Tantra Movie Review: తంత్ర మూవీ రివ్యూ - అనన్య నాగళ్ల హారర్ మూవీ ఎలా ఉందంటే?
15 March 2024, 19:39 IST
Tantra Movie Review: అనన్య నాగళ్ల హీరోయిన్‌గా నటించిన హారర్ మూవీ తంత్ర శుక్రవారం థియేటర్లలో రిలీజైంది. ఈ సినిమాకు శ్రీనివాస్ గోపిశెట్టి దర్శకత్వం వహించాడు.
తంత్ర రివ్యూ
Tantra Movie Reviewఫ నటీనటులు: అనన్య నాగళ్ల, సలోని, ధనుష్ రఘు ముద్రి, మీసాల లక్ష్మణ్, టెంపర్ వంశీ, మనోజ్ ముత్యం తదితరులు
సంగీతం: ఆర్ఆర్ ద్రువన్
సినిమాటోగ్రఫీ: శ్రీరామ్ ఉద్ధవ్
ఎడిటర్: SB ఉద్దవ్
నిర్మాతలు: నరేష్ బాబు, రవి చైతన్య
దర్శకుడు: శ్రీనివాస్ గోపిశెట్టి
రేఖ ప్రతీకారం…
రేఖ (అనన్య నాగళ్ల) పుట్టుకతోనే తల్లి రాజ్యలక్ష్మిని (సలోని) కోల్పోతుంది. నాన్నమ్మ సంరక్షణలో పెరుగుతుంది. . తేజూ (ధనుష్ రఘుముద్రి)ను ఇష్టపడుతుంది. తేజూ వేశ్య కొడుకు కావడంతో వారి ప్రేమకు అనేక అడ్డంకులు ఎదురవుతుంటాయి. క్షుద్ర శక్తుల కారణంగా జన్మించడంతో రేఖ చుట్టూ ఎప్పుడూ దయ్యాలు తిరుగుతుంటాయి. పౌర్ణమి వచ్చిందంటే రేఖను వెతుక్కుంటూ ఓ రక్త పిశాచి వస్తుంటుంది. అందుకు కారణం ఏమిటి?
క్షుద్ర శక్తుల బారి నుంచి రేఖ ఎలా బయటపడింది? అసలు రేఖ నేపథ్యం ఏమిటి? రేఖ తల్లి రాజ్యలక్ష్మి ఎలా చనిపోయింది? రేఖను బలి ఇవ్వాలని విగతి (టెంపర్ వంశీ) ఎందుకు అనుకుంటున్నాడు? అతడి బారి నుంచి రేఖ బయటపడిందా? తేజాతో తన ప్రేమను గెలిపించుకుందా? లేదా? అన్నదే తంత్ర మూవీ కథ.
హారర్ మినిమం గ్యారెంటీ...
హారర్ కథలు మినిమం గ్యారెంటీ అనే నమ్మకం దర్శకనిర్మాతల్లో కనిపిస్తుంటుంది. ప్రేక్షకుల్ని ఎంత భయపడితే అంత కాసుల వర్షం కురిపిస్తుంటాయి. తంత్ర కూడా హారర్ కథాంశంతోనే తెరకెక్కింది. హారర్ కథకు లవ్‌స్టోరీ, రివేంజ్ డ్రామాను జోడించి తంత్ర కథను రాసుకున్నాడు దర్శకుడు శ్రీనివాస్.
తన తల్లికి జరిగిన అన్యాయంపై ఓ యువతి ఎలా ప్రతీకారం తీర్చుకుంది? తనను బలివ్వడానికి ప్రయత్నించే ఓ మాంత్రికుడి ఆటలను ఎలా కట్టించింది అన్నదే ఈ సినిమా మెయిన్ పాయింట్.
ఆరు భాగాలు...
పూరాణాల్లో క్షుద్ర పూజలు, క్షుద్ర దేవతలు ఉన్నారనేఅంశంతోనే తంత్ర సినిమా మొదలవుతుంది. . సినిమాను ఆరు భాగాలుగా విడదీయడం, ఒక్కో భాగానికి రక్తదాహం, పాతాళకుట్టి అంటూ ఒక్కో పేరు పెట్టడం కొత్తగా అనిపిస్తుంది. తాంత్రిక పూజలపై చాలా రీసెర్చ్ చేసి డీటైలింగ్‌గా చూపించాడు.
సినిమాలో క్షుద్ర పూజలకు సంబంధించిన ఎపిసోడ్స్‌తోనే దర్శకుడు చాలా వరకు భయపెట్టాడు. దయ్యాలతో పాటు కొన్ని విచిత్రమైన ఆకారాలు ఎదురయ్యే సీన్స్ మొత్తం హారర్ ఫీల్‌ను కలిగించేలా స్క్రీన్‌పై ప్రజెంట్ చేశాడు. పల్లెటూరి బ్యాక్‌డ్రాప్‌లో లవ్ స్టోరీ చాలా నాచురల్‌గా సాగుతుంది.
రొటీన్ సీన్స్...
హీరోయిన్ చుట్టూ దయ్యాలు ఎందుకు తిరుగుతున్నాయనే పాయింట్‌ను అర్థవంతంగా చెప్పలేకపోయినట్లుగా అనిపిస్తుంది. హారర్ సీన్స్ కొన్ని రొటీన్‌గా అనిపిస్తాయి. సెకండాఫ్‌లో వచ్చే ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌లో ఆసక్తి లోపించింది. ఆరు భాగాల మధ్య కనెక్టివిటీ సరిగ్గా కుదరలేదు. ప్రేక్షకులను భయపెట్టాలనే ప్రయత్నంలో కథకు సంబంధం లేని సీన్స్ ఇరికించారు.
ఛాలెంజింగ్ రోల్...
పల్లెటూరి అమ్మాయిగా, అమాయకురాలిగా కనిపించిన అనన్య నాగళ్ల ఇందులో ఓ డిఫరెంట్ క్యారెక్టర్ చేసింది. హారర్ సీన్స్‌లో కళ్లు, ఎక్స్‌ప్రెషన్స్‌తోనే భయపెట్టింది. ఛాలెజింగ్ రోల్‌కుపూర్తిగా న్యాయం చేసింది. హీరో ధనుష్ యాక్టింగ్ నాచురల్‌గా ఉంది. పల్లెటూరి కుర్రాడిగా మెప్పించారు.
చాలా రోజుల తర్వాత తంత్రతో టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇచ్చిన సలోని తన స్క్రీన్ ప్రజెన్స్‌తో ఆకట్టుకుంటుంది. టెంపర్ వంశీ విలనిజం పర్వాలేదనిపిస్తుంది. ఆర్ఆర్ ద్రువన్ పాటలు, బీజీఎమ్, శ్రీరామ్ ఉద్ధవ్ సినిమాటోగ్రఫీ ఈ చిన్న సినిమాకు ప్రాణం పోశాయి.
హారర్ మూవీ లవర్స్ కోసం...
క్షుద్ర పూజలు అనే డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తంత్ర మూవీ తెరకెక్కింది. హారర్ మూవీ లవర్స్‌ను కొంత వరకు ఈ సినిమా మెప్పిస్తుంది.
రేటింగ్:2.75/5
టాపిక్