Sabari OTT: ఓటీటీలోకి వరలక్ష్మి శరత్‌కుమార్ తెలుగు సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
03 June 2024, 9:14 IST
Sabari OTT: వరలక్ష్మి శరత్‌కుమార్ ప్రధాన పాత్రలో నటించిన శబరి మూవీ ఈ నెలలోనే ఓటీటీలోకి రాబోతుంది. ఈ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో రిలీజ్ కానున్నట్లు సమాచారం.
శబరి ఓటీటీ
Sabari OTT: వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన లేడీ ఓరియెంటెడ్ మూవీ శబరి త్వరలోనే ఓటీటీలోకి రాబోతున్నట్లు సమాచారం. శబరి సినిమాకు అనిల్ కాట్జ్ దర్శకత్వం వహించాడు. సైకలాజికల్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాలో గణేష్ వెంకట్రామన్, శశాంక్ కీలక పాత్రలు పోషించారు. మే 3న థియేటర్లలో శబరి మూవీ రిలీజైంది. పలు సినిమాలతో పోటీ మధ్య మూవీ రిలీజ్ కావడం, రొటీన్ స్టోరీ కారణంగా శబరి ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది.
జూన్‌లో ఓటీటీలోకి...
తాజాగా శబరి మూవీ ఈ నెలలోనే ఓటీటీలో రిలీజ్ కాబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకోన్నట్లు సమాచారం. జూన్ 14న శబరి మూవీ ఓటీటీలో విడుదల అవుతోన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ మూవీ స్ట్రీమింగ్ కానున్నట్లు చెబుతోన్నారు. త్వరలోనే ఓటీటీ రిలీజ్ డేట్‌పై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.
శబరి మూవీ కథ ఇదే...
సంజన (వరలక్ష్మి శరత్‌కుమార్) . పెద్దలను ఎదురించి అరవింద్‌ను (గణేష్ వెంకట్రామన్) ప్రేమించి పెళ్లిచేసుకుంటుంది. అరవింద్ జీవితంలో మరో అమ్మాయి ఉందనే నిజం తెలిసి భర్తకు దూరంగా కూతురు రియాతో (బేబీ నివేక్ష) కలిసి బతకాలని నిర్ణయించుకుంటుంది.
లాయర్ రాహుల్ (శశాంక్) సహాయంతో జుంబా ట్రైనర్‌గా ఓ జాబ్ సంపాదిస్తుంది సంజన. మరోవైపు సంజన ఆచూకీ కోసం సూర్య (మైమ్ గోపీ) అనే క్రిమినల్ వెతుకుతుంటాడు. సూర్య బారి నుంచి తనతో పాటు కూతురిని కాపాడుకోవడానికి పోలీస్ కంప్లైంట్ ఇస్తుంది సంజన. పోలీసుల ఇన్వేస్టిగేషన్‌లో సూర్య చనిపోయినట్లు తేలుతుంది. సంజననే మానసిక సమస్యతో బాధపడుతున్నట్లు పోలీసులు నిర్ధారిస్తారు.
అసలు సూర్య ఎవరు?అతడు సంజన కోసం వెతకడానికి కారణం ఏమిటి? సంజన గతం ఏమిటి? భర్త అరవింద్ నుంచి సంజన ఎందుకు దూరమైంది? కూతురు రియాను తన దగ్గరకు రప్పించేందుకు అరవింద్ ఏం చేశాడు? సూర్య, అరవింద్ కుట్రల నుంచి తన కూతురిని సంజన ఎలా కాపాడుకుంది అన్నదే శబరి మూవీ కథ.
ట్విస్ట్‌లు బాగున్నాయి కానీ...
శబరి సినిమాలో వరలక్ష్మి శరత్‌కుమార్ యాక్టింగ్‌తో పాటు కథలోని కొన్ని ట్విస్ట్‌లు బాగున్నాయనే కామెంట్స్ ఆడియెన్స్ నుంచి వచ్చాయి. కానీ లాజికల్‌లతో కథను చెప్పడంలో దర్శకుడు సక్సెస్ కాలేకపోవడంతో ఈ మూవీ ఫెయిల్యూర్‌గా నిలిచింది. ఈ సినిమాకు గోపీసుందర్ మ్యూజిక్ అందించాడు.
మూడు భాషల్లో సినిమాలు...
ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళ, కన్నడ భాషల్లో డిఫరెంట్ రోల్స్ చేస్తోంది వరలక్ష్మి శరత్‌కుమార్. ఈ ఏడాది పాన్ ఇండియన్ లెవెల్‌లో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన హనుమాన్‌లో వరలక్ష్మి శరత్‌కుమార్ కీలక పాత్ర పోషించింది. ఆమె హీరోయిన్‌గా మరో లేడీ ఓరియెంటెడ్ మూవీ కూర్మ నాయకి రిలీజ్‌కు సిద్ధంగా ఉంది.
తమిళంలో ధనుష్‌తో రాయన్, కన్నడంలో కిచ్చా సుదీప్‌తో మ్యాక్స్ సినిమాల్లో నటిస్తోంది వరలక్ష్మి శరత్‌కుమార్. తెలుగు, తమిళ భాషల్లో మరో రెండు సినిమాలను అంగీకరించింది. సినిమాలతో పాటు వెబ్‌సిరీస్‌లలో నటిస్తోంది. తెలుగులో అద్ధం, మ్యాన్షన్ 24 వెబ్‌సిరీస్‌లు చేసింది.