Saba Nayagan Review: సబా నాయగన్ రివ్యూ - చాందిని చౌదరి, మేఘ ఆకాష్ కోలీవుడ్ సూపర్ హిట్ మూవీ ఎలా ఉందంటే?
Saba Nayagan Review: అశోక్ సెల్వన్, చాందిని చౌదరి, మేఘ ఆకాష్ హీరోహీరోయిన్లుగా నటించిన సబా నాయగన్ మూవీ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమాకు సీఎస్ కార్తికేయన్ దర్శకత్వం వహించాడు.
Saba Nayagan Review: అశోక్ సెల్వన్, చాందిని చౌదరి, మేఘ ఆకాష్ (Megha akash) హీరోహీరోయిన్లుగా నటించిన సబా నాయగన్ మూవీ ఇటీవల డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో (Disney Plus Hotstar) రిలీజైంది. యూత్‌ఫుల్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ మూవీకి సీఎస్ కార్తికేయన్ దర్శకత్వం వహించాడు. గత డిసెంబర్‌లో థియేటర్లలో విడుదలై కమర్షియల్ హిట్‌గా నిలిచిన ఈ మూవీ ఎలా ఉందంటే?
సబా ప్రియురాలు ఎవరు?
ఎలక్షన్ టైమ్ కావడంతో రోడ్లపై అల్లరి చేస్తోన్న వారిని అరెస్ట్ చేయమని పోలీసులకు ఆదేశాలు అందుతాయి. రోడ్డుపై తాగి డ్యాన్సులు చేస్తూ పోలీసులకు దొరికిపోతాడు అరవింద్ అలియాస్ సబా. జీపులో పోలీస్ స్టేషన్‌కు తీసుకెళుతోండగా కానిస్టేబుల్స్‌కు తన లవ్ స్టోరీస్ గురించి చెబుతాడు సబా. లెవెన్త్ స్టాండర్డ్‌లో ఉండగా ఈషాతో తొలిచూపులోనే ప్రేమలో పడతాడు సబా. ఆ కాలేజీలో చదువు పూర్తయ్యే లోగా తన ప్రేమను ఆమెకు వ్యక్తం చేసే అవకాశం అతడికి దక్కదు. ఇంజినీరింగ్‌లో రియాను ఇష్టపడతాడు. రియా కూడా సబాను ప్రేమిస్తుంది. అంత సాఫీగా సాగిపోతోన్న టైమ్‌లో సబాకు బ్రేకప్ చెప్పిన రియా తన క్లాస్‌మేట్‌ను పెళ్లిచేసుకొని ఫారిన్ వెళ్లి సెటిలవుతుంది.
ఆ బాధలో ఉండగానే మళ్లీ అతడి జీవితంలోకి ఈషా వస్తుంది? ఆమె ప్రేమను ఎలాగైనా దక్కించుకోవాలని సబా చాలా ప్రయత్నాలు చేస్తుంటాడు. కానీ అవేవీ సక్సెస్ కావు. ఏమ్‌బీఏలో జాయిన సబా...మేఘను లవ్ చేస్తాడు. కానీ ఆమెకు తన ప్రేమను ఎలా చెప్పాలో తెలియక సతమతమవుతుంటాడు. తన ప్రేమ విషయం మేఘకు సబా ఎలా చెప్పాడు?
సబా తనను ప్రేమిస్తోన్న విషయం ఈషాకు ఎలా తెలిసింది? రియా అతడికి ఎందుకు దూరమైంది? అసలు నిజంగానే సబా తాగి పోలీసులకు దొరికాడా? పోలీసులకు లన ఫెయిల్యూర్ లవ్‌స్టోరీస్‌ను సబా చెప్పడానికి కారణం ఏమిటి? ఈషా, రియా, మేఘ కాకుండా సబా జీవితంలోకి వచ్చిన మరో అమ్మాయి దీప్తి ఎవరు అన్నదే సబా నాయగన్(Saba Nayagan Review) కథ.
ప్రేమమ్ లాంటి లవ్ స్టోరీ కానీ...
ఓ యువకుడి జీవితంలో భిన్న దశల్లో సాగే ప్రేమకథలు, విఫల ప్రేమ తాలూకు జ్ఞాపకాలతో దక్షిణాది బాషల్లో వచ్చిన ప్రేమమ్, కేరాఫ్ కంచెరపాలెం లాంటి సినిమాలు ప్రేక్షకుల్ని అలరించాయి. సబా నాయగన్(Saba Nayagan Review) కూడా అలాంటి లవ్‌స్టోరీనే. ప్రేమమ్, కేరాఫ్ కంచెరపాలెం సినిమాలు సీరియస్ ఎమోషన్స్‌తో సాగితే...సబా నాయగన్ మాత్రం వాటికి భిన్నంగా ఔట్ అండ్ ఔట్ ఎంటర్‌టైనర్‌గా సాగుతుంది.
మూడు ప్రేమకథలు...
మూడు ప్రేమకథలతో దర్శకుడు సీఎస్ కార్తికేయన్ సబా నాయగన్(Saba Nayagan Review) సినిమాను తెరకెక్కించాడు. యూత్ ఆడియెన్స్‌ను టార్గెట్ చేస్తూ ఫన్నీగా ఈ లవ్‌స్టోరీస్‌ను రాసుకున్నాడు డైరెక్టర్. ప్రతి సీన్‌లో నవ్వించడమే ధ్యేయంగా పెట్టుకున్నాడు. డైరెక్టర్ రాసుకున్న కామెడీ సీన్స్ చాలా వరకు వర్కవుట్ అయ్యాయి. ఫన్ కోసం పాత సూపర్ హిట్ సాంగ్స్, చిరంజీవి, రజనీకాంత్ వంటి స్టార్స్ డైలాగ్స్, సీన్స్ వాడుకున్నాడు. అవన్నీ హిలేరియస్‌గా నవ్వించాయి.
థ్రిల్లింగ్ క్లైమాక్స్...
సబా, ఈషా లవ్ ట్రాక్ క్యూట్ గా, ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుంది. చదువుపై ఇంట్రెస్ట్ లేని సబా తన స్నేహితులతో కలిసి చేసే అల్లరి పనులతో సరదాగా ఫస్ట్ హాఫ్ ను నడిపించాడు డైరెక్టర్. సబా, ఈషా ప్రేమను సక్సెస్ చేయడానికి అతడి స్నేహితులు ప్లాన్స్ వేయడం, అవన్నీ రివర్స్ అయ్యే సీన్స్ నుంచి కామెడీ చక్కగా జనరేట్ అయ్యింది. సబా, రియా లవ్‌స్టోరీలో ఆ స్థాయి వినోదం మిస్సయింది. ఈ లవ్ స్టోరీని మొత్తం సాగదీసినట్లుగా అనిపిస్తుంది.
మేఘ లవ్‌స్టోరీని త్వరత్వరగా ఎండ్ చేసిన ఫీలింగ్ కలుగుతుంది. అందుకు ఓ రీజన్ చెప్పిన అది కన్వీన్సింగ్‌గా అనిపించదు. ప్రీ క్లైమాక్స్‌లో పోలీసులతో సబా తన లవ్ స్టోరీస్ చెప్పడం వెనుక ఓ ట్విస్ట్‌ను ఉందంటూ ఆడియెన్స్‌ను థ్రిల్ చేశాడు డైరెక్టర్. సబా అసలైన గర్ల్‌ఫ్రెండ్ ఎవరన్నది క్లైమాక్స్‌లో రివీల్ చేసి, అతడి లవ్ సక్సెస్ అయినట్లుగా చూపించారు.
అశోక్ సెల్వన్ వన్ మెన్ షో...
సబా నాయగన్(Saba Nayagan Review) సినిమాకు అశోక్ సెల్వన్ వన్ మెన్ షోగా నిలిచాడు. ప్రేమించడమే లక్ష్యంగా పెట్టుకున్న నవతరం యువకుడిగా అతడి నటన, కామెడీ టైమింగ్ బాగున్నాయి. తన అవసరం కోసం స్నేహితుల్ని వాడుకోవడం, ఎలాంటి అబద్ధం ఆడటానికైనా వెనుకాడని యువకుడిగా యూత్‌కు రిలేట్ అయ్యేలా సబా క్యారెక్టర్‌ను ఫన్నీగా రాసుకున్నాడు డైరెక్టర్.
ముగ్గురు హీరోయిన్లలో కార్తీక మురళీధరన్‌కు ఎక్కువ స్క్రీన్‌టైమ్ దొరికింది. తన లుక్స్‌తో ఆకట్టుకుంది. రియాగా తెలుగమ్మాయి చాందిని చౌదరి కనిపించింది. యాక్టింగ్ పరంగా ఎలాంటి ఛాలెంజెస్ లేని సింపుల్ పాత్ర ఆమెది. మేఘ ఆకాష్ గెస్ట్ రోల్‌కు ఎక్కువ. హీరోయిన్‌గా తక్కువ అన్నట్లుగా ఉంటుంది. హీరో తర్వాత అతడి ఫ్రెండ్‌గా కనిపించిన ఎస్ఎస్ పాత్ర కామెడీ పరంగా ఈ సినిమాకు ప్లస్ పాయింట్‌గా నిలిచింది. అతడు కనిపించిన ప్రతి సీన్ నవ్విస్తుంది.
రెండున్నర గంటలు నవ్వులే...
సబా నాయగన్ ఆద్యంతం నవ్వులను పంచే యూత్‌ఫుల్ ఫన్ లవ్ స్టోరీ. రెండున్నర గంటలు ఫుల్ టైమ్‌పాస్ చేస్తుంది.