Yuvraj Singh Father: ధోనీ నా కొడుకు జీవితాన్ని నాశనం చేశాడు.. అతనికి భారత రత్న ఇవ్వాలి: యువరాజ్ తండ్రి కామెంట్స్ వైరల్
Yuvraj Singh Father: ధోనీపై మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ తండ్రి యోగ్‌రాజ్ సింగ్ నోరు పారేసుకున్నాడు. అతని వల్లే తన కొడుకు కెరీర్ నాశనమైందని అన్నాడు. అటు మరో మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ నూ వదలని అతడు.. తన కొడుక్కి భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేయడం గమనార్హం.
Yuvraj Singh Father: టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ తండ్రి యోగ్‌రాజ్ సింగ్.. మాజీ కెప్టెన్లు ఎమ్మెస్ ధోనీ, కపిల్ దేవ్ లపై నోరు పారేసుకున్నాడు. ధోనీయే తన కొడుకు కెరీర్ నాశనం చేశాడని అతడు అనడం గమనార్హం. ఇక కపిల్ వల్లే జట్టులో తన స్థానం కోల్పోయానని గతంలో ఆరోపించిన యోగ్‌రాజ్ సింగ్.. తాజాగా మరోసారి అలాంటి కామెంట్సే చేశాడు.
ధోనీ వల్లే యువీ కెరీర్ నాశనం
టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీపై మరోసారి తన అక్కసు వెల్లగక్కాడు యువరాజ్ సింగ్ తండ్రి యోగ్‌రాజ్ సింగ్. అతని వల్లే తన కొడుకు కెరీర్ నాశనమైందని అన్నాడు. ధోనీ ప్రభావం లేకపోయి ఉంటే యువీ మరో నాలుగైదేళ్లు అంతర్జాతీయ క్రికెట్ లో కొనసాగేవాడని కూడా యోగ్ రాజ్ అన్నాడు. జీ స్విచ్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అతడు చాలా అంశాలపై స్పందించాడు.
"నేను ధోనీని క్షమించను. అతడు తన ముఖాన్ని అద్దంలో చూసుకోవాలి. అతడో పెద్ద క్రికెటర్. కానీ అతడు నా కొడుకు ఏం చేశాడో ఇప్పుడు బయటకు వస్తోంది. దానిని జీవితంలో క్షమించను. నా జీవితంలో నేను రెండు పనులు ఎప్పుడూ చేయలేదు. నాకు అన్యాయం చేసిన వాళ్లను నేను ఎప్పుడూ క్షమించలేదు. రెండోది వాళ్లను నా జీవితంలో హగ్ చేసుకోలేదు. వాళ్లు నా పిల్లలు, కుటుంబ సభ్యులు అయినా సరే" అని యోగ్‌రాజ్ అన్నాడు.
కపిల్ ఏం సాధించాడు?
అటు మరో మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ పైనా యోగ్‌రాజ్ సింగ్ నోరు పారేసుకున్నాడు. 1981లో కపిల్ వల్లే జట్టులో తన స్థానాన్ని కోల్పోయానని భావించే యోగ్ రాజ్.. తనకు యువీ పుట్టినప్పుడే కపిల్ పై ప్రతీకారం తీర్చుకుంటానని ప్రతిజ్ఞ చేసినట్లు 2017లో ఓసారి చెప్పాడు. తాజాగా మరోసారి దీనిపై స్పందించాడు.
"మా కాలంలో గ్రేటెస్ట్ కెప్టెన్ అయిన కపిల్ దేవ్ కు నేను అప్పుడే చెప్పాను. మొత్తం ప్రపంచమంతా నిన్ను నిందిస్తుంది అని. ఈరోజు యువరాజ్ సింగ్ 13 ట్రోఫీలు సాధించాడు. అతడు మాత్రం కేవలం ఒక్కటే. వరల్డ్ కప్ మాత్రమే. ఇక దీనిపై మాట్లాడాల్సిన అవసరం లేదు" అని యోగ్ రాజ్ అన్నాడు.
యువీకి భారత రత్న ఇవ్వాలి
ఇక తన కొడుకు యువరాజ్ కు భారతరత్న ఇవ్వాలని కూడా ఈ సందర్భంగా యోగ్ రాజ్ డిమాండ్ చేయడం విశేషం. "క్యాన్సర్ తో పోరాడుతూనే వరల్డ్ కప్ గెలిచిన యువరాజ్ సింగ్ కు ఇండియా భారతరత్న ఇవ్వాలి" అని యోగ్ రాజ్ అన్నాడు.
2011 వరల్డ్ కప్ సమయంలో లంగ్ క్యాన్సర్ తో బాధపడుతూ కూడా అలాగే ఆడిన యువీ.. ఆ మెగా టోర్నీలో మ్యాన్ ఆఫ్ ద సిరీస్ గా నిలిచి ట్రోఫీ అందించిన విషయం తెలిసిందే. 2011 వరల్డ్ కప్ లో యువరాజ్ సింగ్ 362 రన్స్ చేయడంతోపాటు 15 వికెట్లు కూడా తీసుకున్నాడు.