Actor Visweswara Rao: టాలీవుడ్‌లో విషాదం.. ప్రముఖ కమెడియన్ విశ్వేశ్వరరావు మృతి
Actor Visweswara Rao Died: సీనియర్ కమెడియన్ విశ్వేశ్వర రావు కన్నుమూశారు. అనారోగ్యం కారణంగా ఆయన మృతి చెందారు. వివరాలివే..
Actor Visweswara Rao Died: సినీ ఇండస్ట్రీని వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. సీనియర్ నటుడు, కమెడియన్ విశ్వేశ్వర రావు మృతి చెందారు. సుమారు 300 చిత్రాల్లో కమెడియన్‍గా నటించిన ఆయన 62 ఏళ్ల వయసులో నేడు (ఏప్రిల్ 2) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న విశ్వేశ్వరరావు కోలుకోలేక తుదిశ్వాస విడిచారు. ముఠామేస్త్రీ, మెకానిక్ అల్లుడు, శివాజీ సహా తెలుగు, తమిళంలో వందలాది సినిమాల్లో ఆయన నటించారు.
తమిళనాడులోని చెన్నైలోని సిరుశేరులో విశ్వేశ్వర రావు భౌతిక కాయాన్ని సందర్శనార్థం ఉంచారు కుటుంబ సభ్యులు. రేపు (ఏప్రిల్ 3) ఆయన అంత్యక్రియలు నిర్వహించేందుకు నిర్ణయించారు.
విశ్వేశ్వర రావు మృతి పట్ల తెలుగు, తమిళ సినీ ఇండస్ట్రీలకు చెందిన కొందరు ప్రముఖులు విచారం వ్యక్తం చేస్తున్నారు. చాలా మంది నెటిజన్లు కూడా ఆయనకు నివాళి వ్యక్తం చేస్తూ పోస్టులు చేస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలంటూ ఆకాంక్షిస్తున్నారు.
స్వస్థలం ఆంధ్రానే
విశ్వేశ్వర రావు బాలనటుడిగా సినీ కెరీర్ ప్రారంభించారు. అనేక చిత్రాలు చేశారు. ఆ తర్వాత తెలుగు, తమిళ ఇండస్ట్రీల్లో వందలాది చిత్రాల్లో నటించారు. విశ్వేశ్వరరావు సొంత ఊరు ఆంధ్రప్రదేశ్‍లోని కాకినాడనే. అయితే, సినిమాల్లో రాణిస్తుండటంతో వారి కుటుంబం అప్పట్లోనే చెన్నైలో స్థిరపడింది.
బాలనటుడి నుంచి..
బాలనటుడిగానే విశ్వేశ్వరరావు 150కు పైగా చిత్రాలు చేశారు. పొట్టి ప్లీడరు చిత్రంతో తెరంగేట్రం చేశారు. ఆ తర్వాత భక్తిపోతన, బాలమిత్రుల కథ, మా నాన్న నిర్దోషి, అందాల రాముడు సహా చాలా చిత్రాల్లో బాలనటుడిగా నటించారు. ఎన్టీఆర్, ఎంజీఆర్, రజినీకాంత్ సహా చాలా మంది అలనాటి హీరోల చిత్రాల్లో బాలనటుడిగా చేశారు. ఆ తర్వాత మలితరం నటుల చిత్రాల్లోనూ నటించారు. ముఠా మెస్త్రీ, ప్రెసిడెంట్ గారి పెళ్లాం, ఆమె కథ, అక్కడ అమ్మాయి - ఇక్కడబ్బాయి, అవును వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు సహా వందలాది చిత్రాల్లో నటించారు. రెండు తరాల నటులతో కలిసి.. మొత్తంగా విశ్వేశ్వర రావు 300కుపైగా చిత్రాల్లో కనిపించారు. 100కు పైగా సీరియళ్లలోనూ ఆయన నటించారు.
విశ్వేశ్వర రావు చాలా సినిమాల్లో తన కామెడీ టైమింగ్‍తో మెప్పించారు. ఆయన డైలాగ్ డెలివరీ కూడా విభిన్నంగా ఉండేది. ఆయన కామెడీ పలు చిత్రాలకు ప్లస్ అయింది. కొన్ని చిత్రాల్లో తెరపై కాసేపే కనిపించినా ఫుల్‍గా నవ్వించే పాత్రలు చేశారు. దీంతో విశ్వేశ్వరరావుకు మంచి గుర్తింపు వచ్చింది. చివరి వరకు కూడా ఆయన నటిస్తూనే ఉన్నారు. కొంతకాలంగా యూట్యూబ్‍లో ఆయన విస్సు టాకీస్ పేరుతో ఛానెల్ నిర్వహిస్తున్నారు. కొందరు సెలెబ్రిటీలను ఆయన ఇంటర్వ్యూలు చేశారు. కొన్ని కొత్త విషయాలు వాటి ద్వారా వెల్లడయ్యాయి. అయితే, చివరి వరకు నటనలోనే ఉన్న విశ్వేశ్వర రావు తుది శ్వాస విడిచారు.
ఇటీవలే డేనియల్ బాలాజీ..
ప్రముఖ తమిళ నటుడు డేనియల్ బాలాజీ ఇటీవలే కన్నుమూశారు. గుండెపోటు కారణంగా ఆయన గత శుక్రవారం (మార్చి 29) మృతి చెందారు. తమిళంలో చాలా సూపర్ హిట్ చిత్రాల్లో ఆయన నటించారు. ఎక్కువగా విలన్ పాత్రలు పోషించారు. తెలుగులో సాంబ, ఘర్షణ, టక్ జగదీశ్ సినిమాల్లోనూ డేనియల్ బాలాజీ నటించారు.
టాపిక్