Year Ender 2024: నాగ చైతన్య నుంచి సోనాక్షి సిన్హా వరకు ఈ ఏడాది పెళ్లి చేసుకున్న టాలీవుడ్, బాలీవుడ్ హీరో హీరోయిన్స్ వీరే!
22 December 2024, 6:00 IST
Naga Chaitanya To Keerthy Suresh Weddings In 2024: ఈ ఏడాది (2024) ఎంతోమంది హీరో హీరోయిన్స్ వివాహం చేసుకున్నారు. వారిలో నాగ చైతన్య నుంచి కీర్తి సురేష్, సోనాక్షి సిన్హా వరకు ఉన్నారు. మరి 2024లో పెళ్లి చేసుకున్న టాలీవుడ్, బాలీవుడ్ హీరో హీరోయిన్స్ ఎవరు, వారి వివాహ వేదికలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
నాగ చైతన్య నుంచి కీర్తి సురేష్ వరకు ఈ ఏడాది పెళ్లి చేసుకున్న హీరో హీరోయిన్స్ వీళ్లే.. ఎక్కడెక్కడంటే?
Year Ender 2024 Celebrity Weddings List: 2024 సంవత్సరంలో ఇండియాలో ఎంతో మంది ప్రముఖ సెలబ్రిటీల వివాహాలు జరిగాయి. వారిలో పాపులర్ హీరో హీరోయిన్స్ కూడా ఉన్నారు. అలా ఈ ఏడాది నాగ చైతన్య నుంచి సోనాక్షి సిన్హా వరకు పెళ్లి చేసుకున్న టాలీవుడ్, బాలీవుడ్ హీరో హీరోయిన్స్ ఎవరెవరో ఇక్కడ తెలుసుకుందాం.
1. రకుల్ ప్రీత్ సింగ్
ఈ ఏడాది ఫిభ్రవరి 21న తెలుగు హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ వివాహం బాలీవుడ్ నిర్మాత జాకీ భగ్నానీతో జరిగింది. దక్షిణ గోవాలో రకుల్ ప్రీత్-జాకీ భగ్నానీల డెస్టినేషన్ వెడ్డింగ్ ఘనంగా జరిగింది. హిందూ సాంప్రదాయ ప్రకారం జరిగిన వీరి ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు.
2. సోనాక్షి సిన్హా
బాలీవుడ్ టాప్ హీరోయిన్స్‌లో ఒకరైన సోనాక్షి సిన్హా 2024లో జూన్ 23న జహీర్ ఇక్బాల్‌ను పెళ్లి చేసుకుంది. ముంబైలోని తమ నివాసంలో అత్యంత సన్నిహితుల సమక్షంలో వీరి వివాహం జరిగింది. ఆ తర్వాత బాస్టియన్‌లో అందరి సమక్షంలో ఘనంగా పెళ్లి వేడుకలు నిర్వహించారు. ఈ వివాహ వేడుకలో సల్మాన్ ఖాన్, విద్యాబాలన్, సైరా బాను, రేఖ, సిద్ధార్థ్ రాయ్ కపూర్ వంటి బాలీవుడ్ స్టార్స్ పాల్గొన్నారు. కాగా సోనాక్షి, జహీర్ ఏడేళ్ల పాటు డేటింగ్ చేసి పెళ్లి చేసుకున్నారు.
3. నాగచైతన్య-శోభితా ధూళిపాళ
టాలీవుడ్ యంగ్ హీరో నాగ చైతన్య హీరోయిన్ శోభితా ధూళిపాళ వివాహం డిసెంబర్ 4న తెలుగు సంప్రదాయ పద్ధతిలో జరిగింది. హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో వీరి పెళ్లి జరిగింది. దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట్లో చక్కర్లు కొట్టాయి.
4. అదితి రావు హైదరి-సిద్ధార్థ్
హీరో హీరోయిన్స్ అయిన సిద్ధార్థ్, అదితి రావు హైదరి సెప్టెంబర్ 16న వివాహం చేసుకున్నారు. తెలంగాణలో ఉన్న వనపర్తిలోని 400 ఏళ్ల చరిత్ర ఉన్న శ్రీరంగనాయకస్వామి ఆలయంలో అత్యంత సన్నిహితుల మధ్య సిద్ధార్థ్-అది రావు హైదరిల పెళ్లి జరిగింది.
5. కీర్తి సురేష్
తెలుగు మహానటి కీర్తి సురేష్ 15 ఏళ్ల లాంగ్ రిలేషన్‌షిప్ తర్వాత బాయ్‌ఫ్రెండ్ ఆంటోనీ తాటిల్‌ను డిసెంబర్ 12న వివాహమాడింది. వీరి వివాహం గోవాలో హిందూ సంప్రదాయబద్ధంగా జరిగింది. అనంతరం క్రిస్టియన్ స్టైల్‌లో కూడా కీర్తి సురేష్ పెళ్లి చేసుకుని భర్త ఆంటోనిని కిస్ చేసింది. దీంతో కీర్తి సురేష్ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
6. తాప్సీ
మార్చి 23న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో మథియాస్ బోను వివాహం చేసుకుంది హీరోయిన్ తాప్సీ పన్ను. సాంప్రదాయబద్ధంగా జరిగిన ఈ జంట పెళ్లికి సన్నిహితులు, కుటుంబ సభ్యులతోపాటు డైరెక్టర్ అనురాగ్ కశ్యప్, కనికా ధిల్లాన్, పావైల్ గులాటి వంటి సెలబ్రిటీలు హాజరు అయ్యారు. అయితే, 2023 డిసెంబర్‌లోనే మథియాస్‌ను లీగల్‌గా పెళ్లి చేసుకున్నట్లు తాప్సీ వెల్లడించింది.
7. కృతి కర్బంద
రామ్ పోతినేని ఒంగోలు గిత్త మూవీ హీరోయిన్ కృతి కర్బంద పుల్కిత్ సామ్రాట్‌ను మార్చి 15న పెళ్లాడింది. ఈ జంట వివాహం హిందూ సాంప్రాదాయ ప్రకారం హర్యానాలోని మానేసర్‌లో జరిగింది.
8. డైరెక్టర్ కూతురు
ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్, ఫిల్మ్ ఎడిటర్ ఆర్తి బజాజ్ కుమార్తె ఆలియా కశ్యప్, షేన్ గ్రెగోయిర్‌ను డిసెంబర్ 11న వివాహం చేసుకుంది. 2023 మేలో అమెరికాకు చెందిన పారిశ్రామికవేత్త షేన్ గ్రెగోయిర్‌తో ఎంగేజ్‌మెంట్ జరగ్గా ఈ సంవత్సరం పెళ్లి జరిగింది. వీరి రిసెప్షన్‌కు నాగచైతన్య, శోభితా ధూళిపాళ, అభిషేక్ బచ్చన్, అగస్త్య నందా, షారుఖ్ ఖాన్ కుమార్తె సుహానా ఖాన్, నవాజుద్దీన్ సిద్ధిఖీ, బాబీ డియోల్ హాజరయ్యారు.
9. ఇరా ఖాన్, నుపుర్ శిఖరే
బాలీవుడ్ మిస్టర్ పర్‌ఫెక్ట్ కూతురు అమీర్ ఖాన్ కుమార్తె ఇరా ఖాన్, నుపుర్ శిఖరేను ఈ ఏడాది జనవరి 3న ముంబైలోని బాంద్రా తాజ్ ల్యాండ్ ఎండ్‌లో రిజిస్టర్డ్ వివాహం చేసుకుంది. అనంతరం ఉదయ్‌పూర్‌లో క్రిస్టియన్ సంప్రదాయం ప్రకారం ఇరా ఖాన్-నుపుర్ శిఖరే పెళ్లి జరిగింది.
10. అనంత్ అంబానీ-రాధిక మర్చంట్
రజినీకాంత్, మహేశ్ బాబు, రామ్ చరణ్, యశ్, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, ప్రియాంక చోప్రా, నిక్ జోనస్, అజయ్ దేవగన్, విక్కీ కౌశల్, దీపికా పదుకొణె, రణ్‌వీర్ సింగ్, షాహిద్ కపూర్, రణబీర్ కపూర్, అలియా భట్, కత్రినా కైఫ్ వంటి స్టార్ సెలబ్రిటీలు హాజరైన ఏకైక గ్రాండ్ వెడ్డింగ్ అనంత్ అంబానీ-రాధిక మర్చంట్‌ది.
రాధిక మర్చంట్, అనంత్ అంబానీల వివాహం ఈ ఏడాది జూలై 12న ముంబైలో హిందూ సంప్రదాయం ప్రకారం జరిగింది. జూలై 13న జరిగిన శుభ ఆశీర్వాద్ వేడుకలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొనగా.. జూలై 14న జరిగిన గ్రాండ్ రిసెప్షన్‌కు పైన పేర్కొన్న సెలబ్రిటీలు హాజరు అయ్యారు.