Sasimadhanam Review: శశి మథనం వెబ్‌సిరీస్ రివ్యూ - ప్రియుడిని సీక్రెట్‌గా తన ఇంట్లోనే ప్రియురాలు దాచిపెడితే..?
07 July 2024, 11:37 IST
Sasimadhanam Web Series Review:: పవన్ సిద్ధు, సోనియా సింగ్ ప్రధాన పాత్రల్లో నటించిన శశిమథనం వెబ్‌సిరీస్ ఈటీవీ విన్ ఓటీటీలో రిలీజైంది. ఫన్ లవ్‌స్టోరీగా తెరకెక్కిన ఈ తెలుగు వెబ్‌సిరీస్ ప్రేక్షకులను మెప్పించిందా? లేదా? అంటే...
శశిమథనం వెబ్‌సిరీస్ రివ్యూ
Sasimadhanam Web Series Review: పవన్ సిద్ధు, సోనియా సింగ్ జంటగా నటించిన శశిమథనం తెలుగు వెబ్‌సిరీస్ ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సిరీస్‌కు వినోద్ గాలి దర్శకత్వం వహించాడు. రొమాంటిక్ ఫన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కి ఈ సిరీస్ ఎలా ఉందంటే?
శశి...మదన్..లవ్‌స్టోరీ...
మదన్ (పవన్ సిద్ధు) ఎలాంటి బరువు బాధ్యతలు లేని మిడిల్ క్లాస్ కుర్రాడు. అన్నయ్య సంపాదన మీద ఆధారపడి బతుకుంటాడు. పేకాట, బెట్టింగ్‌లలో భాస్కర్ అనే వ్యక్తికి ఐదు లక్షలు అప్పు పడతాడు. అప్పు తీర్చే మార్గం దొరక్కపోవడంతో అన్నయ్య బైక్‌ను భాస్కర్ దగ్గర తాకట్టు పెడతాడు. అయినా అప్పు తీరకపోవడంతో కొద్ది రోజులు భాస్కర్‌కు దొరక్కుండా తన లవర్ శశిరేఖ (సోనియా సింగ్) ఇంట్లో దాక్కోవాలని మదన్ ఫిక్సవుతాడు.
శశిరేఖ తల్లిదండ్రులతో పాటు తాతయ్య ఓ పెళ్లి కోసం పది రోజుల పాటు ఊరికి వెళతారు. వాళ్లు వచ్చే వరకు శశిరేఖతో కలిసి ఆమె ఇంట్లోనే ఉండాలని మదన్ స్కెచ్ వేస్తాడు. కానీ పెళ్లి క్యాన్సిల్ కావడంతో శశి తల్లిదండ్రులు వెళ్లిన రోజే తిరిగొస్తారు. దాంతో మదన్‌ను తల్లిదండ్రుల కంట పడకుండా తన రూమ్‌లోనే సీక్రెట్‌గా దాచేస్తుంది శశి. ఆ తర్వాత ఏమైంది?
మదన్‌ను దాచిపెట్టే క్రమంలో శశి ఎన్ని ఇబ్బందులను ఎదుర్కొంది? శశి, మదన్ కలిసి ఆడిన ఈ దాగుడు మూతల ఆట ఎలాంటి గందరగోళాన్ని సృష్టించింది? మదన్‌ను తమ ఇంట్లోనే శశి దాచిన సంగతి ఆమె తల్లిదండ్రులకు ఎలా తెలిసింది? శశి మదన్ లైఫ్‌లోకి వచ్చిన రంగమ్మత్త (రూపలక్ష్మి), రమ్య ఎవరు? అన్నయ్య మంచితనాన్ని మదన్ ఎలా అర్థం చేసుకున్నాడు? అన్నదే శశిమథనం సిరీస్ కథ.
రొమాంటిక్ లవ్ స్టోరీ...
శశి మథనం సింపుల్ స్టోరీతో తెరకెక్కిన రొమాంటిక్ లవ్ ఎంటర్‌టైనర్ వెబ్ సిరీస్. తన కుటుంబసభ్యులకు తెలియకుండా ప్రియుడిని ఇంట్లోనే దాచిపెట్టిన ఓ ప్రియురాలి కథతో ఈ వెబ్ సిరీస్‌ను తెరకెక్కించాడు దర్శకుడు వినోద్ గాలి. నాయకానాయికల కెమిస్ట్రీ, వారి గల్లికజ్జాలు, అలకలు, కోపాలతో ఈ క్యూట్ లవ్‌స్టోరీకి ఫన్‌ను జోడించి ఆద్యంతం ఎంటర్‌టైనింగ్‌గా ఈ సిరీస్‌ను నడిపించాడు డైరెక్టర్.
కథ మొత్తం ఒకే ఇంట్లో...
శశి మథనం సిరీస్ చాలా వరకు ఒకే ఇంట్లో, ఐదారు ప్రధాన పాత్రల నేపథ్యంలోనే సాగుతుంది. వారి మధ్యలోకి ఒక్కో ఎపిసోడ్‌లో ఒక్కో కొత్త క్యారెక్టర్ ఎంట్రీ ఇచ్చేలా స్క్రీన్‌ప్లే రాసుకున్నాడు దర్శకుడు. నాయకానాయికలు మొదలుకొని ప్రతి క్యారెక్టర్‌ను జోవియల్‌గా ఫన్ వేలో డిజైన్ చేసుకున్నాడు. వాటిలో కొన్ని క్యారెక్టర్ బాగానే నవ్వించగా...మరికొన్ని బోర్ కొట్టించాయి.
ఫస్ట్ ఎపిసోడ్ ట్విస్ట్ హైలైట్...
మదన్ క్యారెక్టర్ పరిచయం నేపథ్యంలోనే ఫస్ట్ ఎపిసోడ్ సాగుతుంది. బెట్టింగ్ అప్పులకు భయపడి శశిరేఖ ఇంట్లో దాక్కోవడం, ఆ తర్వాత వచ్చే ట్విస్ట్‌తో ఫస్ట్ ఎపిసోడ్‌ను ఎండ్ చేశారు. అసలు కథ సెకండ్ ఎపిసోడ్ నుంచే సాగుతుంది. తన ఇంట్లో వాళ్లకు కనబడకుండా మదన్‌ను దాచిపెట్టడానికి శశి పడే కష్టాలన్నీ వినోదాన్ని పంచుతాయి. రంగమ్మత్త పాత్ర గురించి ఇచ్చిన బిల్డప్, వాటి తాలూకు సీన్స్ నుంచి కామెడీ బాగానే జనరేట్ అయ్యింది.
కన్ఫ్యూజన్ కామెడీ...
శశి పెళ్లిచూపుల సీన్, పెళ్లిని చెడగొట్టడానికి స్నేహితుడితో కలిసి మదన్ వేసే ప్లాన్స్‌లోని కన్ఫ్యూజన్ కామెడీ బాగా వర్కవుట్ అయ్యింది. ఐదో ఎపిసోడ్ వరకు కామెడీతోనే లాగించిన దర్శకుడు చివరి ఎపిసోడ్‌ను ఎమోషనల్‌గా తీర్చిదిద్దాడు. . శశి ప్రేమ కోసం మదన్ ఎలా మారాడు? మనవరాలి ప్రేమకు శశి తాతయ్య ఎలా సపోర్ట్ చేశాడన్నది చూపించి సిరీస్‌ను ఎండ్ చేశారు.
లాజిక్స్ మిస్...
శశి తాతయ్యతో కలిసి మదన్ ఇంట్లోనే మందు పార్టీలు చేసుకున్న ఆమె తల్లిదండ్రులు కనిపెట్టకపోవడం లాంటి సీన్స్‌లో లాజిక్‌లు కనిపించవు. శశి, మదన్ లవ్ సీన్స్ రిపీటెడ్‌లా అనిపిస్తాయి.రమ్య ఎపిసోడ్, దయ్యం ట్రాక్ అంతగా ఆకట్టుకోలేకపోయాయి.
సోనియా సింగ్ హైలైట్...
శశిగా సోనియా సింగ్ క్యారెక్టర్ ఈ సిరీస్‌కు హైలైట్‌గా నిలిచింది. క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్, నాచురల్ యాక్టింగ్‌తో ఆకట్టుకుంటుంది. శశి క్యారెక్టర్‌ను బాగా ఓన్ చేసుకొని నటించింది. మదన్‌గా పవన్ యాక్టింగ్ ఒకే అనిపిస్తుంది. అతడి కామెడీ టైమింగ్ బాగుంది. రూపలక్ష్మి, ప్రదీప్ రాపర్తి, కేశవ్ దీపక్‌తో పాటు మిగిలిన నటీనటుల తమ పాత్రలకు న్యాయం చేశారు.
టైమ్‌పాస్ ఎంటర్‌టైనర్…
శశిమథనం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నవ్వులను పంచే టైమ్‌పాస్ ఎంటర్‌టైనర్ సిరీస్. సోనియా సింగ్, పవన్ సిద్ధూ జోడీ, వారి కెమిస్ట్రీ కోసం సిరీస్‌ను చూడొచ్చు.
రేటింగ్: 2.75/5