తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Ghee Taste Enhance Tips: నెయ్యి కాచేటప్పుడు ఈ పదార్థాలు కలపండి, రుచితో పాటూ ఆరోగ్యం

Ghee Taste Enhance tips: నెయ్యి కాచేటప్పుడు ఈ పదార్థాలు కలపండి, రుచితో పాటూ ఆరోగ్యం

06 September 2024, 14:00 IST

google News
  • Ghee Taste Enhance tips: నెయ్యిలో కొన్ని పదార్థాలను వేసి కాచితే రుచి మరింత బాగుంటుంది. వాటివల్ల మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఇచ్చే నెయ్యి రెడీ అవుతుంది. అవేంటో చూడండి. వాటిని ఎలా వాడాలో కూడా తెల్సుకోండి.

నెయ్యిని కాచేటప్పుడు ఇవి కలిపితే ఆరోగ్యం
నెయ్యిని కాచేటప్పుడు ఇవి కలిపితే ఆరోగ్యం (freepik)

నెయ్యిని కాచేటప్పుడు ఇవి కలిపితే ఆరోగ్యం

నెయ్యి తింటే అనేక లాభాలుంటాయని తెలిసిందే. అయితే దాన్ని మరింత ఆరోగ్యకరంగా మార్చే మార్గాలున్నాయి. వీటితో నెయ్యి రుచితో పాటూ, ఆరోగ్యమూ పెరుగుతుంది. నెయ్యి కాచేటప్పుడే కొన్ని పదార్థాలు వేయడం వల్ల రుచితో పాటూ నెయ్యి పూసగా వస్తుంది. మరింత ఆరోగ్యంగా మారుతుంది. అవేంటో చూడండి.

మెంతులు:

నెయ్యి కాచడం దాదాపు పూర్తయ్యాక చివర్లో రెండు నిమిషాల ముందు అర టీస్పూన్ మెంతులు వేయండి. అలా సన్నం మంట మీద వేడి చేయండి. దీంతో నెయ్యికి ప్రత్యేక రుచి వస్తుంది. మెంతుల ప్రయోజనాలూ పొందొచ్చు.

వెల్లుల్లి:

గార్లిక్ బటర్ అంటుంటాం కదా. అలాంటి రుచే రావాలంటే నెయ్యి కాచేటప్పుడు వెల్లుల్లిని చిన్న ముక్కలుగా కట్ చేసి కాచండి. దీంతో ఈ రుచి నెయ్యికి వస్తుంది. వెల్లుల్లి రుచి నచ్చేవాళ్లకి ఇలా కాచిన నెయ్యి ఫేవరైట్ అయిపోతుంది. వెల్లుల్లి వల్ల అధిక రక్తపోటు సమస్య తగ్గుతుంది. శరీరంలో ఇన్ఫ్లమేషన్ రాకుండానూ చూస్తుంది.

మునగాకు:

మునగాకు ఆరోగ్య ప్రయోజనాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నెయ్యి కాచడం పూర్తయ్యాక స్టవ్ కట్టేసి వేడి నెయ్యిలో మునగాకు కాండంతో సహా రెమ్మ లాగా వేసేయండి. దీంతో నెయ్యి రుచి పెరగడంతో పాటే మునగాకు ప్రయోజనాలూ పొందొచ్చు.

పసుపు, మిరియాలు:

పసుపుతో పాటే కాస్త మిరియాల పొడి కలపొచ్చు. ఇది బరువు తగ్గించడంలో సాయపడుతుంది. గుండె ఆరోగ్యానికి, కిడ్నీ పనితీరుకు సాయపడుతుంది. కాచడం పూర్తయ్యాక కాస్త పసుపు, మిరియాల పొడి వేసి కలిపితే సరిపోతుంది.

తులసి:

వెన్న నుంచి నెయ్యి కాచేటప్పుడు కొన్నిసార్లు ఒక రకమైన వాసన వస్తుంది. అది చాలా మందికి నచ్చదు. ఆ వాసన తగ్గి సువాసన రావాలంటే తులసి ఆకులు వేసి కాచండి. వాసన తగ్గించడంతో పాటే తులసి ప్రయోజనాలు పొందొచ్చు. రుచి కూడా పెరుగుతుంది.

దాల్చిన చెక్క:

దాల్చిన చెక్కకు యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలున్నాయి. ఇది షుగర్ తగ్గించడంలోనూ సాయపడుతుంది. ఉదర సంబంధిత వ్యాధులకూ ఉపశమనం ఉంటుంది. అయితే దాల్చినచెక్క వాసన అందరికీ నచ్చకపోవచ్చు. అందుకే మొత్తం నెయ్యి కాచేటప్పుడు దాల్చిన చెక్క వేయకండి. బదులుగా కాచిన నెయ్యిని కొద్దిగా వేరే పాత్రలోకి తీసుకుని అందులో అంగుళం దాల్చిన చెక్క వేయండి. ఒక నిమిషం కాచి వాడుకుంటే ప్రయోజనాలు పొందొచ్చు.

 

 

తదుపరి వ్యాసం