Coffee Tea: టీ, కాఫీలు మానేయాలని అనుకున్నా.. అలా చేయలేకున్నారా? ఈ 7 టిప్స్ పాటించండి
Coffee, Tea reduce Tips: టీ, కాఫీలు తాగడం తగ్గించాలని, మానేయాలని కొందరు అనుకుంటూ ఉంటారు. అయితే, మనసు అంగీకరించక అలా చేయలేకపోతారు. తరచూ ఇలాగే జరుగుతూ ఉంటుంది. అలా కాకుండా టీ, కాఫీలకు దూరంగా ఉండేందుకు కొన్ని టిప్స్ ఇక్కడ చూడండి.
కాఫీ, టీల్లో కెఫిన్ ఎక్కువగా ఉంటుంది. అందుకే ఇవి ఎక్కువగా తాగడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. కఫీన్ అతిగా తీసుకుంటే నిద్రలేమి, వికారం, ఆందోళన, ఛాతిలో నొప్పి సహా మరిన్ని సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. గుండెకు కూడా అంత మంచిది కాదు. కాఫీలు, టీలు కొందరు అతిగా తాగేస్తుంటారు. రోజుకో రెండు కప్‍లు అయితే పెద్దగా ఇబ్బంది ఉండదు. కానీ కొందరు మాత్రం చాలాసార్లు తాగుతుంటారు.
అయితే, కాఫీ, టీలు తగ్గించాలని, వీలైతే మానేయాలని చాలా మంది అనుకుంటుంటారు. అయితే, అందుకు మనసు అంగీకరించదు. వాటిని చూడగానే, ఆలోచన రాగానే తాగేయాలని అనిపిస్తుంది. దీంతో మళ్లీ షరామూమూలుగా లాగించేస్తుంటారు. అయితే, కాఫీ, టీలు మానేయాలని అనుకుంటున్న వారు కొన్ని చిట్కాలు పాటిస్తే దాన్ని ఆచరణలోకి తీసుకురావొచ్చు. ఆ అవేవో ఇక్కడ తెలుసుకోండి.
ఎన్నిసార్లో రాసుకోవాలి
రోజులో ఎన్నిసార్లు టీ లేదా కాఫీలు ఎన్ని కప్‍లు తాగుతున్నారో ఓ పేపర్‌పై రాసుకోవాలి. దీంతో రోజులో ఎంత కఫీన్ తీసుకుంటున్నారో లెక్కగట్టుకోవాలి. ఇకపై అవి తాగడం తగ్గించుకోవాలని నిర్ణయంచుకోవాలి. ఇలా రోజూ రాయడం వల్ల మీరు మీ అలవాటును అర్థం చేసుకొని.. టీ, కాఫీలు తగ్గించుకునేందుకు సహకరిస్తుంది. అనుకున్న పనిని గుర్తుచేస్తుంది.
ఒకేసారి వద్దు
అతిగా టీలు, కాఫీలు తాగాలనుకునే వారు కొందరు ఇక వద్దనుకొని ఒక్కసారిగా మానేస్తుంటారు. దీనివల్ల తలనొప్పి, నీరసం, చిరాకు లాంటివి వస్తుంటాయి. ఇవి తట్టుకోలేక మళ్లీ పాత పద్ధతికి వచ్చేస్తారు. అందుకే టీ, కాఫీలు మానేయాలంటే ఒక్కసారిగా కాకుండా క్రమంగా తగ్గించాలి. రోజుకు ఐదుసార్లు తాగే వారైతే ముందుగా మూడుసార్లుకు తెచ్చుకోవాలి. మరోవారం తర్వాత రెండుసార్లకు తగ్గించాలి. అలా క్రమంగా ఇవి తాగడం తగ్గించుకుంటూ పోవాలి.
ప్రత్యామ్నాయ డ్రింక్స్
టీ, కాఫీ తాగాలని అనిపించినప్పుడు ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయ డ్రింక్స్ తాగొచ్చు. గ్రీన్ టీ, హెర్బల్ టీలు లాంటి డ్రింక్స్ తాగాలి. ఇవి తీసుకుంటే రిఫ్రెషింగ్‍గా అనిపిస్తుంది. కఫీన్ తీసుకోవాలన్న ఆశ తగ్గుతుంది.
పండ్లు తినండి
కాఫీ, టీలు తగ్గించినప్పుడు అప్పుడప్పుడు ఎనర్జీ తక్కువైనట్టు అనిపిస్తుంది. మళ్లీ అవి తీసుకోవాలని అనిపిస్తుంది. అలా అయినప్పుడు టీ, కాఫీ కాకుండా పండ్లు తినాలి. పండ్లలోని ఫైబర్, నేచురల్ షుగర్స్ శరీరానికి ఎనర్జీ ఇస్తాయి.
డార్క్ చాక్లెట్
టీ, కాఫీ తాగకుండా తట్టుకోలేనప్పుడు.. డార్క్ చాక్లెట్ తినొచ్చు. డార్క్ చాక్లెట్‍లో కెఫిన్ ఉన్నా.. చాలా తక్కువే. అయితే, కాఫీ తాగిన ఫీలింగ్‍ను ఇది ఇస్తుంది. 70 శాతం కొకొవా ఉన్న చాక్లెట్‍ను ఎంపిక చేసుకోవాలి.
లక్షణాలకు మనసును సిద్దం చేసుకోవాలి
కాఫీ, టీలు మానేయాలనుకున్నప్పుడు.. ఆ కారణంగా వచ్చే లక్షణాలకు మనసును సిద్ధంగా ఉంచుకోవాలి. తలనొప్పి, నీరసం లాంటివి వచ్చే అవకాశం ఉందని గుర్తుంచుకోవాలి. ఇవి తాత్కాలికమే అని తెలుసుకోవాలి. కొంతకాలంలోనే శరీరం దీనికి అడ్జస్ట్ అవుతుందని గ్రహించాలి.
నీరు బాగా తాగండి
ఒక్కోసారి డీహైడ్రేషన్ అయినప్పుడు కూడా టీ, కాఫీలు ఎక్కువగా తాగాలని అనిపిస్తుంది. అందుకే రోజూ నీరు బాగా తాగండి. శరీేరం హైడ్రేటెడ్‍గా ఉండేలా చూసుకోండి. టీ, కాఫీ తాగాలనిపించినప్పుడు నీరు తాగండి. దీంతో ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి. కెఫిన్ తీసుకోవాలనే ఆశ తగ్గుతుంది.
టాపిక్