Shah Rukh Khan: అత్యధిక పన్ను చెల్లించిన సెలెబ్రిటీగా షారూక్ ఖాన్.. లిస్ట్‌లో మన తెలుగు హీరో కూడా
Highest Tax Paying Indian Celebrities 2024: ఇండియాలోని సెలెబ్రిటీల్లో అత్యధిక పన్ను చెల్లించిన సెలెబ్రిటీగా షారూక్ ఖాన్ రికార్డ్ నెలకొల్పారు. క్రికెటర్లు విరాట్ కోహ్లీ, ధోనీ కంటే అత్యధికంగా షారూక్ పన్ను చెల్లించాడు.
ఇండియాలో 2024లో అత్యధిక పన్ను చెల్లించిన సెలెబ్రిటీగా బాలీవుడ్ బాద్ షా షారూక్ ఖాన్ నిలిచారు. ఫార్చ్యూన్ ఇండియా ప్రకారం షారుఖ్ ఈ ఏడాది రూ.92 కోట్ల పన్ను చెల్లించారు. ఆ తర్వాత స్థానంలో ఉన్న తమిళ్ స్టార్ విజయ్ రూ.80 కోట్లు పన్ను చెల్లించాడు.
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఈ ఏడాది రూ.75 కోట్ల పన్ను చెల్లించగా.. బిగ్ బి అమితాబ్ బచ్చన్ రూ.71 కోట్ల పన్ను చెల్లించినట్లు ఫార్చ్యూన్ ఇండియా పేర్కొంది. అలానే భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ రూ.66 కోట్లు పన్ను చెల్లించాడు.
కోహ్లీ తర్వాత బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్ రూ.42 కోట్ల పన్ను చెల్లించి ఆరో స్థానంలో నిలవగా.. ఏడో స్థానంలో భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ రూ.38 కోట్లతో జాబితాలో ఉన్నాడు.
ధోనీ తర్వాత స్థానంలో రణబీర్ కపూర్ రూ.36 కోట్లు, హృతిక్ రోషన్, సచిన్ టెండూల్కర్ ఇద్దరూ రూ.28 కోట్లు చొప్పున పన్ను చెల్లించి టాప్-10లో నిలిచారు.
బ్యాక్ టు బ్యాక్ హిట్‌లతో షారూక్ జోరు
2023లో పఠాన్, జవాన్, డంకీ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టిన షారూక్ ఖాన్.. ప్రస్తుతం కింగ్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో షారూక్ కూతురు సుహానా ఖాన్ కూడా నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
వెంకట్ ప్రభు దర్శకత్వంలో విజయ్ నటించిన గోట్ మూవీ గురువారం థియేటర్లలోకి వచ్చింది. ప్రభుదేవా, ప్రశాంత్, మోహన్, అజ్మల్ అమీర్, మీనాక్షి చౌదరి, స్నేహ, లైలా, వైభవ్, యోగిబాబు, ప్రేమ్జీ అమరన్, యుగేంద్రన్, వీటీవీ గణేష్, అరవింద్ ఆకాష్ తదితరులు ఈ సినిమాలో నటించారు.
ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో సల్మాన్ ఖాన్ నటిస్తున్న సికిందర్ మూవీ ఈద్ కానుకగా థియేటర్లలోకి రానుంది. ఈ సినిమాలో సల్మాన్ ఖాన్‌కి జోడీగా రష్మిక మందన నటించింది.
కరీనా, కత్రినా టాప్ 20లో
అత్యధిక పన్ను చెల్లించిన టాప్-20 సెలెబ్రిటీల లిస్ట్‌లో కపిల్ శర్మ (రూ.26 కోట్లు), మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ (రూ.23 కోట్లు), కరీనా కపూర్ (రూ.20 కోట్లు), షాహిద్ కపూర్ (రూ.14 కోట్లు), హార్దిక్ పాండ్యా (రూ.13 కోట్లు), కియారా అద్వానీ (రూ.12 కోట్లు). మోహన్ లాల్, అల్లు అర్జున్ ఇద్దరూ రూ.14 కోట్లు చొప్పున పన్ను చెల్లించి జాబితాలో నిలిచారు. అలానే పంకజ్ త్రిపాఠి, కత్రినా కైఫ్ కూడా చెరో రూ.11 కోట్లు పన్ను చెల్లించారు.
ఇక ఆమిర్ ఖాన్ రూ.10 కోట్లు, రిషబ్ పంత్ రూ.10 కోట్ల చొప్పున పన్ను చెల్లించి వరుసగా 21, 22వ స్థానాల్లో నిలిచారు. అమీర్ చివరిసారిగా అద్వైత్ చందన్ దర్శకత్వం వహించిన లాల్ సింగ్ చద్దా (2022) మూవీలో నటించాడు.