The Kerala Story Collections: తొలి రోజు కంటే నాలుగో రోజే ఎక్కువ.. ది కేరళ స్టోరీ కలెక్షన్ల సునామీ
09 May 2023, 14:00 IST
- The Kerala Story Collections: తొలి రోజు కంటే నాలుగో రోజే ఎక్కువ కలెక్షన్లు సాధించింది ది కేరళ స్టోరీ. ఈ మూవీ కలెక్షన్ల సునామీ క్రియేట్ చేస్తోంది. నాలుగు రోజుల్లోనే రూ.45 కోట్లు వసూలు చేయడం విశేషం.
ది కేరళ స్టోరీ
The Kerala Story Collections: ది కేరళ స్టోరీ కలెక్షన్ల విషయంలో దూసుకెళ్తోంది. తొలి రోజు కంటే నాలుగో రోజు ఈ మూవీ ఎక్కువ కలెక్షన్లు సాధించడం విశేషం. అంతేకాదు చాలా సినిమాలు తొలి వీకెండ్ తర్వాత వచ్చే సోమవారం బోల్తా పడతాయి. కానీ ఈ సినిమా మాత్రం సోమవారం (మే 8) కూడా మంచి వసూళ్లు రాబట్టింది.
అదా శర్మ నటించిన ది కేరళ స్టోరీ తొలి రోజు రూ.8 కోట్లు వసూలు చేయగా.. నాలుగో రోజు రూ.10 కోట్ల నెట్ రాబట్టడం మేకర్స్ ను ఆనందానికి గురి చేస్తోంది. ఈ వివాదాస్పద సినిమాను ఇప్పటికే వెస్ట్ బెంగాల్, తమిళనాడులాంటి రాష్ట్రాలు నిషేధించాయి. మరికొన్ని చోట్ల కూడా థియేటర్ల నుంచి ఈ సినిమాను తీసేస్తున్నారు. అయితే గుజరాత్ లాంటి రాష్ట్రాల్లో మాత్రం ఈ సినిమాకు ఇంకా భారీగానే కలెక్షన్లు వస్తున్నాయి.
ఇప్పటి వరకూ ది కేరళ స్టోరీ నాలుగు రోజుల్లో రూ.45 కోట్లు వసూలు చేసింది. ఓ వర్గం నుంచి పాజిటివ్ రివ్యూలు, మరోవైపు పెద్ద ఎత్తున విమర్శలు ఈ సినిమాకు మేలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. శనివారం (మే 6) రూ.10 కోట్లు, ఆదివారం రూ.16 కోట్లు వచ్చాయి. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ది కేరళ స్టోరీ ట్రెండింగ్ లోనే ఉంటోంది.
ఒకరకంగా గతేడాది ది కశ్మీర్ ఫైల్స్ మూవీపై నెలకొన్న వివాదం ఆ సినిమాను ఎలా అయితే టాప్ గ్రాసర్స్ లో ఒకటిగా నిలిపిందో.. ఇప్పుడు ది కేరళ స్టోరీకి కూడా అలాగే జరుగుతోంది. కేరళలో ఏకంగా 32 వేల మంది హిందూ అమ్మాయిలను ఇస్లాంలోకి మార్చి వాళ్లను ఐసిస్ లో ఉగ్రవాదులు మార్చారంటూ ఈ సినిమా ఆరోపిస్తోంది.
అసలు ఇంత భారీ సంఖ్యలో అమ్మాయిలు మతం మారి, కనిపించకుండా పోవడం అనేది బూటకమని.. లేనిపోనివి కల్పించి సినిమాలో చూపించారని మరో వర్గం ఆరోపిస్తోంది. ఎప్పటిలాగే ఇది ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ ల మధ్య మాటల యుద్ధానికి కారణమైంది. బీజేపీ ప్రత్యర్థి పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఈ సినిమాపై పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తోంది.