Shriya Reddy Web Series: తమిళనాడు రాజకీయాలపై సలార్ విలన్ శ్రియా రెడ్డి వెబ్ సిరీస్ - తెలుగులోనూ స్ట్రీమింగ్
03 May 2024, 13:29 IST
Shriya Reddy Web Series: సలార్ ఫేమ్ శ్రియా రెడ్డి, కాంతార కిషోర్ ప్రధాన పాత్రల్లో తమిళంలో తలైమై సేయలగం పేరుతో ఓ వెబ్‌సిరీస్ తెరకెక్కుతోంది. మే 17 నుంచి జీ5 ఓటీటీలో ఈ పొలిటికల్ వెబ్‌సిరీస్ స్ట్రీమింగ్ కాబోతోంది. తెలుగులోనూ ఈ సిరీస్‌ను రిలీజ్ చేస్తున్నారు.
తలైమై సేయలగం ఫస్ట్ లుక్
Shriya Reddy Web Series: సలార్‌లో నెగెటివ్ షేడ్స్‌తో కూడిన పాత్రలో కనిపించి మెప్పించింది శ్రియారెడ్డి. తన డైలాగ్ డెలివరీతోనే విలనిజాన్ని పండించి భయపెట్టింది. తాజాగా తమిళనాడు రాజకీయాలపై శ్రియారెడ్డి ఓ వెబ్‌సిరీస్ చేస్తోంది.
తలైమై సేయలగం పేరుతో తెరకెక్కుతోన్న ఈ పొలిటికల్ డ్రామా సిరీస్‌లో కాంతార కిషోర్ లీడ్‌రోల్‌లో నటిస్తోన్నాడు. శ్రియారెడ్డితో పాటు భరత్, రమ్య నంబీశీన్, దర్శన గుప్తా, కస్తూరి కీలక పాత్రలు పోషిస్తున్నారు. నేషనల్ అవార్డ్ విన్నర్ వసంత బాలన్ ఈ పొలిటికల్ సిరీస్‌కు దర్శకత్వం వహిస్తోన్నాడు.
ఫస్ట్ లుక్, టీజర్ రిలీజ్...
తలైమై సేయలగం ఫస్ట్ లుక్, టీజర్‌తో రిలీజ్ డేట్‌ను మేకర్స్ అనౌన్స్‌చేశారు. ఈ పొలిటికల్ వెబ్‌సిరీస్ మే 17 నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది. తమిళంతో పాటు తెలుగులోనూ ఈ వెబ్‌సిరీస్‌ను రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ వెబ్‌సిరీస్ లో తమిళనాడు ముఖ్యమంత్రిగా కిషోర్ కనిపించబోతున్నట్లు సమాచారం.
అవినీతిపరుడిగా...
తలైమై సేయలగం ఫస్ట్ లుక్‌లో పొలిటికల్ లీడర్‌గా వైట్ అండ్ వైట్ డ్రెస్‌లో సీరియస్‌గా కిషోర్ పేపర్ చదువుతున్నట్లుగా ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేశారు. అదే పేపర్‌లో అవినీతి పరుడిగా కిషోర్‌ను ఆరోపిస్తూ కేంద్ర ప్రభుత్వం అరెస్ట్ చేయడానికి సిద్ధమైనట్లుగా న్యూస్ ఉండటం ఆసక్తిని పంచుతోంది.
ప్రతిపక్ష నాయకురాలిగా...
పొలిటికల్ అంశాలతో టీజర్ ఇంట్రెస్టింగ్‌ను కలిగిస్తోంది. ఇందులో ప్రతిపక్ష నాయకురాలిగా శ్రియా రెడ్డి కనిపిస్తోంది. సామాన్య ప్రజల తరఫున పోరాడే యువ తిరుగుబాటుదారుడిగా భరత్, తిరుగుబాటు దళ సభ్యురాలిగా రమ్య నంబీషన్ కనిపిస్తున్నారు.
రాజకీయ నాయకుడి పాత్రను చేస్తోన్న కిషోర్‌పై ప్రత్యర్థులు వేసిన ఎత్తులు, వాటిని తిప్పికొట్టేందుకు అతడు చేసిన ఆలోచనలు, చివరకు ముద్దాయిగా కోర్టు మెట్లు ఎక్కడం, తన పదవి నుంచి దిగిపోతున్నట్లుగా కుర్చీ నుంచి అతడు లేవడం లాంటి సీన్స్‌ను టీజర్‌లో ఆసక్తిని పంచుతోన్నాయి.
రాధిక శరత్‌కుమార్ నిర్మాత...
తమిళనాడులో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా ఈ సిరీస్ రూపొందుతోన్నట్లు సమాచారం. ఈ వెబ్‌సిరీస్‌ను రాడాన్ మీడియా వర్క్స్ పతాకంపై నటి రాధిక శరత్‌కుమార్ నిర్మిస్తోంది. ఈ సిరీస్‌కు గిబ్రాన్ మ్యూజిక్ అందిస్తోన్నాడు. ఈ సిరీస్‌లోని విజువల్స్, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, ప్రొడక్షన్ వాల్యూస్ సినిమాలను తలపిస్తోన్నాయి.
నేషనల్ అవార్డ్ విన్నర్...
తమిళంలో రూపొందిన వెయిల్ మూవీతో నేషనల్ అవార్డును అందుకున్నాడు దర్శకుడు వసంతబాలన్. అంజలితో అతడు రూపొందిన అంగడితెరు మూవీ కూడా కమర్షియల్‌గా పెద్ద హిట్టైంది. తలైమై సేయలగం తో ఓటీటీలో వసంతబాలన్ ఎంట్రీ ఇస్తోన్నాడు.
దర్శకుడిగా ఇదే అతడి ఫస్ట్ వెబ్‌సిరీస్. తెలుగు, తమిళ భాషల్లో పలు సినిమాల్లో నెగెటివ్ షేడ్స్‌తో కూడిన పాత్రల్లోనే ఎక్కువగా కనిపించింది శ్రియారెడ్డి. ప్రస్తుతం పవన్ కళ్యాన్, సుజీత్ కాంబోలో తెరకెక్కుతోన్న ఓజీలో ఓ ఇంపార్టెంట్ రోల్ చేస్తోంది. సలార్ 2 శౌర్యంగపర్వంలో విలన్‌గా ఆమె పాత్ర మరింత పవర్‌ఫుల్‌గా ఉండబోతున్నట్లు సమాచారం.