తెలుగు న్యూస్  /  Lifestyle  /  5 Homemade Hair Masks To Nourish Your Scalp And Reduce Hair Fall

Homemade Hair Masks : జుట్టు బాగా రాలుతోందా? అయితే ఈ మాస్క్​లు వేసేయండి..

24 November 2022, 11:52 IST

    • Homemade Hair Masks : యువతను వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో జుట్టు రాలడం ఒకటి. చిన్నవయసులోనే బట్టతలతో చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్య చలికాలంలో మరి ఎక్కువగా ఉంటుంది. అయితే కొన్ని మాస్క్​లు ప్రయత్నించడం వల్ల హెయిర్ లాస్​ అవ్వదు అంటున్నారు.
చలికాలంలో జుట్టును ఇలా కాపాడుకోండి
చలికాలంలో జుట్టును ఇలా కాపాడుకోండి

చలికాలంలో జుట్టును ఇలా కాపాడుకోండి

Homemade Hair Masks : చలికాలంలో జుట్టు ఆరోగ్యంగా కనిపించాలన్నా.. జుట్టు రాలకుండా ఆపాలన్నా.. హెయిర్ డ్రైగా కాకుండా ఉండాలన్నా.. చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే.. శీతాకాలంలో చాలా జుట్టు సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. పొడివాతావరణం కారణంగా జుట్టు రాలడం, చుండ్రు సమస్య మొదలవడం, జుట్టు డ్రైగా మారడం జరుగుతుంది.

చుండ్రు, జుట్టు చివరన చిట్లిపోవడం, వెంట్రుకలు చీలిపోవడం, తలలో దురద వంటివన్ని సమస్యలు వస్తాయి. ఇవన్నీ జుట్టు రాలడంలో ముఖ్యపాత్ర పోషిస్తాయి. అయితే ఇంట్లోనే ఉంటూ.. హెయిర్​ని జాగ్రత్తగా కాపాడుకోవచ్చు అంటున్నారు. ఇంట్లోనే తయారు చేసుకోగలిగే.. హోమ్ మేడ్ హెయిర్​ మాస్క్​లతో ఈ సమస్యలకు చెక్ పెట్టవచ్చు అంటున్నారు. ఇంతకీ ఈ హెయిర్ మాస్క్​లు ఏమిటో.. వాటిని ఎలా తయారు చేసుకోవాలో.. ఇప్పుడు తెలుసుకుందాం.

గుడ్డు, తేనె, ఆలివ్ ఆయిల్ హెయిర్ మాస్క్

గుడ్డులోని పచ్చసొన, తేనే, ఆలివ్ ఆయిల్​తో తయారు చేసే ఈ మాస్క్ మీకు మెరిసే, మృదువైన జుట్టును పొందడానికి సహాయం చేస్తుంది. మీరు చేయాల్సిందల్లా.. ఒక గిన్నె తీసుకుని దానిలో గుడ్డు పచ్చసొన, ఒక స్పూన్ తేనె, ఒక టేబుల్ స్పూన్ ఆలివ్ నూనె వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని మీ జుట్టు, స్కాల్ప్‌కు అప్లై చేసి.. ఐదు నుంచి 10 నిమిషాలు ఆరనివ్వండి. అనంతరం షాంపూతో కడిగేయండి.

కొబ్బరి నూనె, ఆపిల్ సైడర్ వెనిగర్, తేనె మాస్క్

రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనె, ఒక టేబుల్ స్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్, రెండు టేబుల్ స్పూన్ల తేనెను బాగా కలపండి. దీన్ని మీ తలకు, జుట్టుకు అప్లై చేసి.. సుమారు 30 నిమిషాల పాటు అలాగే ఉంచండి.

అనంతరం మీరు షాంపూ చేసుకోండి. మిగిలిన మాస్క్ మిశ్రమాన్ని.. మీరు ఒక కూజాలో నిల్వ చేసుకోవచ్చు. తర్వాత మీరు పదేపదే సిద్ధం చేయవలసిన అవసరం లేదు. ఈ మాస్క్ హెయిర్​కి తేమను అందిస్తూ.. చుండ్రు, దురద సమస్యలను దూరం చేస్తుంది.

అరటి, గుడ్డు, తేనె మాస్క్

ఒక అరటిపండు, ఒక గుడ్డు పచ్చసొన, ఒక టేబుల్ స్పూన్ తేనె బాగా కలపండి. మంచి క్రీమ్​గా అయ్యేవరకు బాగా కలపండి. ఈ హెయిర్ మాస్క్ మిశ్రమాన్ని మీ జుట్టు మూలాల నుంచి.. చివరి వరకు అప్లై చేసి.. మసాజ్ చేయండి.

20 నిమిషాలు అలాగే ఉంచి.. ఆపై మీ షాంపూతో శుభ్రం చేసుకోండి. మంచి ఫలితాల కోసం మీ రెగ్యులర్ కండీషనర్‌ని అప్లై చేయండి. ఈ మాస్క్ స్కాల్ప్, హెయిర్ ఫోలికల్స్​కు పోషణను అందిస్తుంది.

పెరుగు, అరటి మాస్క్

అరటిపండు మెత్తగా గ్రైండ్ చేయాలి. దానిలో అరకప్పు పెరుగు, 2 స్పూన్ల ఆలివ్ ఆయిల్ వేసి బాగా కలపాలి. దీనిని మీ జుట్టు, తలకు అప్లై చేయండి. సుమారు 45 నిమిషాలు ఉండనివ్వండి. అనంతరం గోరువెచ్చని నీటితో, మీ రెగ్యులర్ షాంపూతో కడిగేయండి.

అవకాడోస్, ఆలివ్ ఆయిల్ మాస్క్

అవకాడోలు సహజంగానే పోషణ, తేమను అందించే లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి జుట్టుకు సంపూర్ణ రక్షణ ఇస్తుంది. ఈ మాస్క్‌ను సిద్ధం చేయడానికి.. అవకాడో పండ్లను గ్రైండ్ చేసి.. దానికి రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల ఆలివ్ ఆయిల్ వేసి బాగా కలపండి. ఈ మిశ్రమాన్ని మీ జుట్టుకు అప్లై చేయండి. 30 నుంచి 45 నిమిషాల పాటు ఉంచండి. అనంతరం షాంపు చేయండి.

ఈ మాస్క్​లు కచ్చితంగా మీ జుట్టుకి సంరక్షణనిస్తాయి. అయితే మంచి ఫలితాల కోసం రెగ్యూలర్​గా వీటిని ఉపయోగించాల్సి ఉంటుంది. ఇవి ట్రై చేసినా కూడా సమస్య తీవ్రంగా ఉంటే.. మీరు వైద్యుడిని సంప్రదిస్తే మంచిది.