Santhanam A1 Movie: తమిళంలో రిలీజైన ఐదేళ్ల తర్వాత తెలుగులోకి వచ్చిన సంతానం కామెడీ మూవీ - డైరెక్ట్‌గా ఓటీటీలోకే..
29 February 2024, 6:03 IST
Santhanam A1 Movie: సంతానం హీరోగా నటించిన తమిళ మూవీ ఏ1 తెలుగులోకి వచ్చేసింది. డైరెక్ట్‌గా అమెజాన్ ప్రైమ్‌లో ఈ మూవీ రిలీజైంది.
సంతానం ఏ1 మూవీ
Santhanam A1 Movie: కోలీవుడ్ స్టార్ కమెడియన్ సంతానం హీరోగా నటించిన తమిళ మూవీ ఏ1 కమర్షియల్‌గా పెద్ద విజయాన్ని సాధించింది. సంతానాన్ని హీరోగా నిలబెట్టిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది. తమిళంలో రిలీజైన ఐదేళ్ల తర్వాత ఏ1 మూవీ తెలుగులోకి వచ్చింది. అది కూడా డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజైంది. ఏ1 తెలుగు వెర్షన్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ఫ్రీగా కాకుండా రెంటల్ విధానంలో ఏ1 మూవీని రిలీజ్ చేశారు. సంతానం కామెడీ మూవీని చూడాలంటే అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్‌తో పాటు 79 రూపాయలు చెల్లించాల్సిందే.
సంతానం కామెడీ టైమింగ్...
రొమాంటిక్ కామెడీ కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీతో జాన్సన్ కే దర్శకుడిగా కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్లలో రిలీజైన ఈ మూవీ చక్కటి వసూళ్లను దక్కించుకున్నది. ఈ మూవీలో సంతానం కామెడీ టైమింగ్ అభిమానులను ఆకట్టుకున్నది. స్టార్ హీరోల సినిమాలతో పోటీగా రిలీజై బాక్సాఫీస్ విన్నర్‌గా నిలిచింది.
ఏ1 కథ ఇదే…
శరవణన్ (సంతానం) ఓ బట్టలషాప్ నడుపుతుంటాడు. దివ్య (తార అలీషా) అనే అమ్మాయిని తొలిచూపులోనే ప్రేమిస్తాడు. ఓ రౌడిని పెళ్లిచేసుకోవాలన్నది దివ్య కల. అతడు తన కులం వాడై ఉండాలని కండీషన్ పెడుతుంది. ప్రేమ కోసం తాను రౌడీ అని శరవణన్ అబద్ధం ఆడుతాడు? ఆ తర్వాత ఏమైంది.
దివ్య ప్రేమ కోసం శరవణన్ రౌడీగా మారాడా? లేదా? అన్నదే ఏ1 మూవీ కథ. ఈ సినిమాకు దసరా ఫేమ్ సంతోష్ నారాయణన్ సంగీతాన్ని అందించాడు. ఈ సినిమాలో సంతానం సరసన తార అలీషా బెర్రీ హీరోయిన్‌గా నటించింది. తెలుగులో నాగచైతన్య 100 పర్సెంట్ లవ్‌లో ఓ కీలక పాత్రలో నటించింది. ఆ తర్వాత మనీ మనీ మోర్ మనీ అనే సినిమాలు చేసింది.
హయ్యెస్ట్ రెమ్యునరేషన్...
కోలీవుడ్‌లో స్టార్ కమెడియన్లలో ఒకరిగా పేరు తెచ్చుకున్నాడు సంతానం. లెజెండరీ కమెడియన్స్ వడివేలు, వివేక్ తర్వాత తమిళంలో గొప్ప హాస్యనటుల్లో ఒకరిగా అతడిని పేర్కొన్నారు. హీరోలతో సమానంగా రెమ్యునరేషన్ తీసుకనే స్థాయికి సంతానం చేరుకున్నాడు. చాలా సినిమాల్లో హీరో స్నేహితుడిగా తన కామెడీతో నవ్వించాడు. సంతానం లేకుండా అప్పట్లో సినిమా వచ్చేది కాదు.
సంతానం కామెడీతోనే హిట్టైన సినిమాలు తమిళంలో చాలా ఉన్నాయి.సంతానం కమెడియన్‌గా నటించిన పలు తమిళ సినిమాలు తెలుగులోకి అనువాదమై ప్రేక్షకుల్ని మెప్పించాయి. కమెడియన్‌గా బిజీగా ఉన్న తరుణంలోనే హీరోగా ఎంట్రీ ఇచ్చాడు సంతానం. ఆ తర్వాత కామెడీ పాత్రలకు దూరమయ్యాడు. మళ్లీ కమెడియన్‌గా సంతానం రీఎంట్రీ ఇవ్వబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
మేఘ ఆకాష్ హీరోయిన్
సంతానం హీరోగా నటించిన దిల్లుకుదుడ్డు, డీడీ రిటర్న్స్ సినిమాలు కమర్షియల్ హిట్స్‌గా నిలిచాయి.ప్రస్తుతం హీరోగా వడక్కుపట్టి రామస్వామి అనే సినిమా చేస్తున్నాడు సంతానం. ఈ సినిమాలో మేఘ ఆకాష్ హీరోయిన్‌గా నటిస్తోంది. వడక్కుపట్టి రామస్వామి సినిమాలో సంతానం ఓ పాటను కూడా పాడాడు.సంతానం హీరోగా నటిస్తోన్న మరో మూడు సినిమాలు షూటింగ్‌ను జరుపుకుంటున్నాయి.