Yoga poses for Kidneys: కిడ్నీల ఆరోగ్యాన్ని మెరుగుపరిచే 3 యోగాసనాలు.. రెగ్యులర్‌గా చేయండి
24 November 2024, 6:00 IST
- Yoga poses for Kidneys: ఇటీవలి కాలంలో చాలా మందిలో కిడ్నీల సమస్యలు తలెత్తుతున్నాయి. అందుకే వీటి పట్ల ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. కిడ్నీలు ఆరోగ్యంగా ఉండేందుకు, పనితీరు మెరుగుపడేందుకు కొన్ని యోగాసనాలు ఉపకరిస్తాయి.
Yoga poses for Kidneys: కిడ్నీల ఆరోగ్యాన్ని మెరుగుపరిచే 3 యోగాసనాలు.. రెగ్యులర్‌గా చేయండి
రక్తం నుంచి వ్యర్థాలను ఫిల్టర్ చేసే మూత్రపిండాలు (కిడ్నీలు) శరీరంలో ఓ ముఖ్యమైన భాగం. ఆ వ్యర్థాలు ద్రవరూపంలో బయటికి వచ్చేలా కిడ్నీలు చేస్తాయి. శరీరంలో ఇంతటి కీలకమైన పనిని చేస్తాయి. అందుకే కిడ్నీల్లో ఏదైనా సమస్య ఉంటే ఓవరాల్ ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. ఇటీవలి కాలంలో కిడ్నీల సమస్యలు చాలా మందిలో పెరుగుతున్నాయి. అందుకే వీటిపై శ్రద్ధ వహించాలి. కిడ్నీల ఆరోగ్యాన్ని, పనితీరును మెరుగుపరిచే మూడు రకాల యోగాసనాలు ఏవో ఇక్కడ తెలుసుకోండి.
కపాలభాతి ప్రాణాయామం
ఈ కపాలభాతి ప్రాణాయామం ఆసనం వల్ల శరీరంలో వెచ్చదనం పెరుగుతుంది. దీంతో వ్యర్థాలు సులభంగా బయటికి వెళ్లేందుకు తోడ్పడుతుంది. ఇది మూత్రపిండాలపై ఒత్తిడిని తగ్గిస్తుంది. కిడ్నీలతో పాటు కాలేయానికి కూడా మేలు చేస్తుంది. జీర్ణవ్యవస్థ, జీవక్రియలు, కిడ్నీల పనితీరును మెరుగుపరుస్తుంది.
- కపాలభాతి ప్రాణాయామం ఇలా: ముందుగా కాళ్లు మడతపెట్టుకొని పద్మాసనం వేసినట్టుగా కింద కూర్చోవాలి.
- ముందుగా గాఢంగా శ్వాసపీల్చాలి. ఆ తర్వాత వదలాలి.
- శ్వాస పీల్చే సమయంలో పొత్తికడుపును లోపలికి అనాలి, శ్వాసవదిలేటప్పుడు పొట్టను సాధారణ స్థితికి తేవాలి.
- ఇలా పొత్తి కడుపును ముందుకు, వెనక్కి వెంటనేవెంటనే తీసుకెళుతూ ఉండాలి.
- ఒక్కో రౌండ్‍లో సుమారు 20సార్లు ఇలా శ్వాస తీసుకొని, వదలాలి. ఎన్ని రౌండ్స్ వీలైతే అన్ని రౌండ్స్ చేయాలి.
పశ్చిమోత్తానాసనం
పశ్చిమోత్తానాసనం వేయడం వల్ల కిడ్నీలు, కాలేయం ప్రేరణ చెందుతాయి. వారి పనితీరు మెరుగవుతుంది. జీర్ణక్రియకు మేలు జరుగుతుంది. కడుపు, కటి అవయవాలకు మేలు జరుగుతుంది. ఈ ఆసనం వల్ల మానసిక ఒత్తిడి కూడా తగ్గుతుంది.
- పశ్చిమోత్తానాసనం ఇలా: కింద కూర్చొని రెండుకాళ్లను ముందుకు చాపాలి.
- ఆ తర్వాత పాదాల వెళ్లను కాస్త వెనక్కి వంచాలి.
- అనంతరం నడుమును వంచుతూ ముందుకు వంగాలి.
- రెండు చేతులతో కాలి వేళ్లను పట్టుకవాలి. ఆ సమయం ఛాతి తొడలకు తాకేలా ఉండాలి. కనీసం గ్యాప్ అయినా తక్కువగా ఉండేలా చూసుకోవాలి.
- వంగినప్పుడు తల కూడా కాళ్లపై ఆనించాలి.
- ఇలా ఈ భంగిమలో సుమారు 30 సెకన్ల పాటు ఉండాలి. ఆ తర్వాత మామూలు స్థానానికి రావాలి. వీలైతే మళ్లీ ఇది రిపీట్ చేయాలి.
ధనూరాసనం
ధనూరాసనం వల్ల జీర్ణవ్యవస్థకు మేలు జరుగుతుంది. జీర్ణక్రియ మెరుగవుతుంది. కిడ్నీలు, కాలేయం మెరుగ్గా పని చేసేలా తోడ్పడుతుంది. డయాబెటిస్‍తో బాధపడే వారికి కూడా ఈ ఆసనం ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ ఆసనం వేయడం వల్ల శరీర ఫ్లెక్సిబులిటీ బాగా పెరుగుతుంది. ఈ ఆసనంలో శరీరాన్ని విల్లులా వంచాలి. అందుకే దీనికి ధనూరాసనం అనే పేరొచ్చింది.
- ధనూరాసనం ఇలా: ముందుగా కింద బోర్లా పడుకోవాలి.
- ఆ తర్వాత మోకాళ్లను మీ వైవునకు మడవాలి. రెండు చేతులతో కాళ్ల పాదాల పైభాగమైన చీలమండ (యాంకిల్)ను పట్టుకోవాలి.
- ఆ తర్వాత క్రమంగా శరీర కింది భాగాన్ని పైకి లేపాలి.
- అనంతరం తల, రొమ్మును కూడా పైకి లేపాలి.
- దీంతో శరీర భారం మొత్తం పొత్తి కడుపుపై ఎక్కువగా ఉంటుంది.
- శరీరాన్ని ధనస్సులా వంచినట్టు ఈ భంగిమ ఉంటుంది. ఈ ధనూరాసనంలో సుమారు 30 సెకన్ల పాటు ఉండాలి. ఆ తర్వాత సాధారణ స్థితికి వచ్చేయాలి. 10సార్లు వరకు దీన్ని రిపీట్ చేయవచ్చు.