The Kerala Story: ‘ది కేరళ స్టోరీ’పై ఆగని దుమారం.. బెంగాల్‍లో ఆ సినిమా బ్యాన్!
The Kerala Story: ది కేరళ స్టోరీ సినిమాను పశ్చిమ బెంగాల్‍లో బ్యాన్ చేస్తున్నట్టు ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ ప్రకటించారు. అల్లర్లను నివారించేందుకు ఈ చర్యలు తీసుకున్నట్టు తెలిపారు.
The Kerala Story: తమ రాష్ట్రంలో “ది కేరళ స్టోరీ” సినిమాపై నిషేధం విధిస్తున్నట్టు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) సోమవారం (మే 8) ప్రకటించారు. ఈ సినిమా దుష్ప్రచారాన్ని వ్యాప్తి చేస్తోందని అన్నారు. ట్రైలర్ విడుదలైన నాటి నుంచి ‘ది కేరళ స్టోరీ’ సినిమాపై వివాదం తీవ్రమవుతోంది. కేరళలోని అమ్మాయిలను కొందరు మోసం చేసి ఐసిస్ ఉగ్రవాద సంస్థలో చేరుస్తున్నారన్న కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. మే 5న ఈ చిత్రం విడుదల కాగా.. అప్పటి నుంచి దుమారం మరింత పెరిగింది. తమిళనాడులోని థియేటర్ల నుంచి ఈ సినిమాను ఇప్పటికే తొలగించారు. తాజాగా.. ఈ సినిమాపై బ్యాన్ విధిస్తున్నట్టు పశ్చిమ బెంగాల్ సీఎం నేడు ప్రకటించారు. ఈ చిత్రాన్ని నిషేధిస్తున్నట్టు అధికారికంగా ప్రకటించిన తొలి రాష్ట్రంగా బెంగాల్ నిలిచింది. వివరాలివే..
The Kerala Story: “ది కేరళ స్టోరీ సినిమాను నిషేధించాలని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో విద్వేషపూరిత, హింసాత్మక ఘటనలను నివారించేందుకు, శాంతిని కాపాడేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాం” అని నబన్నాలో సోమవారం జరిగిన ఓ కార్యక్రమంలో మమతా బెనర్జీ అన్నారు.
The Kerala Story: “వారు కశ్మీర్ ఫైల్స్ ఎందుకు రూపొందించారు? ఓ వర్గాన్ని అవమానించేందుకు. ఈ కేరళ స్టోరీ ఏంటి? ఇది ఓ వక్రీకరించిన కథ. ఇప్పుడు కేరళ రాష్ట్రం పరువును దెబ్బ తీయాలని చూస్తున్నారు” అని మమతా బెనర్జీ చెప్పారు. ఈ సినిమాల వెనుక బీజేపీ ఉందనేలా ఆమె ఆరోపించారు. మతపరమైన రాజకీయాలను బీజేపీ ఎందుకు చేస్తోందని మమతా బెనర్జీ అన్నారు. “సేవ్ బెంగాల్ అనే పోస్టర్లను ఇక్కడ కూడా రూపొందించారని నా దృష్టికి వచ్చింది. బెంగాల్‍లో ఏమైంది? బెంగాల్ శాంతిని కోరుకునే రాష్ట్రం” అని మమతా అన్నారు.
The Kerala Story: కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ సహా కాంగ్రెస్ కూడా ది కేరళ స్టోరీని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. బీజేపీ.. ఈ చిత్రానికి మద్దతు తెలుపుతోంది. ది కేరళ స్టోరీ సినిమాను పశ్చిమ బెంగాల్ బ్యాన్ చేయడం తప్పు అని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ అన్నారు. మరోవైపు మధ్యప్రదేశ్‍లో ఈ సినిమాకు పన్నును మినహాయించారు సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్.
The Kerala Story: కాగా, బెంగాల్‍లో ది కేరళ స్టోరీని నిషేధించడం పట్ల ఆ సినిమా నిర్మాత విపుల్ షా స్పందించారు. చట్ట ప్రకారం తాము పోరాడతామని అన్నారు. న్యాయపరమైన చర్యలకు దిగుతామని చెప్పారు.
The Kerala Story: ది కేరళ స్టోరీ సినిమాకు సుదీప్తో సేన్ దర్శకత్వం వహించగా.. అదా శర్మ ప్రధాన పాత్రలో నటించారు. కేరళకు చెందిన 32,000 మంది హిందూ అమ్మాయిలను మోసపూరితంగా కొందరు ఇస్లాం మతంలోకి మార్చి.. ఐసిస్‍లోకి పంపారని ది కేరళ స్టోరీ సినిమా ట్రైలర్‌లో ఉండటంతో తీవ్ర దుమారం రేగింది. అయితే, కేరళకు చెందిన ముగ్గురు అమ్మాయిల యథార్థ కథ ఇది అని గత వారం ప్రోమోను మార్చింది ఆ చిత్ర యూనిట్.