The GOAT OTT Release Date: దళపతి విజయ్ లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఓటీటీ రిలీజ్ ఫిక్స్.. తెలుగులోనూ స్ట్రీమింగ్
18 September 2024, 15:46 IST
- The GOAT OTT Release Date: దళపతి విజయ్ నటించిన ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్సయినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మూవీ దసరా సందర్భంగా డిజిటల్ ప్రీమియర్ కు సిద్ధం కానున్నట్లు చెబుతున్నారు.
దళపతి విజయ్ లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఓటీటీ రిలీజ్ ఫిక్స్.. తెలుగులోనూ స్ట్రీమింగ్
The GOAT OTT Release Date: తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ నటించిన మూవీ ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్. అతని కెరీర్ చివరి సినిమాల్లో ఒకటిగా భారీ అంచనాల మధ్య రిలీజైన ఈ సినిమా ఆశించిన స్థాయిలో వసూళ్లును రాబట్టలేకపోయింది. తమిళంలో తప్ప మిగిలిన భాషల్లో నష్టాలే ఎదురయ్యాయి. అయితే ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేస్తోంది.
ది గోట్ ఓటీటీ రిలీజ్ డేట్
దళపతి విజయ్ ది గోట్ (ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్) మూవీ ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్ భారీ మొత్తానికి సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడీ ఓటీటీ మూవీని అక్టోబర్ 11 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
సెప్టెంబర్ 5న థియేటర్లలో రిలీజైన ఈ సినిమాను సుమారు ఐదు వారాల తర్వాత ఓటీటీలోకి తీసుకురానున్నారు. ఈ సినిమా హక్కుల కోసం నెట్‌ఫ్లిక్స్ ఏకంగా రూ.110 కోట్లు చెల్లించినట్లు తెలుస్తోంది. తమిళంతోపాటు తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లోనూ నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనుంది.
ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ ఎలా ఉందంటే?
ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ మూవీ ఓ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్. ఈ సినిమాలో దళపతి విజయ్ డ్యుయల్ రోల్లో నటించాడు. ఈ సినిమా 13 రోజుల్లో ఇండియాలో రూ.266 కోట్ల వసూళ్లు సాధించింది.
ది గోట్ ఫక్తు దళపతి విజయ్ మార్కు కమర్షియల్ మూవీ. విజయ్ సినిమా అంటేనే స్టైలిష్ యాక్షన్ ఎపిసోడ్స్, హీరోయిజం, డ్యాన్సులు ఉండాలని అభిమానులు ఆశిస్తుంటారు. కథ సింపుల్‌గా ఉన్నా సరే కమర్షియల్ హంగులు వర్కవుట్ అయితే రిజల్ట్ ఏ రేంజ్‌లో ఉంటుందో లియోతో పాటు విజయ్ గత సినిమాలు నిరూపించాయి.
ది గోట్‌తో దర్శకుడు వెంకట్ ప్రభు ఇదే రూట్‌ను ఫాలో అయ్యాడు. కథ విషయంలో ప్రయోగాల జోలికి వెళ్లలేదు. తండ్రిపై పగను పెంచుకున్న ఓ కొడుకు.. వీరిద్దరి పోరాటంలో గెలుపు ఎవరిది అన్నదే గోట్ మూవీ కథ. ఈ సింపుల్ స్టోరీని మూడు గంటల నిడివితో చెప్పడానికి వెంకట్ ప్రభు అన్ని అస్త్రాలు వాడాడు. జిమ్మిక్కులు, మ్యాజిక్కులు చేశాడు. అందులో కొన్ని వర్కవుట్ అయితే కొన్ని బెడిసికొట్టాయి.
గాంధీ, జీవన్ రెండు పాత్రల్లో దళపతి విజయ్ వేరియేషన్ చూపించిన విధానం, యాక్టింగ్ బాగున్నాయి. డ్యాన్సుల్లో అదరగొట్టాడు. హీరోయిన్ మీనాక్షి చౌదరి ఒకటి, రెండు సీన్లకే పరిమితమైంది. ప్రభుదేవా, ప్రశాంత్, మోహన్, జయరామ్ ఇలా సినిమాలో చాలా మంది సీనియర్ నటులు కనిపిస్తారు. విజయ్‌నే ఎక్కువగా హైలైట్ చేయడానికి వారి పాత్రలకు అంతగా ప్రాధాన్యతలేని ఫీలింగ్ కలుగుతుంది. చివరలో త్రిష ఐటెంసాంగ్ మాస్ ఫ్యాన్స్‌ను మెప్పిస్తుంది.