Oranges: ఆయుర్వేదం ప్రకారం భోజనం చేశాక నారింజ పండ్లను తినకూడదు, ఎందుకో తెలుసా
17 April 2024, 16:30 IST
- Oranges: నారింజ పండ్ల వాసన చూస్తేనే తినేయాలనిపిస్తుంది. నారింజ జ్యూస్‌ని ఇష్టపడే వారు ఎక్కువే. అయితే భోజనం చేశాక నారింజ పండ్లను తినకూడదని ఆయుర్వేదం చెబుతోంది.
నారింజలు
Oranges: నారింజ పండ్లు అన్ని కాలాల్లోనూ లభిస్తాయి. నారింజ జ్యూస్‌ను ఇష్టపడే వారి సంఖ్య ఎక్కువే. ముఖ్యంగా వేసవిలో చల్ల చల్లని నారింజ జ్యూసులు తాగేందుకు ఎంతో మంది ఇష్టపడతారు. అయితే ఆయుర్వేదం చెబుతున్న ప్రకారం భోజనం చేశాక నారింజ పండ్లను లేదా నారింజ జ్యూస్ ను తాగకూడదు. ఎందుకో కూడా ఆయుర్వేదం వివరిస్తోంది. సాధారణంగా నారింజ జ్యూస్ తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. చర్మం, జుట్టు, జీర్ణక్రియకు నారింజలోని పోషకాలు ఎంతో మేలు చేస్తాయి. కణాలను దెబ్బ తినకుండా కాపాడతాయి. నారింజ పండు రోజులో ఎప్పుడైనా తినవచ్చు. కానీ భోజనం చేశాక మాత్రం తినకూడదు. ఆయుర్వేదం ప్రకారం భోజనం తర్వాత నారింజ పండ్లను తినడం వల్ల కొన్ని రకాల దుష్ప్రభావాలు పడే అవకాశం ఉంది.
ఆయుర్వేదం ప్రకారం నారింజ తో సహా కొన్ని రకాల పండ్లను భోజనం తర్వాత తినకపోవడమే మంచిది. ముఖ్యంగా నారింజని ఎందుకు తినకూడదో ఆయుర్వేదం వివరిస్తోంది.
ఎందుకు తినకూడదు?
నారింజ, నిమ్మ, ద్రాక్ష, కివి, పైనాపిల్ పండు... ఇవన్నీ కూడా సిట్రస్ పండ్ల జాతికి వస్తాయి. అంటే ఈ పండ్లలో సిట్రిక్ యాసిడ్ నిండి ఉంటుంది. ఇది పుల్లని రుచిని ఇస్తుంది. ఇతర ఆహారాలతో పోలిస్తే సిట్రస్ పండ్లలోని ఆమ్లాలు త్వరగా విచ్చిన్నమవుతాయి. కాబట్టి మధ్యాహ్న భోజనం లేదా రాత్రి భోజనం తిన్నాక ఈ పండ్లను తినడం వల్ల శరీరంలో టాక్సిన్లు ఏర్పడే అవకాశం ఉంది. దీన్ని ‘అమా’ అని పిలుస్తారు. ఎందుకంటే ఆహారాన్ని జత చేయడం వల్ల జీర్ణక్రియ ఆలస్యం అవుతుంది.
ఆహారం తిన్నాక నారింజ పండ్లను తినడం వల్ల అవి జీర్ణం కాకుండా చివరి వరకు ఉంటాయి. ముందుగా బరువుగా ఉన్న ఆహారం జీర్ణం అవుతుంది. ఆ తర్వాతే నారింజ పండ్లు జీర్ణం అవుతాయి. ఈలోపు అవి జీర్ణరసాలు పులియబడేలా చేస్తాయి. శరీరానికి పోషకాలను అందకుండా అడ్డుకుంటాయి. దీనివల్ల కడుపునొప్పి, గుండెల్లో మంట, యాసిడ్ రిఫ్లెక్స్ వంటి సమస్యలు రావచ్చు.
నారింజ పండ్లు ఎప్పుడు తినాలి?
ఆయుర్వేద నిపుణులు చెబుతున్న ప్రకారం సిట్రస్ పండ్లు తినడానికి సరైన సమయం... ఉదయం. అది కూడా ఖాళీ పొట్టతో నారింజ పండ్లను తినడం వల్ల శరీరం గరిష్టంగా పోషకాలను గ్రహిస్తుంది. లేదా రెండు భోజనాల మధ్య నారింజపండును తినవచ్చు. మధ్యాహ్న భోజనం తిన్నాక రెండు గంటలు గ్యాప్ ఇచ్చాక నారింజను తినాలి. ఉదయం 11 గంటలకు లేదా సాయంత్రం నాలుగు గంటలకు ఈ పండ్లను తినడానికి ఉత్తమ సమయం. ఆ సమయంలో మధ్యాహ్న భోజనం తిని కొన్ని గంటలు గడుస్తుంది. కాబట్టి ఎలాంటి ఇబ్బంది ఉండదు.