Ghee residue usage: నెయ్యి కాచాక మిగిలిన మాడు లేదా గసిని పడేయకండి, ఇలా వాడితే మంచి రుచి-how to reuse ghee leftover residue to make different dishes ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Ghee Residue Usage: నెయ్యి కాచాక మిగిలిన మాడు లేదా గసిని పడేయకండి, ఇలా వాడితే మంచి రుచి

Ghee residue usage: నెయ్యి కాచాక మిగిలిన మాడు లేదా గసిని పడేయకండి, ఇలా వాడితే మంచి రుచి

Koutik Pranaya Sree HT Telugu
Sep 01, 2024 03:30 PM IST

Ghee residue usage: నెయ్యి చేయగా మిగిలిపోయిన గసి లేదా గోదారిని పడేయకండి. దాన్ని రకరకాల వంటకాల్లో వాడేయొచ్చు. ఆ రెసిపీలు ఏంటో చూసేయండి

గసితో వంటలు
గసితో వంటలు

ఇంట్లో నెయ్యి కాచిన తర్వాత ముదురు గోధుమ రంగులో కాస్త కోవా లాగా ఉండే గసి మిగులుతుంది. దీన్నే చాలా చోట్ల గోదారీ అని పిలుస్తారు. కొంతమంది దీంట్లో పంచదార కలుపుకుని స్వీట్ లాగా తినేస్తారు. దీంట్లోనూ పోషకాలుంటాయి. కానీ కొందరు అలా తినడానికి ఇష్టపడక వృథాగా బయట పడేస్తారు. దాన్ని ఉపయోగించి కొన్ని స్నాక్స్, స్వీట్స్, మంచి వంటకాలు కూడా చేసుకోవచ్చు. అవేంటో చూడండి. 

గులాబ్ జామూన్:

గసిని వాడి గులాబ్ జామూన్ తయారు చేసి చూడండి. మామూలుగా కోవా వేసి కాలా జామూన్ చేస్తాం కదా. బదులుగా దీన్ని నిల్వ చేసుకుని గులాబ్ జామూన్ మధ్యలో స్టఫ్ఫింగ్ లాగా పెట్టి చేసేయండి. రుచిలో మార్పు మీకే తెలుస్తుంది.

క్యారట్ హల్వా:

క్యారట్ హల్వా తయారు చేసేటప్పుడు చాలా మంది పాలు లేదా కోవా కలుపుతారు. వాటికి బదులుగా ఈ నెయ్యి గసిని వాడొచ్చు. దీంతో హల్వా తినేటప్పుడు క్రీమీ, క్రంచీ రుచితో పాటూ కొత్తగానూ ఉంటుంది.

శనగపిండి హల్వా:

నెయ్యిలో శనగపిండిని వేయించి అందులో పంచదార పాకం కలిపితే శనగపిండి హల్వా రెడీ అవుతుంది. సాధారణంగా దీంట్లో కోవా వాడరు. కానీ ఒకసారి గసి లేదా గోదారిని కలిపి ఈ హల్వా చేయండి. రుచి అద్భుతంగా ఉంటుంది. తినేటప్పుడు పాల రుచి నోటికి తగులుతుంది.

స్వీట్ రైస్:

నెయ్యి, పాలు, పంచదార లేదా బెల్లం వాడి చేసే తీపి అన్నంలో కాస్త గసి వేసి ఉడికించండి. ఈ అన్నం, గసితో కలిసి పాలలో ఉడికినప్పుడు ప్రత్యేక రుచి వస్తుంది. ఇంకేవైనా తీపి అన్నం తయారీలో కూడా దీన్ని వాడి చూడండి. దీంతో రుచి మారిపోతుంది.

గ్రేవీ కర్రీల కోసం:

పంచదార లేని కోవా, లేదా పన్నీర్ ను కొన్ని రకాల కూరల గ్రేవీ కోసం వాడతారు. బదులుగా ఈ గసిని కూడా వాడొచ్చు. కూరకు దీంతో క్రీమీ రుచి వస్తుంది. పన్నీర్ కర్రీ కోసం చేసే మసాలాలు, సింపుల్ కర్రీల మసాలాలలోనూ దీన్ని వాడొచ్చు.

స్వీట్స్ కోసం:

లడ్డూలు, హల్వాలు, దూద్ పేడ లాంటి స్వీట్స్ తయారు చేసేటప్పుడు ఈ గసిని వాడి చూడండి. కలాకండ్ లాంటి రెసిపీల కోసం కోవా బదులుగా ఈ గిసిని వాడొచ్చు. రుచి కూడా బాగుంటుంది.

 

 

 

టాపిక్