Telugu Horror OTT: ఇరవై రోజుల్లోకి ఓటీటీలోకి తెలుగు హారర్ థ్రిల్లర్ మూవీ - స్ట్రీమింగ్ ఎందులో...ఎప్పుడంటే?
28 September 2024, 13:17 IST
Telugu Horror OTT: హారర్ థ్రిల్లర్ మూవీ కళింగ థియేటర్లలో రిలీజైన ఇరవై రోజుల్లోనే ఓటీటీలోకి రాబోతోంది. ఆహా ఓటీటీ ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. కళింగ మూవీలో హీరోగా నటిస్తూ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు ధృవవాయు.
తెలుగు హారర్ ఓటీటీ
Telugu Horror OTT: తెలుగు హారర్ మూవీ కళింగ థియేటర్లలో రిలీజైన ఇరవై రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఆహా ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ విషయాన్ని ఆహా ఓటీటీ అఫీషియల్‌గా ప్రకటించింది. ఓ పోస్టర్‌ను ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. రిలీజ్ డేట్ మాత్రం వెల్లడించలేదు. అక్టోబర్ 2న ఓటీటీలో కళింగ రిలీజ్ కానున్నట్లు చెబుతోన్నారు.
డైరెక్టర్ కమ్ హీరో...
కళింగ మూవీలో హీరోగా నటిస్తూ ఈ మూవీకి దర్శకత్వం వహించాడు ధృవవాయు. ప్రగ్యా నయన్ హీరోయిన్‌గా నటించింది. మీసాల లక్ష్మణ్, ఆడుకాలం నరేన్, బలగం సుధాకర్ కీలక పాత్రల్లో నటించారు. సెప్టెంబర్ 13న థియేటర్లలో కళింగ మూవీ రిలీజైంది. ఈ సినిమా థియేటర్లలో ఐదు కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టినట్లు మేకర్స్ ప్రకటించారు. తమకు లాభాలను తెచ్చిపెట్టినట్లు వెల్లడించింది.
కళింగ కథ ఇదే...
ఫాంటసీ అంశాలకు హారర్ ఎలిమెంట్స్‌ను ముడిపెడుతూ ధృవవాయు ఈ మూవీని రూపొందించాడు. కళింగ ఊరి పొలిమేరను దాటి అడవిలోకి వెళ్లిన వాళ్లు ఎవరూ ప్రాణాలతో తిరిగిరారు. ఆ ఊరికి చెందిన లింగ (ధృవవాయు) ఓ అనాథ. సారా కాస్తూ తనకు నచ్చినట్లుగా బతుకుతుంటాడు.
తమ ఊరికే చెందిన పద్దును (ప్రగ్యానయన్) ప్రాణంగా ప్రేమిస్తాడు లింగ. కానీ పద్దు తండ్రి (మురళీధర్‌గౌడ్) మాత్రం వారి ప్రేమకు అడ్డు చెబుతాడు. ఊరిపెద్ద (ఆడుకాలం నరేన్) వద్ద తనఖాలో ఉన్న లింగ పొలం విడిపించుకుంటేనే ఇద్దరి పెళ్లి జరిపిస్తానని కండీషన్ పెడతాడు.
ఊరి పెద్ద తమ్ముడు బలితో లింగకు గొడవలు ఉన్నాయి. ఆ గొడవల కారణంగా లింగకు అతడి పొలం బదులు అడవి దగ్గరలోని భూమిని రాసిస్తాడు ఊరిపెద్ద. తమ పొలం కోసం పొలిమేర దాటి అడవిలోకి వెళ్లిన లింగకు, అతడి స్నేహితుడికి విచిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి? పద్దుకు లింగను దూరం చేయాలని ఊరి పెద్ద ఎందుకు అనుకున్నాడు.
లింగతో బలికి ఉన్న గొడవలకు కారణం ఏమిటి? కళింగ రాజు సంపద అడవిలో ఎక్కడ ఉంది? ఆ సంస్థానానికి ఉన్న శాపం ఏమిటి? అసుర భక్షి వెనకున్న మిస్టరీని లింగ ఎలా ఛేదించాడు అన్నదే ఈ మూవీ కథ.
పెళ్లిచూపులుతో ఎంట్రీ...
పెళ్లిచూపులు సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు ధృవవాయు. ఘాజీ ఎటాక్‌లో కీలక పాత్ర పోషించాడు. కళింగ కంటే ముందు కిరోసిన్ మూవీలో హీరోగా నటించాడు. ప్రగ్యానయన్ కూడా తెలుగులో బద్మాష్‌గాళ్లకు బంపర్ ఆఫర్, సురాపానం, చక్రవ్యూహంతో పాటు మరికొన్ని సినిమాలు చేసింది.