TG Adulterated Ginger : హైదరాబాద్ వాసులకు అలర్ట్.. యాసిడ్‌తో అల్లం పేస్ట్‌ తయారీ.. హోటళ్లకు సప్లై-task force police arrest gang involved in making ginger with acid in hyderabad ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tg Adulterated Ginger : హైదరాబాద్ వాసులకు అలర్ట్.. యాసిడ్‌తో అల్లం పేస్ట్‌ తయారీ.. హోటళ్లకు సప్లై

TG Adulterated Ginger : హైదరాబాద్ వాసులకు అలర్ట్.. యాసిడ్‌తో అల్లం పేస్ట్‌ తయారీ.. హోటళ్లకు సప్లై

Basani Shiva Kumar HT Telugu
Nov 18, 2024 12:53 PM IST

TG Adulterated Ginger : కాసుల కోసం కక్కుర్తిపడి కొందరు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. నిత్యావసర వస్తువులను కల్తీ చేస్తున్నారు. ఏకంగా యాసిడ్ వినియోగిస్తున్నారు. తాజాగా.. యాసిడ్‌తో అల్లం పేస్ట్ తయారు చేసే ముఠాను పోలీసులు పట్టుకున్నారు. 8 మందిని అరెస్టు చేశారు.

యాసిడ్‌తో అల్లం పేస్ట్‌ తయారీ
యాసిడ్‌తో అల్లం పేస్ట్‌ తయారీ (istockphoto)

హైదరాబాద్ వాసులను భయపెట్టే మరో విషయం వెలుగులోకి వచ్చింది. యాసిడ్‌తో అల్లం పేస్ట్ తయారు చేస్తున్నారు. సోనీ జింజర్‌ గార్లిక్‌ పేస్ట్‌ పేరుతో.. దాన్ని నగర చుట్టుపక్కల ఉన్న హోటళ్లకు సరఫరా చేస్తున్నారు. సికింద్రాబాద్‌ ఓల్డ్‌ బోయిన్‌పల్లిలో అల్లం పేస్ట్‌ తయారీ కేంద్రంపై తాజాగా టాస్క్‌ఫోర్స్‌ అధికారులు దాడులు చేశారు. ఈ దాడులతో విషయం వెలుగులోకి వచ్చింది.

అల్లం పేస్ట్ తయారీ కేంద్రం నుంచి టాస్క్‌ఫోర్స్ అధికారులు 1500 కిలోల కల్తీ అల్లంపేస్ట్‌ స్వాధీనం చేసుకున్నారు. 8 మందిని అరెస్ట్‌ చేశారు. మహ్మద్‌ షఖీల్‌ అహ్మద్‌ అనే వ్యక్తి ఈ దందా సాగిస్తున్నట్టు టాస్క్‌ఫోర్స్ అధికారులు గుర్తించారు. అల్లంకు బదులు సిట్రిక్‌ యాసిడ్, ఉప్పు, పసుపును ఉపయోగిస్తూ.. అల్లం లేకుండానే పేస్ట్‌ తయారు చేస్తున్నారని అధికారులు వివరించారు.

ఇలా తయారు చేసిన పేస్ట్‌ను హైదరాబాద్ నగరంతోపాటు చుట్టుపక్కల జిల్లాల్లోనూ విక్రయించారు. సొంతంగా ఏజెంట్లను పెట్టుకొని ప్రముఖ హోటళ్లకు సరఫరా చేస్తున్నట్టు గుర్తించారు. సోనీ జింజర్‌ గార్లిక్‌ పేస్ట్‌ పేరుతో.. ఆన్‌లైన్‌లోనూ విక్రయిస్తున్నారు. మూడేళ్లుగా ఈ దందా సాగుతున్నా.. అధికారులు గుర్తించకపోవడంపై విమర్శలు వస్తున్నాయి.

ఇటీవల ఈ కల్తీ దందాపై ఫిర్యాదులు వచ్చాయి. అప్పుడు గానీ అధికారులకు ఈ విషయం తెలియలేదు. ఫిర్యాదులు రావడంతో.. బోయిన్‌పల్లి పోలీసులు, టాస్క్‌ఫోర్స్‌ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో అసలు బాగోతం బయటపడింది. కల్తీ అల్లం పేస్ట్‌ 1500 కిలోలు, సిట్రిక్‌ యాసిడ్‌ 55 కిలోలు, 480 కిలోల నాసిరకం వెల్లుల్లిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

అల్లం పేస్ట్ తయారీ కోసం పని చేస్తున్న రంజిత్‌కుమార్‌ (19), మోను కుమార్‌(20), బిర్వాల్‌ సాహ్‌(19), సమీర్‌ అన్సారీ(33), గుల్ఫార్జ్‌(32), ముక్తార్‌ (27), ఇనాయత్‌(32), మహేశ్‌కుమార్‌ (20)లను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఏయే హోటళ్లకు సరఫరా చేశారు.. ఎన్ని రోజుల నుంచి సరఫరా చేస్తున్నారనే వివరాలను సేకరిస్తున్నారు. ఈ దందాలో ఇంకా ఎవరున్నారనే కోణంలోనూ విచారణ జరుపుతున్నారు.

ప్రమాదకరంగా..

గతంలో హైదరాబాద్ బిర్యానీకి ఎంతో పేరుండేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ఆహార భద్రత ఆందోళనకరంగా మారింది. రెస్టారెంట్లు, హోటళ్లలో ఫుడ్ తినడం ప్రమాదకరంగా మారిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. జీహెచ్ఎంసీ, ఫుడ్ సేఫ్టీ అధికారులు పలు రెస్టారెంట్లు, హోటళ్లపై చేసిన దాడుల్లో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. కుళ్లిన చికెన్, పురుగులు పట్టిన అల్లంవెల్లుల్లి పేస్టులు, పాడైపోయిన మసాలాలు, గడువు ముగిసిన ఆహార పదార్థాలను బిర్యానీలోకి ఉపయోగిస్తున్నట్లు తేలింది. దీంతో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పడిపోయింది.

Whats_app_banner