Bellam biscuits: బెల్లం బిస్కట్లు ఇలా చేసి పెట్టారంటే, బయటి బిస్కట్లు నచ్చవు-how to make jaggery or bellam biscuits at home without oven ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Bellam Biscuits: బెల్లం బిస్కట్లు ఇలా చేసి పెట్టారంటే, బయటి బిస్కట్లు నచ్చవు

Bellam biscuits: బెల్లం బిస్కట్లు ఇలా చేసి పెట్టారంటే, బయటి బిస్కట్లు నచ్చవు

Koutik Pranaya Sree HT Telugu
Aug 31, 2024 03:30 PM IST

Bellam biscuits: బెల్లం, గోధుమపిండి వాడి మంచి ఫ్లేవర్‌తో, రుచితో సింపుల్ గా బిస్కట్లు చేసేయొచ్చు. వీటి తయారీకి కేవలం ఆరు పదార్థాలు ఉంటే సరిపోతుంది. అవి కూడా ఇంట్లో ఉండేవే. వాటి తయారీ ఎలాగో చూసేయండి.

బెల్లం బిస్కట్లు
బెల్లం బిస్కట్లు

బిస్కట్లంటే బయట కొనుక్కునే స్నాక్ అని ఫిక్సయిపోతారు. కానీ కాస్త ఓపిక తెచ్చుకుంటే చాలా సులువుగా ఇంట్లోనే రకరకాల రుచుల్లో వీటిని తయారు చేసుకోవచ్చు. బయట దొరికే దాదాపు అన్ని రకాల బిస్కట్లలో మైదా ఉంటుంది. కానీ ఇంట్లోనే గోధుమపిండి, బెల్లం వాడి రుచిగా ఆరోగ్యకరమైన బిస్కట్లు చేసేయొచ్చు. వాటి తయారీ ఎలాగో చూసేయండి.

బెల్లం బిస్కట్ల తయారీకి కావాల్సిన పదార్థాలు:

కప్పున్నర గోధుమపిండి

అరకప్పు బెల్లం పొడి

100 గ్రాముల బటర్ లేదా నెయ్యి

సగం చెంచా బేకింగ్ పౌడర్

2 చెంచాల పాలు

చిటికెడు ఉప్పు

బెల్లం బిస్కట్ల తయారీ విధానం:

  1. ఒక పెద్ద వెడల్పాటి బౌల్ తీసుకోవాలి. అందులో గోధుమపిండి, బెల్లం పొడి, ఉప్పు, బేకింగ్ పౌడర్ వేసుకోవాలి.
  2. అన్నీ బాగా కలిసిపోయేలా ఒకసారి కలియబెట్టాలి.
  3. ఇప్పుడు నెయ్యి లేదా బటర్ కూడా వేసుకుని ఒకసారి చేత్తోనే గట్టిగా కలపాలి.
  4. పాలు కూడా వేసి మరోసారి కలపాలి. ఎంత బాగా పిండి కలిపితే బిస్కట్లు అంత బాగా వస్తాయి. పాలు వేశాక పిండి ముద్దలా అవుతుంది.
  5. ఇప్పుడు చపాతీలు చేసే చెక్క మీదకు ఈ ముద్దను తీసుకుని మందంగా చపాతీలాగా చేసుకోవాలి.
  6. గిన్నెతో లేదంటే చాకు సాయంతో మీకిష్టమైన ఆకారంలో వీటిని కట్ చేసుకోవాలి.
  7. లేదంటే ఒక ట్రే లోకి ఈ పిండి తీసుకుని సమంగా చపాతీ కర్రతో సన్నగా చేసి అదే ట్రేలో మీకిష్టమైన ఆకారంలోనూ కట్ చేసుకోవచ్చు.
  8. ఓవెన్‌తో, ఓవెన్ లేకుండా ఈ బిస్కట్లు చేసుకోవచ్చు. ఒకవేళ ఓవెన్ ఉంటే ముందుగానే 160 డిగ్రీల వద్ద ప్రిహీట్ చేసుకోవాలి.
  9. పావుగంట సేపు ఓవెన్ లో బేక్ చేస్తే బిస్కట్లు రెడీ అవుతాయి.
  10. ఓవెన్ లేకపోతే ఒక మందం అడుగున్న కడాయి లేదా కుక్కర్ తీసుకోవాలి. అందులో సగం కేజీ దాకా ఉప్పు పోసుకోవాలి.
  11. మూత పెట్టి ఉప్పును వేడి అవ్వనివ్వాలి. కనీసం పది నిమిషాలు మీడియం మంట మీద వేడి చేశాక మధ్యలో ఒక స్టీల్ స్టాండ్ పెట్టుకోవాలి.
  12. ఆ స్టాండ్ మీద బిస్కట్లు పరిచి పెట్టుకోవాలి. మూత పెట్టి మీడియం మంట మీద పావుగంట సేపు వదిలేస్తే బిస్కట్లు బేక్ అయిపోతాయి. బటర్, బెల్లం ఫ్లేవర్ ఉండే ఈ బిస్కట్ల రుచి తప్పకుండా నచ్చుతుంది.

ఇవే బిస్కట్లను బెల్లం పొడికి బదులు పంచదార పొడి చేసి చేసుకోవచ్చు. పిండిలో సన్నగా తరుగుకున్న డ్రై ఫ్రూట్స్ ముక్కలు వేసుకోవచ్చు. వాటితో బిస్కట్లు మరింత రుచిగా ఉంటాయి. 

 

 

టాపిక్