Salman Khan: సల్మాన్ ఖాన్‌కి ఏమైంది? కూర్చోవడానికి కూడా ఇబ్బందిపడిన బాలీవుడ్ కండల వీరుడు-bollywood superstar salman khan struggles to get up from his seat due to a rib injury ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Salman Khan: సల్మాన్ ఖాన్‌కి ఏమైంది? కూర్చోవడానికి కూడా ఇబ్బందిపడిన బాలీవుడ్ కండల వీరుడు

Salman Khan: సల్మాన్ ఖాన్‌కి ఏమైంది? కూర్చోవడానికి కూడా ఇబ్బందిపడిన బాలీవుడ్ కండల వీరుడు

Galeti Rajendra HT Telugu
Aug 30, 2024 01:32 PM IST

Salman Khan Rib Injury: సికిందర్ సినిమాలో నటిస్తున్న సల్మాన్ ఖాన్ షూటింగ్‌లో గాయపడ్డాడా? పక్కటెముకల నొప్పితో కనీసం కుర్చీలో నుంచి కూడా లేవడానికి ఇబ్బందిపడుతున్న బాలీవుడ్ కండల వీరుడు. అసలు ఏం జరిగింది?

సల్మాన్ ఖాన్
సల్మాన్ ఖాన్

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌కి ఏమైంది? ఎప్పుడూ హుషారుగా కనిపించే సల్మాన్ ఖాన్ కనీసం కుర్చీ నుంచి లేవడానికి కూడా చాలా ఇబ్బందిపడుతూ కనిపించాడు. దాంతో అభిమానులు కంగారుపడుతూ సల్మాన్ ఆరోగ్యం గురించి తెగ శోధిస్తున్నారు.

ముంబయిలో పర్యావరణానికి హాని చేయకుండా గణేష్ ఉత్సవాలను జరుపుకోవడంపై అవగాహన కల్పించేందుకు బచ్చే బోలే మోరియా అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన సల్మాన్ ఖాన్.. పక్కటెముకల గాయంతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నట్లు కనిపించాడు. వేదికపై కూర్చుని పదే పదే అసౌకర్యంగా పక్కటెముక కుడి భాగాన్ని తాకుతూ కనిపించాడు.

నొప్పి వేధిస్తున్నా

ఈ కార్యక్రమంలో సల్మాన్ ఖాన్ గురించి మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృత ఫడ్నవీస్ మాట్లాడుతూ ‘‘సల్మాన్‌ ఖాన్‌కి ఆరోగ్యం బాగాలేదు. అతను గాయంతో ఇబ్బంది పడుతున్నప్పటికీ ఈ కార్యక్రమానికి వచ్చాడు. పర్యావరణం పట్ల ఆయనకున్న నిబద్ధతకు ఇది నిదర్శనం. ధన్యవాదాలు సల్మాన్ ఖాన్’’ అని చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమాన్ని అమృత ఫడ్నవీస్ నిర్వహించారు. సల్మాన్ ఖాన్ మూవీ సికిందర్ ప్రస్తుతం సెట్స్‌పై ఉంది.

సల్మాన్ కు ఏమైంది?

సికిందర్ మూవీ షూటింగ్‌లో సల్మాన్ పక్కటెముకకు గాయమైందని.. అయితే ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నారని సల్మాన్ సన్నిహిత వర్గాలు తెలిపాయి. ‘‘సల్మాన్ ఖాన్ అభిమానులు కంగారు పడాల్సిన పనిలేదు. సికందర్ షూటింగ్ షెడ్యూల్ ప్రకారం జరుగుతోంది. ఎలాంటి వాయిదా పడలేదు’’ అని సల్మాన్ సన్నిహిత వర్గాలు క్లారిటీ ఇచ్చాయి. అయితే సల్మాన్ గాయంతో ఇబ్బందిపడుతున్న తీరుని చూసి అభిమానులు మాత్రం తమ కంగారుని సోషల్ మీడియాలో వ్యక్తం చేస్తున్నారు.

సల్మాన్ కోలుకోవాలని ఫ్యాన్స్ ఆకాంక్ష

సల్మాన్ ఖాన్ అభిమాని ఒకరు ఎక్స్‌లో ఇలా రాశాడు, "భాయ్ తీవ్రమైన పక్కటెముక గాయంతో బాధపడుతున్నాడు. త్వరగా కోలుకోండి భాయ్. మీ ఆరోగ్యం, మీ సంతోషం మాకు చాలా ముఖ్యం’’ అని రాసుకొచ్చాడు.

మరొకరు ‘‘ఏది ఏమైనా అతను ఎప్పుడూ సల్మాన్ ఖానే. మళ్లీ బలంగా తిరిగి వస్తాడు’’ అని ఎక్స్‌లో రాసుకొచ్చారు. ‘‘ఆరోగ్యంగా ఉండు భాయ్. మీ ఆరోగ్యం కంటే మాకు ఏదీ ముఖ్యం కాదు’’ అని మరో అభిమాని ఎక్స్‌లో రాసుకొచ్చాడు.

ఈ కార్యక్రమంలో సల్మాన్ ఖాన్ మాట్లాడుతూ ‘‘ప్రతి ఒక్కరూ పర్యావరణ రహిత వినాయక విగ్రహాలను ఉపయోగిస్తే మంచిది. అలా చేస్తే నిమర్జనం తర్వాత పరిశుభ్రత సమస్యలు తగ్గుతాయి. అలానే పండగ సమయంలో కాగితం, ప్లాస్టిక్ కప్పులు, సీసాలను విసిరేస్తుంటారు. వాటిని మరుసటి రోజు పారిశుద్ధ్య కార్మికులు శుభ్రపరచాల్సి ఉంటుంది. ఇది మంచిది కాదు. ప్రతి ఒక్కరూ ఎకో ఫ్రెండ్లీ వినాయక విగ్రహాలను ఉపయోగిస్తే బాగుంటుంది. అమెరికా, స్విట్జర్లాండ్, దుబాయ్ వంటి దేశాల్లో పర్యావరణ రహిత వినాయక విగ్రహాలతో పండుగని చేసుకుంటున్నారు. కానీ మన దేశంలో పాటించడం లేదు. పరిశుభ్రత పాటించడం గురించి పిల్లలు పెద్దలకు నేర్పించాలి’’ అని సల్మాన్ ఖాన్ చెప్పుకొచ్చాడు.

ఈ కార్యక్రమంలో సల్మాన్ సోదరి అల్వీరా అగ్నిహోత్రి, ఒకప్పటి హీరోయిన్ సోనాలి బింద్రే, సోనూ నిగమ్, కైలాష్ ఖేర్ తదితరులు పాల్గొన్నారు.

ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో సల్మాన్ హీరోగా సికందర్ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సాజిద్ నదియాడ్ వాలా నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఈద్‌కు విడుదల కానుంది. ఈ సినిమాలో సల్మాన్ సరసన రష్మిక మంధాన నటిస్తోంది.