Yuvraj Singh Biopic: యువరాజ్ సింగ్ బయోపిక్ కన్ఫర్మ్.. అదిరిపోయిన టైటిల్.. యువరాజ్ కామెంట్స్ ఇవే!
Yuvraj Singh Biopic Confirmed With T Series: భారత స్టార్ క్రికెటర్, సిక్సర్ల వీరుడు యువరాజ్ సింగ్ బయోపిక్ అధికారికంగా కన్ఫర్మ్ అయింది. ఈ భారత క్రికెట్ దిగ్గజం జీవితం, కెరీర్ ఆధారంగా ప్రముఖ నిర్మాణ సంస్థ టీ-సిరీస్ ఈ చిత్రాన్ని తెరకెక్కించనుంది. ఈ సినిమా టైటిల్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది.
Yuvraj Singh Biopic Confirm Title As Six Sixes: భారత స్టార్ క్రికెటర్, సిక్సర్ల వీరుడు యువరాజ్ సింగ్ బయోపిక్‌పై అధికారిక ప్రకటన వచ్చేసింది. యువరాజ్ సింగ్ బయోపిక్‌ను బాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ టీ-సిరీస్ ఫిల్మ్స్ నిర్మించనుంది. ఈ విషయంపై సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ అయిన ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్ (గతంలో ట్విట్టర్) హ్యాండిల్స్ ద్వారా మంగళవారం (ఆగస్ట్ 20) అధికారిక ప్రకటన చేశారు.
యువరాజ్ సింగ్ బయోపిక్‌గా వస్తున్న ఈ చిత్రానికి సిక్స్ సిక్సెస్ (Six Sixes) అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారని, వరల్డ్ కప్ హీరో నుంచి క్యాన్సర్ సర్వైవర్‌గా క్రికెట్ ఐకాన్ చేసిన పోరాటం, విశేష ప్రయాణంపై ఈ సినిమా తెరకెక్కనుందని ట్వీట్‌లో మేకర్స్ పేర్కొన్నారు. ఈ బయోపిక్‌లో అటు మైదానంలో ఇటు బయట యువరాజ్ విజయాలను చూపించనున్నట్లు తెలిపారు.
"పిచ్ నుండి మిలియన్ల మంది హృదయాలను సంపాదించున్న లెజెండ్ ప్రయాణాన్ని చూపిస్తాం. యువరాజ్ సింగ్ ధైర్యసాహసాలు, కీర్తివంతమైన కథ త్వరలో వెండితెరపై రానుంది" అని నిర్మాతలు ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌తోపాటు యువరాజ్ సింగ్‌తో ఉన్న ఫొటోలను సైతం షేర్ చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ఫొటోలు, ట్వీట్ తెగ వైరల్ అవుతూ జోరుగా చర్చ నడుస్తోంది.
ఇదిలా ఉంటే, సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన యానిమల్, కబీర్ సింగ్ వంటి చిత్రాలను రూపొందించిన టీ-సిరీస్ అధినేత భూషణ్ కుమార్, నిర్మాత రవి భాగ్ చందక కలిసి యువరాజ్ సింగ్ బయోపిక్ సినిమాను నిర్మిస్తున్నారు. 2017లో వచ్చిన సచిన్ టెండూల్కర్ డాక్యుమెంటరీ 'సచిన్: ఎ బిలియన్ డ్రీమ్స్' నిర్మాణంలో రవి పార్ట్‌నర్‌గా ఉన్నారు.
ప్రముఖ వెబ్‌సైట్ వెరైటీ నివేదిక ప్రకారం.. ఈ సిక్స్ సిక్సెస్ చిత్రం యువరాజ్ సుదీర్ఘ కెరీర్‌లో ఒక ఐకానిక్ మూమెంట్‌ను తిరిగి క్రియేట్ చేయనున్నారు. అదే యువరాజ్ ఇంగ్లాండ్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్‌పై ఒకే ఓవర్‌లో ఆరు సిక్సర్లు కొట్టిన సీన్ మ్యాజిక్‌ను మళ్లీ రిపీట్ చేయనున్నారట. ఈ సిక్సర్స్ 2007లో టీ 20 ప్రపంచ కప్ విజేతగా భారత్ నిలిచేలా చేసిన విషయం తెలిసిందే.
అలాగే 2011 ప్రపంచ కప్ విజయంలో కూడా యువరాజ్ సింగ్ కృషి ఎంతగానో ఉంది. అనంతరం 2011లో కేన్సర్ బారిన పడిన యువరాజ్ ఆ తర్వాత పోరాడి 2012లో తిరిగి క్రికెట్‌లోకి రీఎంట్రీ ఇవ్వడం మరో హైలైట్. 2019లో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు యువరాజ్. ఈ అంశాలతో బయోపిక్‌ను తెరకెక్కించనున్నారట.
తన బయోపిక్ గురించి యువరాజ్ సింగ్ మాట్లాడుతూ.. "నా కథను భూషణ్ జీ, రవి ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది నా అభిమానులకు చూపించడం నాకు చాలా గౌరవంగా ఉంది. ఎన్నో ఎత్తుపల్లాల మధ్య క్రికెట్ నాకు గొప్ప ప్రేమ, శక్తిని ఇచ్చింది. ఈ చిత్రం ఇతరులకు వారి సొంత సవాళ్లను అధిగమించడానికి, అలాగే వారి కలలను అచంచలమైన అభిరుచితో కొనసాగించడానికి ప్రేరేపిస్తుందని నేను ఆశిస్తున్నాను" అని అన్నారు.
ఇక టీ-సిరీస్ భూషణ్ కుమార్ మాట్లాడుతూ "యువరాజ్ సింగ్ జీవితం విజయం, అభిరుచికి సంబంధించిన అద్భుతమైన కథనం. ప్రామిసింగ్ క్రికెటర్ నుంచి క్రికెట్ హీరోగా, ఆ తర్వాత నిజ జీవితంలో హీరోగా ఆయన ప్రయాణం నిజంగా స్ఫూర్తిదాయకం. బిగ్ స్క్రీన్ ద్వారా చెప్పాల్సిన, వినాల్సిన కథను తీసుకురావడం, ఆయన సాధించిన అసాధారణ విజయాలను సెలబ్రేట్ చేసుకోవడం ఆనందంగా ఉంది'' అని చెప్పారు.