Pechi Movie Review: పేచీ రివ్యూ - కోలీవుడ్ లేటెస్ట్ హారర్ మూవీ ఎలా ఉందంటే?
Pechi Movie Review: తమిళ హారర్ మూవీ పేచీ ఆహా ఓటీటీతో పాటు అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఓటీటీలో ట్రెండింగ్‌లో ఉన్న ఈ మూవీలో గాయత్రి , దేవ్‌రామనాథ్ ప్రధాన పాత్రల్లో ప్రధాన పాత్రల్లో నటించారు.
Pechi Movie Review: గాయత్రి, దేవ్‌రామనాథ్ ప్రధాన పాత్రల్లో నటించిన తమిళ మూవీ పేచీ ఆహా ఓటీటీతో పాటు అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. హారర్ కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీకి రామచంద్రన్ దర్శకత్వం వహించాడు. రెండు ఓటీటీలలో టాప్ ట్రెండింగ్ మూవీస్‌లో ఒకటిగా ఉన్న పేచీ ఎలా ఉందంటే?
పేచీ దయ్యం కథ...
మీనాను (గాయత్రి) ప్రాణంగా ప్రేమిస్తుంటాడు చరణ్ (దేవ్ రామ్‌నాథ్). మీనా, చరణ్‌తో పాటు మరో ముగ్గురు స్నేహితులు జెర్రీ, చారు, సేతు కలిసి అరాణ్మణైకాడు అనే దట్టమైన అటవీ ప్రాంతానికి ట్రెక్కింగ్‌కు వెళతారు. వారికి మారి (బాలా శరవణన్) గైడ్‌గా ఉంటాడు. అడవిలో ఓ చోట రిస్ట్రిక్టెడ్ ఏరియా అనే బోర్డ్ కనిపిస్తుంది. ఆ ఏరియాలోకి ఎవరూ అడుగుపెట్టకుండా కంచె ఏర్పాటుచేస్తారు.
లోపలికి వెళ్లద్దని మారి ఎంత చెప్పిన వినకుండా సేతు, చారు రిస్ట్రిక్టెడ్ ఏరియాలోకి వెళతారు. అక్కడ ఓ పాడుబడిన ఇంట్లోకి అడుగుపెట్టిన తర్వాత వారికి వింత వింత అనుభవాలు ఎదురవుతాయి. పేచీ అనే భయంకరమైన ఆత్మ వారిని వెంటాడటం మొదలపెడుతుంది. పేచీ ఆధీనంలో ఉన్న ఆ ప్రాంతం నుంచి తప్పించుకోవడానికి ఐదుగురు స్నేహితులు ఏం చేశారు?
తమ ప్రాణాలను కాపాడుకున్నారా? పేచీ కథేమిటి? చెట్టులో బంధించబడిన పేచీ ఆత్మ ఎలా బయటకు వచ్చింది? పేచీ ఆత్మకు మీనాకు ఎలాంటి సంబంధం ఉంది? తన ప్రియుడు చరణ్‌ను మీనా ఎందుకు మోసం చేసింది అన్నదే పేచీ మూవీ కథ.
ప్యూర్ హారర్ మూవీ...
ప్రస్తుతం తెలుగు, తమిళం అనే భేదాలు లేకుండా అన్ని భాషల్లో హారర్ కామెడీ సినిమాల ట్రెండ్ ఎక్కువగా ఉంది. దెయ్యంతో నాయకానాయికలు జోకులు వేయడం, కమెడియన్లను ఆత్మ చితక్కొట్టడం లాంటి సీన్లతో హారర్ సినిమాలు భయపెడుతూనే నవ్విస్తున్నాయి.
ప్యూర్ హారర్ మూవీస్ అడపాదడపా మాత్రమే ప్రేక్షకుల ముందుకొస్తున్నాయి. పేచీ అలాంటి మూవీనే. ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్ ఔట్ అండ్ ఔట్ హారర్ థ్రిల్లర్‌గా దర్శకుడు రామచంద్రన్ ఈ మూవీని తెరకెక్కించాడు.
హారర్ సినిమాల స్ఫూర్తితో...
కథా పరంగా చూసుకుంటే పేచీలో కొత్తదనం లేదు. ఇది వరకు వచ్చిన బ్లాక్‌బస్టర్ హారర్ మూవీస్ స్ఫూర్తితోనే పేచీని తెరకెక్కించినట్లు టైటిల్ కార్డ్స్‌లోనే దర్శకుడు చెప్పేశాడు. హాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు అన్ని హారర్ సినిమాలను కలగలిపి ఈ సినిమాను తెరకెక్కించాడు.
హీరో అండ్ గ్యాంగ్‌ను పేచీ ఎత్తుకుపోయే సీన్స్ హాలీవుడ్ మూవీ క్వైట్ ప్లేస్ ను గుర్తుకుతెస్తాయి. జెర్రీ పాత్రకు సంబంధించి వచ్చే కెమెరా ఎపిసోడ్ డిమాంటే కాలనీలోని సీన్స్‌ను పోలి ఉంటుంది. ఇవే కాదు సినిమాలో పలు సూపర్ హిట్ హారర్ మూవీస్ ఛాయలు కనిపిస్తాయి.
థ్రిల్లింగ్...క్యూరియాసిటీ...
పోలికలతో సంబంధం లేకుండా చివరి వరకు పేచీ కథ థ్రిల్లింగ్‌ను పంచుతుంది. హారర్ ఎలిమెంట్స్‌తో నెక్స్ట్ ఏం జరుగబోతుందోననే క్యూరియాసిటీ ఆడియెన్స్‌లో కలిగించడంలో దర్శకుడు సఫలం అయ్యాడు.
పేచీ మాయలు...
పేచీ ఆత్మ విముక్తి అయ్యే సీన్‌తోనే సినిమా మొదవలువుతంది. ఆ తర్వాత చరణ్, మీనాతో పాటు వారి గ్యాంగ్ ట్రెక్కింగ్ కోసం అడవిలో ఎంటర్ అయ్యే సీన్స్ కాస్త నిదానంగా సాగుతూ బోర్ కొట్టిస్తాయి. పేచీ ఇంట్లో సేతు, చారు అడుగుపెట్టినప్పటి నుంచి కథ ఆసక్తికరంగా మారుతుంది. తన మాయలతో పేచీ ఒక్కొక్కరిని బోల్తా కొట్టించే సీన్స్‌తో భయపెట్టగలిగాడు దర్శకుడు.
క్లైమాక్స్ హైలైట్...
హీరోయిన్‌కు పేచీ ఆత్మతో లింక్ పెడుతూ క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్ సర్‌ప్రైజింగ్‌గా ఉంది. అలాంటి బలమైన ట్విస్ట్‌లు మరికొన్ని రాసుకుంటే సినిమా మరోస్థాయిలో ఉండేది. పేచీ ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ కొత్తదనం లేదు. ఏదో ఫ్లాష్‌బ్యాక్ ఉండాలి కాబట్టి పెట్టినట్లుగా అనిపిస్తుంది. నిడివి రెండు గంటల కంటే తక్కువే అయినా ఎక్కువ అన్న ఫీలింగ్ కలిగిస్తుంది.
పేచీ మూవీలో యాక్టింగ్ పరంగా గాయత్రి మెప్పిస్తుంది. మీనా పాత్రలో డిఫరెంట్ వేరియేషన్స్ చూపించింది. దేవ్ రామనాథ్ బాలశరవణన్‌తో పాటు మిగిలిన నటన పర్వాలేదనిపిస్తుంది. తక్కువ బడ్జెట్‌లోనే లిమిటెడ్ యాక్టర్స్‌తో ఈ సినిమాను షూట్ చేశారు.
హారర్ మూవీ లవర్స్ కోసం...
పేచీ హారర్ మూవీ లవర్స్ ఆకట్టుకుంటుంది. హారర్ ఎలిమెంట్స్‌తో పాటు కొన్ని ట్విస్ట్‌లు బాగున్నాయి.