ర సరిగా పట్టడం లేదా? ఈ 5 పొరపాట్లు అసలు చేయకండి
01 December 2024, 19:00 IST
- Sleeping Mistakes: కొందరికి అలటగా, మబ్బుగా అనిపించినా నిద్ర పట్టాదు. అటుఇటు పొర్లుతూ ఉంటారు. అయితే సరిగా నిద్ర పట్టకపోవడానికి కొన్ని పొరపాట్లు కారణం కావొచ్చు. ఇలాంటివి చేయకుండా ఉండాలి. ఆ తప్పులు ఏవంటే..
Sleeping Mistakes: నిద్ర సరిగా పట్టడం లేదా? ఈ 5 పొరపాట్లు అసలు చేయకండి
శరీరం అలసిపోయి మబ్బుగా అనిపించి బెడ్‍పైకి వెళ్లినా కొన్నిసార్లు నిద్ర పట్టదు. ఎంత ప్రయత్నించినా కంటిపై కనుకు రాదు. బెడ్‍పై అటుఇటూ పొర్లినా నిద్రపట్టదు. ఈ పరిస్థితి అందరికీ ఎప్పుడోసారి ఎదురై ఉంటుంది. కొన్నిసార్లు నిద్రలోకి జారుకోవడం కష్టమైన విషయంగా మారుతుంది. అయితే, ఇలా రాత్రిళ్లు నిద్రపట్టకపోయేందుకు కొన్ని పొరపాట్లు కారణంగా ఉంటాయి. అవేవో ఇక్కడ చూడండి.
ఎలక్ట్రానిక్ డివైజ్‍ల వాడకం
నిద్రపోయే ముందు వరకు స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‍టాప్‍లు లాంటి ఎలక్ట్రానిక్ డివైజ్‍లు వాడకూడదు. వీటి స్క్రీన్‍ల నుంచి వచ్చే బ్లూలైట్ వల్ల శరీరంలో స్లీపింగ్ హార్మోన్ అయిన మెలటోనిన్ ఉత్పత్తి సరిగా ఉండదు. దీనివల్ల నిద్ర సరిగా పట్టదు. అందుకే బెడ్‍పైకి వెళ్లే కనీసం అరగంట ముందు నుంచే మొబైల్ సహా ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులు వాడకపోవడం మంచిది.
నిద్రించే ముందు కెఫిన్ తీసుకోవడం
బెడ్‍పైకి వెళ్లే కాసేపటి ముందే కెఫిన్ ఉండే కాఫీ, టీలు తాగకూడదు. కెఫిన్ శరీరాన్ని ఉత్తేజపరిచి నిద్ర రాకుండా చేయగలదు. అందుకే రాత్రివేళ్లలో కాఫీ, టీలు తాగితే సరిగా నిద్రపట్టదు. సాయంత్రంలోపే ఇవి తాగడం మేలు.
నిద్రకు ముందు భారీగా తినడం
బెడ్‍పైకి వెళ్లే ముందు భారీగా భోజనం చేయడం కూడా నిద్రకు ఆటంకమే. కడుపు భారంగా ఉండేలా ఫుల్‍గా తినేస్తే ఆహారం సరిగా జీర్ణం కాకుండా ఇబ్బందిగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో నిద్ర పట్టడం చాలా కష్టంగా ఉంటుంది. అందుకే నిద్రించేందుకు కనీసం రెండు గంటల ముందే డిన్నర్ చేయడం మంచిది. రాత్రివేళ కడుపుకు లైట్‍గా అనిపించే ఫుడ్స్ తింటే నిద్ర నాణ్యత మెరుగ్గా ఉంటుంది.
సరైన షెడ్యూల్ పాటించకపోవడం
నిద్రపోయేందుకు, మేల్కొనేందుకు నిర్దిష్టమైన టైమ్‍తో ఓ షెడ్యూల్‍ను సెట్ చేసుకోవాలి. అలా కాకుండా డిఫరెంట్ టైమ్‍ల్లో పడుకొని, లేస్తూ ఉంటే నిద్ర సరిగా పట్టడం కష్టమవుతుంది. ఓ టైమ్ సెట్ చేసుకుంటే కొన్ని రోజులకు శరీరం దానికి అనుగుణంగా ప్రవర్తిస్తుంది. అలా కాకుండా రోజుకో టైమ్‍లో నిద్రిస్తే కష్టమవుతుంది. అందుకే నిద్రకు ఓ షెడ్యూల్ చేసుకోవడం మంచిది.
నిద్రించే ముందు ఎక్సర్‌సైజ్
బెడ్‍పైకి వెళ్లే కాసేపటి ముందు హెవీ ఎక్సర్‌సైజ్‍లు చేయకూడదు. వ్యాయామాలు చేయడం వల్ల మెలటోనిన్ ఉత్పత్తి పెరిగి శరీరం యాక్టివ్‍గా అయి నిద్రసరిగా పట్టదు. నడవడం లాంటివి చేయవచ్చు. అందుకే నిద్రపోయేందుకు కనీసం రెండు గంటల ముందే వ్యాయామాలు చేసుకోవాలి. నిద్రకు టైమ్ సమీపిస్తున్నప్పుడు హెవీ వర్కౌట్స్ చేయకూడదు.
మానసిక ఒత్తిడి, ఆలోచనలు
మానసిక ఒత్తిడి, ఆందోళన ఉన్నప్పుడు కూడా నిద్ర సరిగా పట్టదు. అతిగా ఆలోచిస్తే కంటికి కునుకు పట్టడం కష్టమవుతుంది. నిద్రలేమి సమస్య ఎదురవుతుంది. అందుకే ఒత్తిడి ఉంటే తగ్గేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ధ్యానం లాంటివి చేయడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. నిద్రపోయే సమయంలో ఏ విషయం గురించి కూడా అతిగా ఆలోచించకూడదు. మెదడును వీలైనంత విశ్రాంతిగా ఉంచేలా ప్రయత్నించాలి.
ఒకవేళ చాలారోజులు సరిగా నిద్ర పట్టకుండా ఉంటే సంబంధిత వైద్యులను సంప్రదించాలి. మీకు ఎదురవుతున్న ఇబ్బందులు, సమస్య గురించి పూర్తిగా వివరించి వారు చెప్పే సూచనలు పాటించాలి. ఆరోగ్యానికి ముఖ్యమైన నిద్ర విషయంలో ఎట్టిపరిస్థితుల్లో నిర్లక్ష్యం వహించకూడదు. అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.