Anweshippin Kandethum Review: అన్వేషిప్పిన్ కండేతుమ్ రివ్యూ - టోవినో థామస్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఎలా ఉందంటే?
Anweshippin Kandethum Review: టోవినో థామస్ హీరోగా నటించిన మలయాళం మూవీ అన్వేషిప్పిన్ కండేతుమ్ ఇటీవల నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజైంది. తెలుగులోనూ ఈ మలయాళం మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.

Anweshippin Kandethum Review: టోవినో థామస్ హీరోగా నటించిన అన్వేషిప్పిన్ కండేతుమ్ విమర్శకుల ప్రశంసలతో పాటు కమర్షియల్ పెద్ద విజయాన్ని సాధించింది. 8 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ 40 కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టింది. ఇటీవల నెట్‌ఫ్లిక్స్ ద్వారా ఓటీటీ ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా ఎలా ఉందంటే?
రెండు మర్డర్ కేసులు...
తండ్రి నారాయణ పిళ్లై స్ఫూర్తితో ఆనంద్ (టొవినో థామస్) పోలీస్ జాబ్‌లో చేరతాడు. అతడు ఎస్ఐగా పనిచేస్తోన్న ఏరియాలో లవ్‌లీ అనే అమ్మాయి అదృశ్యం అవుతుంది. ఆమె డెడ్‌బాడీ ఓ పాడుబడ్డ బావిలో దొరుకుతుంది. హత్య జరగడానికి ముందు లవ్‌లీ చర్చికి వెళ్లినట్లు ఆనంద్ ఇన్వేస్టిగేషన్‌లో తేలుతుంది. చర్చి ఫాదర్ థామస్‌ను ఆనంద్ ఇన్వేస్టిగేషన్ చేయాలని అనుకుంటారు.
కానీ ఆనంద్ చర్చిలో అడుగుపెట్టకుండా స్థానికులు అడ్డుకుంటారు. ఆనంద్ ఇన్వేస్టిగేషన్ ను ఆపేస్తారు పై అధికారులు. ఓ అమాయకుడు లవ్‌లీ చేశాడని దొంత సాక్ష్యాలు సృష్టించి కేసును క్లోజ్ చేయాలని ప్రయత్నిస్తారు. లవ్‌లీని హత్య చేసింది చర్చి ఫాదర్ చెల్లెలి కొడుకు అని ఆనంద్ కనిపెడతాడు. హంతకుడిని కోర్టుకు తీసుకెళుతుండగా అతడు ఆత్మహత్య చేసుకుంటాడు. డ్యూటీలో నిర్లక్ష్యంగా ఉన్నాడని ఆనంద్‌తో పాటు ఆ రోజు డ్యూటీలో ఉన్న ముగ్గురు కానిస్టేబుల్స్‌ను సస్పెండ్ చేస్తారు.
చాలా రోజుల తర్వాత ఆనంద్‌తో పాటు అతడి టీమ్‌పై సస్పెన్షన్‌ను ఎత్తేసిన ఎస్‌పి వారికి ఆరేళ్లుగా సాల్వ్ కాకుండా ఉన్న శ్రీదేవి అనే యువతి మర్డర్ కేసును అప్పగిస్తాడు. లోకల్ పోలీసులతో పాటు క్రైమ్‌బ్రాంచ్, సిట్ అధికారులు ఇన్వేస్టిగేషన్ చేసినా శ్రీదేవిని హత్య చేసింది ఎవరన్నది కనిపెట్టలేకపోతారు. ఈ ఇన్వేస్టిగేషన్స్ కారణంగా స్థానికులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు.
దాంతో ఆనంద్‌తో పాటు అతడి టీమ్‌కు ఎలాంటి సహాయసహకారాలు చేయకూడదని చేరువెల్లి ఊరి పెద్ధలు నిర్ణయించుకుంటారు. రవీంద్రన్ అనే రిటైర్డ్ కానిస్టేబుల్ సహాయంతో ఆనంద్ తన ఇన్వేస్టిగేషన్‌ను కొనసాగిస్తాడు? శ్రీదేవిని హత్య చేసింది ఎవరు? ఆ హంతకుడిని ఆనంద్ ఎలా కనిపెట్టాడు? ఎస్‌పి తనకు అప్పగించిన బాధ్యతను ఏ విధంగా పూర్తిచేశాడు అన్నదే ఈ సినిమా కథ.
జాలీ జోసెఫ్ కేసు ఆధారంగా...
కేరళలో సంచలనం సృష్టించిన జాలీ జోసెఫ్ మర్డర్ కేసు ఆధారంగా అన్వేషిప్పిన్ కండేతుమ్ సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు డార్విన్ కురియాకోస్. ఓ రెండు ఛాలెంజింగ్ మర్డర్ కేసులను నిజాయితీపరుడైన పోలీస్ ఆఫీసర్ ఎలా సాల్వ్ చేశాడు అన్నదే ఈ సినిమా కథ. అన్వేషిప్పిన్ కండేతుమ్ ఫస్ట్ హాఫ్ ఓ సినిమాలా....సెకండాఫ్ మరో సినిమాలా అనిపిస్తుంది. రెండు మర్డర్ కేసులు, వాటి నేపథ్యాలతో పాటు మలుపులు ఒకదానిని మించి మరొకటి ఉంటాయి. . అసలైన హంతకుడిని హీరో ఎలా కనిపెడతాడన్నది థ్రిల్లింగ్‌ను పంచుతుంది. చివరి సీన్ వరకు ఆడియెన్స్‌ను ఎంగేజ్ చేసేలా డైరెక్టర్ కథను చక్కగా రాసుకున్నాడు.
వృత్తి నిర్వహణలో పోలీసులకు ఎదురయ్యే సాదకబాధకాలను ఈ సినిమాలో చూపించారు. అంతే కాకుండా కులమంత అంతరాలు, పరువు హత్యల సమస్యను అంతర్లీనంగా టచ్ చేశారు. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకు పూర్తి భిన్నంగా అన్వేషిప్పిన్ కండేతుమ్ సాగుతుంది. ఈ సినిమాలో హీరోయిన్ ఉండదు. కామెడీ ట్రాక్‌లు, రొమాన్స్, యాక్షన్ సీన్స్ లేకుండా ప్యూర్ ఇన్వేస్టిగేషన్ థ్రిల్లర్‌గా చెప్పాలనుకున్న కథను నిజాయితీగా డైరెక్టర్ స్క్రీన్‌పై ఆవిష్కరించాడు.
సస్పెండ్ అయ్యే సీన్‌తోనే...
టోవినో థామస్ సస్పెండ్ అయినట్లుగా చూపించే సీన్‌తోనే అన్వేషిప్పిన్ కండేతుమ్ సినిమా మొదలవుతుంది. పై అధికారుల అడుగడుగుగా అడ్డుకుంటున్నా తన తెలివితేటలు, ధైర్యసాహసాలతో లవ్‌లీ హంతకుడిని ఆనంద్ ఎలా పట్టుకున్నాడన్నది ఫస్ట్ హాఫ్‌లో చూపించాడు. సెకండాఫ్ మొత్తం శ్రీదేవి హత్య కేసు చుట్టూ తిరుగుతుంది. అసలు కిల్లర్ ఎవరన్నది రివీలయ్యే క్లైమాక్స్ ట్విస్ట్ గూస్‌బంప్స్‌ను కలిగిస్తుంది.
అన్వేషిప్పిన్ కండేతుమ్ కథ బాగున్నా స్లో నరేషన్ ఇబ్బంది పెడుతుంది. శ్రీదేవి మర్డర్ కేసును హీరో ఈజీగా సాల్వ్ చేసినట్లుగా అనిపిస్తుంది. కొన్ని ట్విస్ట్‌లను బలంగా రాసుకుంటే బాగుండేది.
టోవినో థామస్ జీవించాడు...
ఆనంద్ అనే పోలీస్ ఆఫీసర్‌గా టోవినో థామస్ సెటిల్ట్ యాక్టింగ్‌తో మెప్పించాడు. పోలీస్ ఆఫీసర్‌కు తగ్గట్టుగా బాడీలాంగ్వేజ్, ఎక్స్‌ప్రెషన్స్ మార్చుకొని నటించాడు. ఆనంద్ టీమ్ మెంబర్స్‌గా ముగ్గరు కానిస్టేబుల్స్ యాక్టింగ్ బాగుంది.
డిఫరెంట్ క్రైమ్ థ్రిల్లర్...
అన్వేషిప్పిన్ కండేతుమ్ రెండు గంటల ఇరవై నిమిషాలు థ్రిల్‌ను పంచే డిఫరెంట్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ. ఇన్వేస్టిగేషన్ థ్రిల్లర్ మూవీస్‌ను ఇష్టపడే ఆడియెన్స్‌ను ఈ సినిమా తప్పకుండా మెప్పిస్తుంది.