Bhargavi Nilayam Review: భార్గవి నిలయం రివ్యూ - ఆహా ఓటీటీలో రిలీజైన టోవినో థామస్ హారర్ మూవీ ఎలా ఉందంటే?
Bhargavi Nilayam Review: టోవినో థామస్ హీరోగా నటించిన భార్గవి నిలయం మూవీ గురువారం(నేడు) ఆహా ఓటీటీలో రిలీజైంది. హారర్ కథాంశంతో తెరకెక్కిన ఈమూవీలో రీమా కల్లింగల్, రోషన్ మాథ్యూ కీలక పాత్రల్లో నటించారు
Bhargavi Nilayam Review: టోవినో థామస్ హీరోగా నటించిన భార్గవి నిలయం మూవీ గురువారం (సెప్టెంబర్ 5న) ఆహా ఓటీటీ ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చింది. హారర్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీకి ఆషిక్ అబూ దర్శకత్వం వహించాడు. రీమా కల్లింగల్, రోషన్ మాథ్యూ కీలక పాత్రల్లో నటించారు. ఈ హారర్ మూవీ ప్రేక్షకులను మెప్పించిందా? లేదా? అంటే?
భార్గవి నిలయం కథ...
సముద్రతీరానికి సమీపంలో ఉన్న పల్లెటూళ్లో భార్గవి నిలయం చాలా రోజులుగా మూతపడి ఉంటుంది. ఆ బంగళా పేరు వింటనే ఊరివాళ్లు వణికిపోతుంటారు. భార్గవి (రీమా కల్లింగల్) అనే అమ్మాయి ఆత్మగా మారి ఆ ఇంట్లో తిరుగుతుందని, అందులో అడుగుపెట్టిన వారిని చంపడానికి ప్రయత్నిస్తుందనే రకరకాల ఊహాగానాలు వినిపిస్తుంటాయి. బషీర్ (టోవినో థామస్) అనే రైటర్ ఆ ఊరికి కొత్తగా వస్తాడు. భార్గవి నిలయం చరిత్ర గురించి తెలియక అందులో అద్దెకు దిగుతాడు.
మరో ఇంటికి మారడానికి అవసరమైన డబ్బు తన వద్ద లేకపోవడంతో భార్గవి ఆత్మతో స్నేహం చేస్తూ అదే పాడుబడ్డ ఇంటిలో ఒంటరిగా ఉంటుంటాడు బషీర్. భార్గవి గురించి కథ రాయాలని ఫిక్సవుతాడు బషీర్. ప్రేమలో విఫలమై భార్గవి ఆత్మహత్య చేసుకుందని ఊరివాళ్లు బషీర్‌తో చెబుతారు.
వారు చెప్పింది నిజమేనా? భార్గవిని ప్రాణంగా ప్రేమించిన శివకుమార్ (రోషన్ మాథ్యూ) ఎలా అదృశ్యం అయ్యాడు? ఈ ప్రేమ జంట జీవితంలోని మిస్టరీని బషీర్ ఎలా బయటపెట్టాడు? భార్గవి, శివకుమార్ ప్రేమ విఫలం కావడానికి నారాయణన్ అలియాస్ నాన్ కుట్టీకి ఎలాంటి సంబంధం ఉంది? తనకు జరిగిన అన్యాయంపై భార్గవి ఎలా రివేంజ్ తీర్చుకుంది అన్నదే భార్గవి నిలయం కథ.
రొటీన్ హారర్ కాన్సెప్ట్...
ఓ పాడుబడ్డ బంగళాలో యువతి ఆత్మ ఉండటం, అందులోకి హీరో అడుగుపెట్టడం, ఆత్మకు ఓ ఫ్లాష్‌బ్యాక్, దయ్యం రివేంజ్‌కు హీరో సాయపడటం అనే కాన్సెప్ట్ హారర్ సినిమాల్లో తీసి తీసి అరిగిపోయింది. ఈ పాయింట్‌ను ఎన్ని రకాలుగా సిల్వర్ స్క్రీన్‌పై చూపించవచ్చో అన్ని రకాలుగా మన దర్శకులు చూపించేశారు.
కామెడీ, ఎమోషన్స్, లవ్ స్టోరీ...అన్ని జానర్స్‌లో ఈ హారర్ పాయింట్‌ను ఇరికించేసి సినిమాలు చేశారు..అయినా అప్పుడప్పుడు ఇలాంటి హారర్ సినిమాలు ఇంకా వస్తూనే ఉన్నాయి. భార్గవి నిలయం అలాంటి కథే.
ఆత్మతో రైటర్ ఫ్రెండ్‌షిప్...
ఓ ప్రేమ జంట జీవితంలోని విషాదాన్ని ఓ రచయిత ఎలా వెలుగులోకి తీసుకొచ్చాడన్నదే భార్గవి నిలయం మూవీ కథ. భార్గవి నిలయంలోకి ఓ దొంగ ప్రవేశించడం, అతడికి ఆత్మ కనిపించే సీన్‌తోనే ఈ సినిమా మొదలవుతుంది. ఆ తర్వాత భార్గవి నిలయంలో రైటర్ అయిన హీరో అద్దెకు దిగడం, ఆ బిల్డింగ్ గురించి అతడికి ఊరివాళ్లు చెప్పే కథలతో దర్శకుడు కథను ఆసక్తికరంగా ముందుకు నడిపించాడు.
హీరోకు, ఆత్మకు దోస్తీ కుదరినట్లుగా ఫస్ట్ హాఫ్‌లో చూపించారు. సెకండాఫ్‌లో భార్గవి, శివకుమార్ లవ్‌స్టోరీ, వారి ప్రేమకథకు విలన్ ఎవరన్నది రివీల్ చేసి కథను క్లైమాక్స్ వైపుకు సాగించారు దర్శకుడు. క్లైమాక్స్‌లో తన మరణంపై భార్తవి ఎలా రివేంజ్ తీర్చుకుందన్నది చూపించారు.
రెగ్యులర్ హారర్ సీన్స్...
కథ పరంగా భార్గవి నిలయంలో ఎలాంటి కొత్తదనం లేదు. కానీ దయ్యం పేరుతో కామెడీ చేయడం, కుర్చీలు, తలుపులు కదులుతున్నట్లుగా ట్రిక్కులు వాడి భయపెట్టడం లాంటి రెగ్యులర్ హారర్ సినిమాల్లో ఉండే సీన్స్ ఇందులో లేకుండా క్లీన్ హారర్ మూవీగా దర్శకుడు భార్గవి నిలయం సినిమాను తెరకెక్కించాడు.
డబుల్ మీనింగ్ డైలాగ్స్, కథకు సంబంధం లేని అవసరమైన సీన్స్ సినిమాలో ఒక్కటి కూడా కనిపించవు. కంప్లీట్ ఆర్ట్ ఫిల్మ్‌లా కథ, కథనాలు సాగుతాయి. దర్శకుడు రాసుకున్న ఒకటి రెండు ట్విస్ట్‌లు కూడా ఈజీగానే గెస్ చేసేలానే ఉన్నాయి. భార్గవి, శివకుమార్ లవ్‌స్టోరీ బోరింగ్‌గా సాగుతుంది.
రచయిత పాత్రలో...
రచయిత పాత్రలో టోవినో థామస్ నటన బాగుంది. అతడి లుక్, డైలాగ్ డెలివరీ కొత్తగా ఉన్నాయి. కంప్లీట్ వన్ మెన్ ఆర్మీలా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక్కడే సినిమాను నడిపించాడు. ప్రేమ జంటగా రీమా కల్లింగల్, రోషన్ మథ్యూ పర్వాలేదనిపించారు. విలన్‌గా టామ్ చాకో యాక్టింగ్ ఒకే.
థ్రిల్స్ తక్కువే...
భార్గవి నిలయం రొటీన్ హారర్ మూవీ. హారర్ ఎలిమెంట్స్, థ్రిల్స్, ట్విస్ట్‌లు ఈ సినిమాలో తక్కువే. టోవినో థామస్ యాక్టింగ్ కోసమే ఈ సినిమాను ఓ సారి చూడొచ్చు.
టాపిక్