MS Dhoni: బౌలర్ శార్ధూల్‌కి సాయం చేసేందుకు ధోనీ నిరాకరణ.. ఇంట్రస్టింగ్ రీజన్ చెప్పిన హర్భజన్ సింగ్-former csk captain ms dhoni refused to help struggling shardul thakur in ipl reveals harbhajan singh ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Ms Dhoni: బౌలర్ శార్ధూల్‌కి సాయం చేసేందుకు ధోనీ నిరాకరణ.. ఇంట్రస్టింగ్ రీజన్ చెప్పిన హర్భజన్ సింగ్

MS Dhoni: బౌలర్ శార్ధూల్‌కి సాయం చేసేందుకు ధోనీ నిరాకరణ.. ఇంట్రస్టింగ్ రీజన్ చెప్పిన హర్భజన్ సింగ్

Galeti Rajendra HT Telugu
Sep 04, 2024 12:31 PM IST

IPL: వికెట్ల వెనుక నుంచి బ్యాటర్ల కదలికల్ని నిశితంగా పరిశీలించే ధోనీ.. బౌలర్లకి సలహాలు, సూచనలు చేస్తుంటాడు. కానీ.. ఓ మ్యాచ్‌లో శార్ధూల్ ఠాకూర్‌కి సాయం చేసేందుకు ధోనీ నిరాకరించాడట. ఈ విషయాన్ని మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ వెల్లడించాడు.

శార్ధూల్ ఠాకూర్, ధోని
శార్ధూల్ ఠాకూర్, ధోని (BCCI)

Harbhajan Singh: భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీకి ప్లేయర్ల నుంచి అత్యుత్తమ ప్రదర్శనని ఎలా రాబట్టాలో బాగా తెలుసు. సుదీర్ఘకాలం భారత్ జట్టుకి కెప్టెన్‌గా వ్యవహరించిన ధోనీ.. ఐపీఎల్‌లోనూ చెన్నై సూపర్ కింగ్స్‌కి తిరుగులేని విజయాల్ని అందించాడు. అయితే ఒకసారి ఐపీఎల్ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్ శార్ధూల్ ఠాకూర్ వరుస తప్పిదాలు చేస్తున్నా.. మహేంద్రసింగ్ ధోనీ వికెట్ల వెనుక నుంచి అతనికి సాయం చేసేందుకు నిరాకరించినట్లు మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ వెల్లడించాడు. హర్భజన్ సింగ్ కూడా ఐపీఎల్‌లో మూడు సీజన్లు చెన్నై సూపర్ కింగ్స్‌కి ఆడిన విషయం తెలిసిందే.

శార్ధూల్‌కి ధోనీ సాయం చేయకపోవడం గురించి హర్భజన్ సింగ్ మాట్లాడుతూ ‘‘ఆరోజు హైదరాబాద్‌తో మ్యాచ్ నాకు ఇంకా గుర్తుంది. నేను షార్ట్ ఫైన్ లెగ్‌లో ఫీల్డింగ్ చేస్తున్నాను. ధోనీ వికెట్ల వెనుక కీపింగ్ చేస్తున్నాడు. ఆ మ్యాచ్‌లో శార్దూల్ ఠాకూర్ వేసిన తొలి బంతికి కేన్ విలియమ్సన్ బౌండరీ బాదాడు. ఆ తర్వాత బంతిని కూడా శార్ధూల్ అదే తరహాలో వేయగా కేన్ మళ్లీ బౌండరీకి తరలించాడు. దెబ్బకి శార్ధూల్ పూర్తిగా ఒత్తిడిలోకి వెళ్లిపోయినట్లు కనిపించింది. దాంతో నేనుధోనీ వద్దకి వెళ్లి శార్ధూల్‌ను వేర్వేరు లెంగ్త్‌లలో బౌలింగ్ చేయమని చెప్పొచ్చు కదా అని అడిగాను. దానికి ధోనీ నావైపు చూసి నేను ఇప్పుడు చెబితే శార్దూల్ ఎప్పటికీ నేర్చుకోలేడు. అతడ్నే స్వయంగా నేర్చుకోనివ్వు’’ అని తనతో ధోనీ చెప్పినట్లు హర్భజన్ సింగ్ గుర్తు చేసుకున్నాడు.

శార్దూల్ ఠాకూర్ 2018, 2019, 2020, 2021 ఐపీఎల్ సీజన్లలో చెన్నై సూపర్ కింగ్స్‌కి ఆడాడు. హర్భజన్ సింగ్ కూడా 2018, 2020 సీజన్లలో చెన్నైకి ఆడాడు. వాస్తవానికి మహేంద్రసింగ్ ధోనీ వికెట్ల వెనుక నుంచి బౌలర్లకి తరచూ సలహాలు, సూచనలు చేస్తుంటాడు. కానీ మరీ స్పూన్ ఫీడింగ్‌లా కాకుండా బౌలర్లు కూడా స్వతహాగా నేర్చుకోవాలని ధోనీ భావిస్తాడని హర్భజన్ సింగ్ చెప్పుకొచ్చాడు. ధోనీ కెప్టెన్సీలోనే హార్దిక్ పాండ్య, చాహల్, కుల్దీప్ యాదవ్ అగ్రశ్రేణి బౌలర్లుగాఎదిగిన విషయం తెలిసిందే.

గెలిచినా.. ఓడినా ఒకేలా

2004 నుంచి 2012 వరకు భారత్ జట్టులో ధోనీతో కలిసి హర్భజన్ సింగ్ డ్రెస్సింగ్ రూముని పంచుకున్నాడు. దాంతో ధోనీ వ్యక్తిత్వం గురించి భజ్జీ మాట్లాడుతూ ‘‘ధోనీ చాలా ప్రశాంతంగా ఉంటాడు. తనకు ఏమి కావాలో అతను చాలా స్పష్టతతో ఉంటాడు. క్లిష్ట పరిస్థితుల్లోనూ మ్యాచ్‌లను గెలిపించే అతని సామర్థ్యం జట్టుపై కూడా ప్రతిబింబిస్తుంటుంది. అలాగే అతను జట్టు వాతావరణాన్నికూడా గొప్పగా ఉంచుతాడు. ఎల్లప్పుడూ వ్యక్తుల కంటే జట్టు ప్రయోజనాలకే అధిక ప్రాధాన్యత ఇస్తాడు. అదే ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుని తిరుగులేని టీమ్‌గా నిలబెట్టింది. టీమ్ గెలిచినా, ఓడినా డ్రెస్సింగ్ రూమ్ ఒకేలా ఉంటుంది. మ్యాచ్‌కి ముందు కూడా ఎలాంటి హడావుడి ఉండదు. ఒక్కోసారి మరుసటి రోజు మ్యాచ్ ఉందని కూడా టీమ్ సభ్యులకి అనిపించదు. అంతలా రిలాక్స్‌గా టీమ్ వాతావరణాన్ని ధోనీ ఉంచుతాడు’’ అని హర్భజన్ సింగ్ గుర్తు చేసుకున్నాడు.