Roja Husband: రోజా భర్త డైరెక్షన్‌లో వచ్చిన తెలుగు సినిమాలు ఇవే - ఇరవై ఐదేళ్ల కెరీర్‌లో ఎన్ని సినిమాలు చేశాడంటే?
19 December 2024, 11:45 IST
Roja Husband: సీనియర్ హీరోయిన్, మాజీ మంత్రి రోజా భర్త ఆర్‌కే సెల్వమణి తమిళంలో అగ్ర దర్శకుల్లో ఒకరిగా పేరు తెచ్చుకున్నాడు. తమిళంలో పలువురు స్టార్ హీరోలతో సినిమాలు చేసిన సెల్వమణి తెలుగులో రెండు సినిమాలను రూపొందించాడు. ఆ సినిమాలు ఏవంటే?
భర్త సెల్వమణితో రోజా
Roja Husband: టాలీవుడ్ సీనియర్ హీరోయిన్, మాజీ మంత్రి రోజా భర్త ఆర్ కే సెల్వమణి తమిళంలో అగ్ర దర్శకుల్లో ఒకరిగా పేరు తెచ్చుకున్నాడు. విజయ్‌కాంత్, మమ్ముట్టి లాంటి అగ్ర కథానాయకులతో సినిమాలు చేశాడు. 1990లో విజయ్ కాంత్ హీరోగా వచ్చిన కెప్టెన్ ప్రభాకర్ మూవీతో తమిళంలో ఫస్ట్ బ్లాక్‌బస్టర్ హిట్‌ను అందుకున్నాడు సెల్వమణి.
కెప్టెన్ ప్రభాకర్‌తో తమిళంలో యాక్షన్ సినిమాల దర్శకుడిగా సెల్వమణిపై ముద్రపడింది. రాజ ముథిరాయై, మక్కల్ ఆచి, అరసియాల్‌తో పాటు తమిళంలో పలు యాక్షన్ మూవీస్ తెరకెక్కించాడు సెల్వమణి.
తెలుగులో రెండు సినిమాలు...
25 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో దర్శకుడిగా తెలుగులోనూ రెండు సినిమాలు చేశాడు సెల్వమణి. ఈ రెండు సినిమాల్లో రోజా హీరోయిన్‌గా నటించడం గమనార్హం. 1994లో సుమన్, రెహమాన్, రోజా హీరోహీరోయిన్లుగా సమరం పేరుతో ఓ మూవీని తెరకెక్కించాడు సెల్వమణి.
యాసిడ్ దాడి ఆధారంగా...
1992లో ఐఏఎస్ ఆఫీసర్ చంద్రలేఖపై జరిగిన యాసిడ్ దాడి ఆధారంగా సమరం మూవీని రూపొందించాడు సెల్వమణి. ముఖ్యమంత్రి ఆదేశాల్ని ధిక్కరించిన ఓ కలెక్టర్‌కు ఎలాంటి అడ్డంకులను ఎదుర్కొంది? తన తల్లికి జరిగిన అన్యాయంపై ఆమె కూతురు ఎలాంటి న్యాయ పోరాటం చేసిందని అనే అంశాలతో ఈ మూవీ తెరకెక్కింది. కోట శ్రీనివసరావు, సిల్క్ స్మిత ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీ కమర్షియల్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాలో ఇళయరాజా అందించిన పాటలు మ్యూజిక్ లవర్స్‌ను ఆకట్టుకున్నాయి.
దుర్గ మూవీ...
ఆ తర్వాత తెలుగు సినిమాలకు లాంగ్ గ్యాప్ ఇచ్చిన సెల్వమణి 2000 ఏడాదిలో దుర్గ సినిమాల చేశాడు. భక్తిప్రధాన కథాంశంతో రూపొందిన ఈ మూవీలో రోజా, రమ్యకృష్ణ కీలక పాత్రల్లో నటించారు. వేణు హీరోగా నటించాడు.
రోజా వందవ సినిమాగా దుర్గ రిలీజైంది. అనేక వివాదాల నడుమ రిలీజైన ఈ మూవీ మిక్స్‌డ్ టాక్‌ను తెచ్చుకున్నది. ఈ రెండు బైలింగ్వల్ సినిమాలు మినహా తెలుగులో డైరెక్టర్‌గా కనిపించలేదు సెల్వమణి.
సినిమాలకు దూరంగా...
యంగ్ డైరెక్టర్లతో పోటీ, పరాజయాల కారణంగా 2015లో వచ్చిన పులన్ విశారణై 2 తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమయ్యాడు సెల్వమణి. ప్రస్తుతం దక్షిణ భారత సినీ కార్మికుల సమాఖ్యకు ప్రెసిడెంట్‌గా కొనసాగుతోన్నాడు. కెరీర్‌లో దర్శకుడిగా సెల్వమణి పదిహేనుకుపైగా సినిమాలు చేస్తే అందులో చాలా వాటిలో రోజా హీరోయిన్‌గా నటించింది.
ఓ తమిళ సినిమా షూటింగ్‌లోనే వీరి మధ్య మొదలైన పరిచయం ప్రేమగా మారినట్లు సమాచారం. సీతారత్నం గారి అబ్బాయి షూటింగ్‌లోనే సెల్వమణి తనకు ప్రపోజ్ చేశాడని, కుటుంబసభ్యులను ఒప్పించడానికి 11 ఏళ్లు ఎదురూసి ఆ తర్వాతే తాము పెళ్లి పీటలు ఎక్కినట్లు గతంలో ఓ ఇంటర్వ్యూలో రోజా చెప్పింది.