Jithendar Reddy Movie:తెలుగు తెరపైకి తెలంగాణ పొలిటికల్ లీడర్ బయోపిక్ - జితేందర్ రెడ్డి రిలీజ్ డేట్ ఇదే!
Jithendar Reddy Movie: జితేందర్‌రెడ్డి మూవీ మే 3న థియేటర్లలో రిలీజ్ కాబోతోంది. రాకేష్ వర్రే హీరోగా నటించిన ఉయ్యాల జంపాల ఫేమ్ విరించి వర్మ దర్శకత్వం వహించాడు.
Jithendar Reddy Movie: బాహుబలి ఫేమ్ రాకేష్ వర్రె హీరోగా విరించి వర్మ దర్శకత్వంలో రూపొందుతోన్న జితేందర్‌రెడ్డి రిలీజ్ డేట్ ఫిక్సయింది. 1980ల కాలంలో జరిగిన వాస్తవ ఘటనలతో తెరకెక్కుతోన్న ఈ మూవీ గ్లింప్స్‌ను ఇటీవల రిలీజ్ చేశారు. పేద ప్రజల కోసం పోరాటం చేసిన జగిత్యాలకు చెందిన జితేందర్‌రెడ్డి జీవితం ఆధారంగా ఈ మూవీ తెరకెక్కుతోంది.
సుబ్బరాజు డైలాగ్‌తో...
నీ ఉద్యమంతో ఒక తరాన్ని మేల్కొల్పాలి అంటూ సుబ్బరాజు చెప్పిన డైలాగ్‌తో జితేందర్ రెడ్డి గ్లింప్స్ ఇంట్రెస్టింగ్‌గా ప్రారంభమైంది. తెలంగాణలో ఆనాటి రాజకీయ సామాజిక పరిస్థితులతో పాటు నక్సలిజం సమస్యను కూడా ఈ మూవీలో చూపించబోతున్నట్లు గ్లింప్స్ చూస్తుంటే తెలుస్తోంది. జితేందర్‌రెడ్డి పాత్రలో రాకేష్ వర్రే డైలాగ్స్, లుక్ గ్లింప్స్‌లో ఆకట్టుకుంటున్నాయి. పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ మూవీ మే 3న థియేటర్లలో రిలీజ్ కాబోతోంది. ముదిగంటి క్రియేషన్స్ పై ముదుగంటి రవీందర్ రెడ్డి ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నాడు.
నిజాన్ని కళ్లకు కట్టినట్లుగా...
నిర్మాత మాట్లాడుతూ ..చరిత్ర అంటే జరిగిన నిజాన్ని కళ్లకు కట్టినట్లుగా చెప్పడం. అలాంటి ఒక నిజాన్ని జితేందర్ రెడ్డి బయోపిక్‌తో మీ ముందుకు తీసుకొస్తున్నాం. భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు లాంటి వాళ్ళ చరిత్ర తెలుసుకోవడం ఎంత ముఖ్యమో జితేందర్ రెడ్డి గురించి తెలుసుకోవడం కూడా అంతే ముఖ్యం.
జితేందర్‌రెడ్డి పాత్రలో రాకేష్ జీవించాడు. సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్రతి ఒక్కరికి జితేందర్ రెడ్డి పాత్ర గుర్తుండిపోతుంది ఆయన చేసిన సేవ గుర్తుండిపోతుంది. జితేందర్ రెడ్డి చరిత్ర ఒక షార్ట్ ఫిలిం గా తీద్దాం అనుకున్న. కానీ తను చేసిన పనులు ప్రజలందరికీ తెలియాలంటే సినిమా తీశాం అని అన్నాడు.
ఉయ్యాల జంపాల, మజ్ను తర్వాత...
డైరెక్టర్ విరించి వర్మ మాట్లాడుతూ ఉయ్యాల జంపాల, మజ్ను తర్వాత కొంత విరామం అనంతరం పొలిటికల్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రావడం ఎగ్జైటింగ్‌గా అనిపిస్తోంది. గతంలో కామెడీ లవ్ స్టోరీస్‌తో సినిమాలు చేశా. ఈ మూవీ మాత్రం వాటికి భిన్నంగా ఉంటుంది.
జితేందర్ రెడ్డి గురించి చదివిన తర్వాత ఇంత పవర్ఫుల్ క్యారెక్టర్ ను నేనే డైరెక్ట్ చేయాలి అనుకున్నాను. అదేవిధంగా జితేందర్ రెడ్డి గారి గురించి తెలుసుకోవడం కోసం ఆయన విలేజ్ కు వెళ్లి ఆయన స్నేహితులతో అక్కడున్న ప్రజలతో ఇంట్రారాక్ట్ అయ్యాను. జితేందర్ రెడ్డి జీవితాన్ని వాస్తవిక కోణంలో ఈ సినిమాలో చూపించబోతున్నానని తెలిపాడు.
రియా సుమన్ హీరోయిన్...
బాహుబలి, ఎవరికి చెప్పొద్దు తర్వాత నటుడిగా తనలోని భిన్న కోణాన్ని చాటిచెప్పే మూవీ ఇదని రాకేష్ వర్నే అన్నారు. జితేందర్ రెడ్డిలో రియా సుమన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఛత్రపతి శేఖర్, రవిప్రకాష్, సుబ్బరాజు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు గోపీసుందర్ మ్యూజిక్ అందిస్తున్నాడు.
ఎనిమిదేళ్ల తర్వాత...
ఉయ్యాల జంపాల మూవీతో డైరెక్టర్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు విరించి వర్మ. రాజ్‌తరుణ్, అవికా గోర్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ లవ్‌స్టోరీ క మర్షియల్ హిట్టుగా నిలిచింది. ఆ తర్వాత నానితో మజ్ను సినిమా చేశాడు. ఈ రెండు సినిమాలు సక్సెస్ అయినా ఆశించిన స్థాయిలో విరించి వర్మకు అవకాశాలు రాలేదు. దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత జితేందర్ రెడ్డితో టాలీవుడ్‌లోకి డైరెక్టర్‌గా రీఎంట్రీ ఇస్తోన్నాడు.