Jani Master Case: ఎవరు ఈ జానీ మాస్టర్? అతను కొరియోగ్రఫీ చేసిన హిట్ పాటలు, నేషనల్ అవార్డు, ఫ్యామిలీ డీటైల్స్ ఇవే
17 September 2024, 16:38 IST
Choreographer Jani Master Case: రామ్ చరణ్ నటించిన రచ్చ సినిమాతో వెలుగులోకి వచ్చిన జానీ మాస్టర్.. టాలీవుడ్‌లోని టాప్ హీరోలకి కొరియోగ్రఫీ చేశాడు. నేషనల్ అవార్డ్ కూడా అందుకున్న ఈ కొరియోగ్రాఫర్ ఇప్పుడు చిక్కుల్లో పడ్డాడు.
జానీ మాస్టర్
Telugu choreographer Jani Master: జానీ మాస్టర్.. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఈ కొరియోగ్రాఫర్ గురించి జోరుగా చర్చ నడుస్తోంది. షేక్ జానీ బాషా అలియాస్ జానీ మాస్టర్‌పై అతని అసిస్టెంట్ మహిళా కొరియోగ్రాఫర్ లైంగిక వేధింపుల కేసు పెట్టింది. గత కొంతకాలంగా తనపై పలుమార్లు జానీ మాస్టర్ అత్యాచారానికి పాల్పడ్డాడని 21 ఏళ్ల మహిళా కొరియోగ్రాఫర్ ఫిర్యాదు చేసింది. దాంతో అతనిపై జీరో ఎఫ్ఐఆర్ నమోదైంది.
తెలుగు, తమిళం, హిందీ భాషల్లో పనిచేసిన జానీ మాస్టర్.. జనసేన పార్టీకి స్టార్ క్యాంపెయినర్‌గా ఇటీవల ఏపీలో జరిగిన ఎన్నికల్లో పనిచేశాడు. అయితే జానీ మాస్టర్‌పై అత్యాచార ఆరోపణలు రావడంతో జనసేన అతడ్ని పార్టీకి దూరంగా పెడుతున్నట్లు ఓ ప్రకటనని విడుదల చేసింది. మరోవైపు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ జానీపై చర్యలకి సిద్ధమైంది. ఆయేషా అనే క్లాసికల్ డ్యాన్సర్‌ను పెళ్లి చేసుకున్న జానీకి ఇద్దరు పిల్లలు ఉన్నారు.
నితిన్ సినిమాతో ఎంట్రీ
జానీ మాస్టర్ రియాలిటీ డాన్స్ షో ఢీ తెలుగు ప్రేక్షకులకి పరిచయం అయ్యాడు. 2009లో నితిన్, ప్రియమణి జంటగా నటించిన ‘ద్రోణ’ చిత్రంతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన జానీ మాస్టర్ 2012లో రచ్చ సినిమాలో రామ్ చరణ్‌కు కొరియోగ్రఫీ చేసి వెలుగులోకి వచ్చాడు. ఆ తర్వాత వరుసగా టాలీవుడ్‌లో పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ పోతినేని, రవితేజ సినిమాలకు కొరియోగ్రఫీ చేశారు. తెలుగులో చేస్తూనే 2014లో హిందీలోనూ సల్మాన్ ఖాన్ నటించిన జై హో చిత్రానికి కొరియోగ్రఫీ చేశాడు. ఆ తర్వాత తమిళ్ సినిమాలకి జానీ మాస్టర్ పనిచేశారు.
జానీ మాస్టర్ ఖాతాలో హిట్ సినిమాలు
భిన్నమైన స్టెప్స్‌తో జానీ మాస్టర్ అనతికాలంలోనే ఫేమస్ అయ్యాడు. మరీ ముఖ్యంగా.. అతని డ్యాన్స్ మూవ్స్ ఇండస్ట్రీలో ఒక ట్రేడ్ మార్క్‌ను క్రియేట్ చేశాయి. రామ్ చరణ్ నటించిన రంగస్థలం చిత్రంలో పూజా హెగ్డే స్పెషల్ సాంగ్ జిగేలు రాణి, మారి 2 నుంచి సాయి పల్లవి, ధనుష్ నటించిన ఫేమస్ రౌడీ బేబీ, అల్లు అర్జున్ అల వైకుంఠపురం సినిమాలో బుట్ట బొమ్మ, సల్మాన్ రాధే నుంచి సీత మార్ వరకు జానీ తన మార్క్‌ను చూపించాడు.
జానీ స్టెప్స్‌కి నేషనల్ అవార్డ్
అందరికీ కనెక్ట్ అయ్యేలా, సింపుల్‌గా అనుసరించేలా జానీ మాస్టర్ స్టెప్స్ ఉంటాయి. ది రైజ్ (శ్రీవల్లి), బీస్ట్ (అరబిక్ కుతు), వారాసుడు (రంజిత్తే), , జైలర్ (కావలా), తేరీ బాతోన్ మే ఐసా ఉల్జా జియా (లాల్ పీలీ అఖియాన్), స్త్రీ 2 (ఆయి నయీ) వంటి భారీ బడ్జెట్ చిత్రాలకు జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేశాడు. ధనుష్, రాశీ ఖన్నా నటించిన 'మెగామ్ కరుకత' చిత్రానికి ఉత్తమ కొరియోగ్రఫీగా జాతీయ అవార్డును కూడా అందుకున్నారు.
అవుట్‌డోర్ షూటింగ్స్‌లో అత్యాచారం
జానీ తనతో కలిసి పనిచేసే మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడనే ఆరోపణపై సోమవారం కేసు నమోదైంది. అవుట్ డోర్ షూటింగుల సమయంలో తనపై లైంగిక దాడి చేశాడని.. ఇంట్లో కూడా అఘాయిత్యానికి పాల్పడినట్లు బాధితురాలు ఆరోపించింది. ఆమె ఫిర్యాదు మేరకు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన రాయదుర్గం పోలీసులు.. నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆమె నివాసం ఉన్నందున అక్కడికి కేసుని బదిలీ చేశారు. ఆమెపై జానీ మాస్టర్ అఘాయిత్యానికి పాల్పడినప్పుడు బాధితురాలు మైనర్.