Real Form of Kantara: కాంతార క్లైమాక్స్ రియల్ లైఫ్‌లో ఎదురైతే.. ప్రత్యక్షంగా చూసిన రిషబ్ శెట్టి
Real Form of Kantara: కాంతార టీమ్ తులునాడులోని పంజుర్లీ ఉత్సవాలకు హాజరైంది. ఇందులో భాగంగా నిర్వహించిన భూత కోలను ప్రత్యక్షింగా వీక్షించింది. ఈ సందర్భంగా భూతకోల ఆడే వ్యక్తి కాంతారా క్లైమాక్స్‌లో మాదిరిగా రిషబ్‌ను ప్రేమగా దగ్గరకు తీసుకోవడం, చిరునవ్వులు చిందించడం ఆకట్టుకుంది.
Real Form of Kantara: గతేడాది చిన్న సినిమాగా విడుదలై దేశవ్యాప్తంగా సంచలన విజయాన్ని అందుకున్న చిత్రం కాంతార. రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో నటించిన ఈ సినిమా రూ.16 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కి రూ.400 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. కన్నడంలోనే కాకుండా ఇతర భాషల్లోనే అదిరిపోయే విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం అంతర్జాతీయ వేదికపై కూడా ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ చిత్రంలోని క్లైమాక్స్‌కు ఎవ్వరికైనా గూస్ బంప్స్ రావాల్సిందే. సినిమాలోనే అలా ఉంటే.. రియల్ లైఫ్‌లో ఏ విధంగా ఉంటుందో ఊహించుకోండి. తాజాగా కాంతార టీమ్‌కు నిజ జీవితంలో కాంతార క్లైమాక్స్ ఎదురైంది. ఇందుకు సంబంధించిన వీడియోను చిత్ర నిర్మాణ సంస్థ హోంబళే ఫిల్మ్స్ ట్విటర్ వేదికగా షేర్ చేసింది.
కాంతార క్లైమాక్స్ భూతకోల ఆడే వ్యక్తిని పంజుర్లి ఆవహించడం, తన భూమిని కాపాడినందుకు కృతజ్ఞతగా అక్కడ ఉన్న పోలీసు అధికారిని, ఇతర గ్రామస్థులను ప్రేమగా దగ్గరకు తీసుకోవడం లాంటి సన్నివేశాలు ప్రేక్షకులకు ఎమోషనల్‌గా అనిపిస్తాయి. తాజాగా అలాంటి అనుభవమే నిజ జీవితంలోనూ కాంతార టీమ్‌కు ఎదురైంది.
ఇందులో నటించిన రిషబ్ శెట్టి, సప్తిమి గౌడతో పాటు ఇతర చిత్రబృందం, హోంబళే నిర్మాతలు తులునాడులోని పంజుర్లీ ఉత్సవానికి హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ఈ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి భూతకోల ఆడేందుకు సిద్ధం కావడం, అతడిని దేవత ఆవహించడం లాంటి ఘట్టాలను వారు దగ్గరుండి చూశారు. సినిమాలో మాదిరిగా పంజుర్లీ ఆవహించిన సమయంలో భూతకోల ఆడే వ్యక్తి రిషబ్ శెట్టిని ఆత్మీయంగా దగ్గరకు తీసుకోవడం, చిత్రబృందాన్ని పట్టుకొని ఆనందంతో నర్తించడం లాంటి సీన్నివేశాలతో ఈ వీడియో కొనసాగింది.
ప్రకృతికి కట్టుబడి స్వేచ్చను, విజయాన్ని అందించిన దేవుడిని ఆరాధించండి. కాతార టీమ్ నిజరూపంలో ఉన్న దైవాన్ని చూసి దైవానుగ్రహం పొందింది. అని హోంబళే సంస్థ ట్విటర్ వేదికగా వీడియోను షేర్ చేసింది.
రిషబ్ శెట్టి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఆయనే హీరోగా నటించారు. కేజీఎఫ్ లాంటి అద్భుత సినిమాను రూపొందించిన హోంబలే ఫిల్మ్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది. విజయ్ కిరంగదూర్ నిర్మాతగా వ్యవహరించారు. రిషభ్ శెట్టితో పాటు కిషోర్, అచ్యుత్ కుమార్, ప్రమోద్ శెట్టి, సప్తమి గౌడ తదితరులు కీలక పాత్రలు పోషించారు. అజనీశ్ లోక్‌నాథ్ సంగీత దర్శకత్వం వహించారు.
సంబంధిత కథనం