తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Burnt Tongue Remedies | నాలుక కాల్చుకున్నారా? ఈ చిట్కాలతో సత్వర ఉపశమనం పొందండి!

Burnt Tongue Remedies | నాలుక కాల్చుకున్నారా? ఈ చిట్కాలతో సత్వర ఉపశమనం పొందండి!

HT Telugu Desk HT Telugu

01 June 2023, 9:42 IST

google News
    • Burnt Tongue Remedies: అనుకోకుండా ఇలా నాలుకను కాల్చుకున్నప్పుడు, కాలిన నాలుకకు సత్వర ఉపశమనం కలిగించేలా కొన్ని చిట్కాలు ఉన్నాయి, ఆ చిట్కాలు ఏమిటో ఇక్కడ తెలుసుకోండి.
Burnt Tongue Remedies:
Burnt Tongue Remedies: (unsplash)

Burnt Tongue Remedies:

Burnt Tongue Remedies: అప్పుడప్పుడు వేడివేడి కాఫీని నోట్లో ఒక్కసారిగా తీసుకున్నప్పుడు గానీ లేదా లేదా వేడిగా ఉన్న ఆహారాలను నోట్లో వేసుకున్నప్పుడు నాలుకకు చురుకు తగులుతుంది. ఆ వేడి పదార్థాన్ని అటు మింగలేక, కక్కలేక కొద్దిసేపు సతమతమవుతాం. నాలుక కాలినపుడు వచ్చే ప్రమాదం ఏమీ లేదు కానీ, లేతగా సున్నితంగా ఉండే నోటి లోపలి భాగంలో పొక్కులు రావడం లేదా ఎర్రగా కమలడం, చర్మం ఊడిపోవటం జరుగుతుంది. కొంతకాలం పాటు నాలుకపై తిమ్మిరి ఉంటుంది. మండుతుంది, ఏదైనా వేడి ఆహారాలను తీసుకోలేకపోతాం. ఈ సమస్య కొన్నిరోజులకు దానంతటదే పరిష్కారం అవుతుంది గానీ, ఆ కొన్నిరోజులు కూడా ఏదైనా తినేటపుడు గానీ, తాగేటపుడు గానీ కొద్దిగా అసౌకర్యంగా అనిపిస్తుంది. ముఖ్యంగా వేడిగా, కారంగా ఉండే పదార్థాలను తినేటపుడు నోరు మంటగా అనిపిస్తుంది.

అనుకోకుండా ఇలా నాలుకను కాల్చుకున్నప్పుడు, కాలిన నాలుకకు సత్వర ఉపశమనం కలిగించేలా కొన్ని చిట్కాలు ఉన్నాయి, ఆ చిట్కాలు ఏమిటో మీరూ తెలుసుకోండి.

వెంటనే చల్లటి పదార్థాన్ని తినండి

వేడి పదార్థంతో నాలుక కాలినపుడు వెంటనే చల్లటి పదార్థాన్ని నమలండి. చల్లని పెరుగు, ఐస్ క్రీం లాంటివి తినవచ్చు. లేదా శీతల పానీయాన్ని సిప్ చేయండి, పాప్సికల్స్ పీల్చుకోండి, ఇది మంటను తగ్గించి మీ నాలుకకు ఓదార్పునిస్తుంది. మంట నాలుక లోపలి పొరలకు చేరకుండా అడ్డుకుంటుంది. అయితే చాలా చల్లగా ఉండే, నాలుకకు అంటుకునే పదార్థాలను తీసుకోవద్దని గుర్తుంచుకోండి. అనంతరం కొన్ని నీళ్లు తాగండి.

పాలు లేదా పాల పదార్థాలు తీసుకోండి

కాలిన నాలుకకు పాలు లేదా పాల పదార్థాలు ఉపశమనం కలిగిస్తాయి. చిక్కటి పాలలోని మృదుత్వం నాలుకపై పూతగా ఏర్పడి మంటను తగ్గిస్తాయి. ముఖ్యంగా కాలిన నాలుకతో కారం తినలేకపోతున్నప్పుడు పాలు తాగితే ప్రయోజనం ఉంటుంది. చల్లని పాలు, పెరుగు లేదా ఏవైనా పాల పదార్థాలు తీసుకోవచ్చు.

చక్కెర లేదా తేనె ఉపయోగించండి

పాలు మాదిరిగానే, మీరు మీ నాలుకను తేనెతో పూత పూయవచ్చు. తేనెలో యాంటీ బాక్టీరియల్ గుణాలు కూడా ఉన్నాయి, ఇవి ఇన్ఫెక్షన్‌ను నివారించగలవు. మీ నాలుకపై చక్కెర చల్లుకోవడం మరొక చిట్కా. చక్కెర నొప్పిని తగ్గిస్తుంది.

ఉప్పునీరు ఉపయోగించండి

ఉప్పునీటితో నోటిని పుక్కిలించండి. నాలుక కాలిన తర్వాత ఆ ప్రాంతం సున్నితంగా మారుతుంది. ఇది ఇన్ఫెక్షన్‌కు కారణమయ్యే ఏదైనా బ్యాక్టీరియా వృద్ధికి కారణం కావచ్చు. కాబట్టి ఉప్పునీటితో మీ నోటిని పుక్కిలించడం ద్వారా మీ నోరు శుభ్రపడుతుంది, బ్యాక్టీరియా రహితం అవుతుంది. అయితే, ఎక్కువ ఉప్పు వినియోగించకుండా జాగ్రత్త వహించండి. ఎక్కువ ఉప్పు మీ గాయాన్ని చికాకుపెడుతుంది. ఒక పావు లీటరు నీటిలో 1/8 టీస్పూన్ కరిగించి, ఆ నీటితో నోరు పుక్కిలించి తర్వాత నీటిని ఉమ్మివేయాలి.

పసుపు మిశ్రమం

పసుపులోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు నాలుకపై మంటను తగ్గించడానికి చాలా ప్రభావవంతంగా ఉంటుంది. 1-2 టేబుల్ స్పూన్ల పాలను 1/4 టీస్పూన్ పసుపును కలిపి సింపుల్ పసుపు పేస్ట్ తయారు చేయండి. మీ చేతి వేలు లేదా ఇయర్‌బడ్‌ని ఉపయోగించి ఈ మిశ్రమాన్ని నాలుకకు అప్లై చేసి సుమారు 10 నిమిషాల పాటు అలాగే ఉంచండి. ఆ తర్వాత మీ నోరు కడుక్కోండి.

విటమిన్ ఇ తీసుకోండి

విటమిన్ ఇ నాలుక కాలిన నాలుకతో సహా ఏవైనా కాలిన గాయాలను నయం చేస్తుంది. కాలిన గాయం వేగంగా మానడంలో సహాయపడుతుంది. 1,000 IU లిక్విడ్ విటమిన్ ఈ క్యాప్సూల్‌ను నేరుగా మీ నాలుకపై పిండండి. కాలిన గాయానికి అప్లై చేయండి.

అలాగే ఈ చర్యలతో మీ నోటిని ఆరోగ్యంగా ఉంచుకోవడం కోసం దంతాలను బ్రష్ చేయడం, ఫ్లాస్ చేయడం వంటి రొటీన్ చర్యలను కొనసాగించండి.

నాలుక కాలినపుడు కారం పదార్థాలు, వేడి పదార్థాలు, మంట కలిగించే పదార్హాలను తీసుకోకండి.

తదుపరి వ్యాసం