Daniel Balaji Passed Away: షాకింగ్....ప్రముఖ కోలీవుడ్ నటుడు డేనియల్ బాలాజీ కన్నుమూత
Daniel Balaji Passed Away: ప్రముఖ కోలీవుడ్ న టుడు డేనియల్ బాలాజీ శుక్రవారం హఠాన్మరణం చెందాడు. గుండెపోటు తో డేనియల్ బాలాజీ కన్నుమూయడంతో తమిళ చిత్రసీమలో విషాదం నెలకొంది. తెలుగులో సాంబ, చిరుత, టక్ జగదీష్‌తో పాటు పలు సినిమాలు చేశాడు డేనియల్ బాలాజీ.
Daniel Balaji Passed Away: కోలీవుడ్ నటుడు డేనియల్ బాలాజీ (48) కన్నుమూశాడు. శుక్రవారం అర్థరాత్రి గుండెపోటుతో అతడు తుదిశ్వాస విడిచాడు. ఛాతినొప్పితో తీవ్ర అస్వస్థతకు గురైన డేనియల్ బాలాజీని కుటుంబసభ్యులు చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. హాస్పిటల్‌కు తరలించేలోపే అతడు మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించినట్లు సమాచారం.
విలన్ రోల్స్‌కు ఫేమస్...
డేనియల్ బాలాజీ తమిళంతో పాటు తెలుగు, మలయాళం, కన్నడలో యాభైకిపైగా సినిమాలు చేశాడు. ఎక్కువగా విలన్ రోల్స్‌లోనే కనిపించాడు. చిట్టి అనే తమిళ సీరియల్‌తో డేనియల్ బాలాజీ యాక్టింగ్ కెరీర్ మొదలైంది. పిన్ని పేరుతో తెలుగులో డబ్ అయిన ఈ సీరియల్ ఇక్కడ కూడా పాపులర్‌గా అయ్యింది. ఆ తర్వాత ఏప్రిల్ మదాతిల్, కాదల్ కొండెన్ సినిమాల్లో చిన్న రోల్స్ చేశాడు.
కమల్‌హాసన్, గౌతమ్ మీనన్ కాంబినేషన్‌లో వచ్చిన వెట్టైయాడు విలయాడు (తెలుగులో రాఘవన్ పేరుతో డబ్)లో సైకో క్యారెక్టర్‌లో తన విలనిజంతో ఆడియెన్స్‌ను భయపెట్టాడు డేనియల్ బాలాజీ. ఈ సినిమా నటుడిగా అతడికి మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత తమిళంలో పొల్లవదన్, జ్ఞానకిరుక్కన్, అచ్చం యెన్‌బదు మదమైయదా, వడాచెన్నై, బిగిల్‌తో పాటు తమిళంలో చాలా సినిమాల్లో నెగెటివ్ షేడ్స్ పాత్రల్లో కనిపించాడు. పోలీస్ క్యారెక్టర్స్ కూడా అతడికి పేరుతెచ్చిపెట్టాయి.
చివరగా గత ఏడాది అరియవాన్ అనే తమిళ సినిమాలో కనిపించాడు డేనియల్ బాలాజీ . అతడు కీలక పాత్రలు పోషించిన పలు తమిళ సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాయి.
తెలుగులో విలన్‌గా...
తెలుగులో ఐదారు సినిమాలు చేశాడు డేనియల్ బాలాజీ. ఎన్టీఆర్ సాంబ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత వెంకటేష్ ఘర్షణ మూవీలో హీరో ఫ్రెండ్స్ గ్యాంగ్‌లో ఒకరిగా కనిపించాడు. రామ్‌చరణ్ చిరుత, నాగచైతన్య సాహసం శ్వాసగా సాగిపో సినిమాల్లో వైవిధ్యమైన క్యారెక్టర్స్ చేశాడు.
నాని హీరోగా 2021లో రిలీజైన టక్ జగదీష్‌లో మెయిన్ విలన్‌గా డానియల్ బాలాజీ కనిపించాడు. ఇదే అతడి చివరి తెలుగు మూవీ కావడం గమనార్హం. చేసింది తక్కువ సినిమాలే అయినా విలక్షణ నటనతో దక్షిణాది చిత్రసీమలో ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్నాడు డేనియల్ బాలాజీ. మలయాళంలో డాడీ కూల్, భగవాన్ మోహన్‌లాల్, మమ్ముట్టిలకు ధీటుగా విలనిజాన్ని పండించాడు.
తెలుగు మూలాలున్న ఫ్యామిలీ...
డేనియల్ బాలాజీ తండ్రి తెలుగు మూలాలున్న కుటుంబంలో జన్మించాడు. అతడి తండ్రి తెలుగువాడు కాగా తల్లి తమిళ్.డైరెక్టర్ కావాలని ఫిలిం మేకింగ్ కోర్సు నేర్చుకున్న డేనియల్ బాలాజీ చివరకు నటుడిగా స్థిరపడ్డాడు. గౌతమ్‌మీనన్‌తో డేనియల్ బాలాజీకి చక్కటి అనుబంధముంది. కాక్క కాక్క నుంచి గౌతమ్ మీనన్ తీసిన చాలా సినిమాల్లో డేనియల్ బాలాజీ నటించాడు.
శనివారం అంత్యక్రియలు...
చెన్నైలోని పురసామివాకంలో శనివారం డేనియల్ బాలాజీ అంత్యక్రియలను కుటుంబసభ్యులు నిర్వహించబోతున్నారు. డేనియల్ బాలాజీ హఠాన్మరణంతో తమిళ చిత్రసీమలో విషాదం అలుముకుంది. డేనియల్ బాలాజీ మరణం తమను షాకింగ్‌కు గురిచేసిందని పలువురు ఇండస్ట్రీ ప్రముఖులు సంతానం వ్యక్తం చేస్తున్నారు.